బ్రేకింగ్ : నిమ్మగడ్డ కేసులో స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

నిమ్మగడ్డ వ్యవహారం ఇంక కంటిన్యూ అవుతూనే ఉంది. ఏపీ సర్కార్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డను కొనసాగించాలని హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. 2020, జులై 24వ తేదీ శుక్రవారం సుప్రీం దీనిపై విచారణ చేపట్టి పై విధంగా తీర్పును వెలువరించింది.
నిమ్మగడ్డ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తగిన చర్యలు తీసుకోండని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవలే ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో నిమ్మగడ్డను తిరిగి నియమించాలని గవర్నర్ స్పష్టం చేశారనే అభిప్రాయం కలిగింది. కాకపోతే గవర్నర్ లేఖకు ప్రభుత్వ వర్గాలు పూర్తి భిన్నంగా వ్యాఖ్యానిస్తున్నాయి. నిమ్మగడ్డను పునర్ నియమించాలని గవర్నర్ చెప్పలేదని పేర్కొంటున్నాయి.
హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. గవర్నర్ ఆదేశాలు జారీచేసినా.. నిమ్మగడ్డ పునర్ నియామకం విషయంలో జగన్ సర్కార్ ముందుకెళ్లకపోవచ్చనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం సుప్రీం తీర్పు తర్వాత సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2020 మార్చి 7న షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిదే. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరిగాయి.
ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలు వాయిదా వేస్తున్నామని మార్చి 15న ఎస్ఈసీ రమేష్ కుమార్ ప్రకటించారు. దీనిని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. సీఎం జగన్ రమేష్ పై ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
రమేష్ కుమార్ చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారని, ఆ పార్టీకి మేలు చేసేందుకే ఎన్నికలు వాయిదా వేశారని జగన్ తో పాటు మంత్రులు, వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తనకు రాష్ట్రంలో భద్రత లేదని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ మార్చి 18న ఎన్నికల కమిషనర్ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు.
అప్పటి నుంచి ఆయన కొంతకాలం హైదరాబాద్ నుంచే విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని కుదిస్తూ రమేశ్ కుమార్‌కు చెక్ పెట్టింది.