పిన్నెల్లికి హైకోర్టులో బిగ్ రిలీఫ్

తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఈవీఎం వ్యవహారంలో పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న తరుణంలో..

పిన్నెల్లికి హైకోర్టులో బిగ్ రిలీఫ్

Pinnelli Ramakrishna Reddy : ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. జూన్ 5 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. జూన్ 5 వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.

ఈవీఎం ధ్వంసం ఘటనలో పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న తరుణంలో.. పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై విచారణ జరిపిన కోర్టు.. ఆయనకు ఊరటనిచ్చేలా ఆదేశాలు ఇచ్చింది.

ఈవీఎం ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి పరారీలో ఉన్నారు. పోలీసులు తన కోసం గాలిస్తున్నారని, అరెస్ట్ చేస్తారని ఆందోళన చెందిన ఆయన.. హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ కు వెళ్లడం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. పిల్లిని అరెస్ట్ చేయాలని నేరుగా ఈసీ ఆదేశాలు ఇవ్వడం సరైంది కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థి ఉండటం రాజ్యాంగం కల్పించిన హక్కు అని కోర్టుకు తెలిపారు.

పిన్నెల్లి కుటుంబసభ్యులను కూడా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కౌంటింగ్ వరకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. షరతులతో కూడిన బెయిల్ అయినా ఇవ్వాలని కోర్టును కోరారు. ఏ షరతులు పెట్టాలో మీరే చెప్పండి అని కోర్టు ప్రశ్నించింది. చివరికి కౌంటింగ్ ఉన్న దృష్ట్యా.. పిన్నెల్లిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను ఆదేశిస్తూ కోర్టు బెయిల్ ఇచ్చింది. తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది కోర్టు.

Also Read : ఈవీఎంలను ధ్వంసం చేస్తున్న విజువల్స్ ట్వీట్ చేసిన సజ్జల