మూడు రాజధానులపై జగన్‌కు ఉత్సాహాన్నిచ్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులంటూ జగన్ సర్కార్ ఒక్కసారిగా ప్రకటించడంతో రాష్ట్ర విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. వైసీపీ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడా వ్యతిరేకించాయి. అమరావతి తరలింపుపై భిన్నస్వరాలు వినిపించాయి. ఏపీలో అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా రాజధాని రైతులు నిరసనలు, ఆందోళనలు దిగారు. ఏపీ అసెంబ్లీలో కూడా అమరావతిపై పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. జగన్ మూడు రాజధానుల నిర్ణయం సరైనది కాదంటూ నిరసనగళం వినిపించారు.
ఇప్పటివరకూ ఏపీలో మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. ఏపీ రాష్ట్రాన్ని వేడిక్కిస్తున్న ఈ అంశంపై తొలిసారి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రపరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చునని కేంద్రం స్పష్టం చేసింది. పార్లమెంటులో బడ్జెట్ సెషన్ సమయంలో టీడీపీ ఎంపీ, గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు బదులుగా లిఖిత పూర్వక సమాధానాన్ని ఇచ్చింది. గత జోవో ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతి ఉందని కేంద్రం అభిప్రాయపడింది.
మూడు రాజధానుల అంశంపై లోక్ సభలో కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి నిత్యానంద్ సమాధానమిచ్చారు. ఏపీలో మూడు రాజధానుల ప్రకటన అంశానికి సంబంధించి గల్లా జయదేవ్ కేంద్రానికి వరుస ప్రశ్నలను సంధించారు. ఏపీ రాజధానుల అంశంపై కేంద్రం ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తుందా? అని ప్రశ్నించారు. రాజధానికి భూమిచ్చిన రైతులతో పాటు పెట్టుబడులకు సంబంధించి పలు అంశాలపై ప్రభావం చూపుతుందోని, దీనిపై కేంద్రం ఎలాంటి సూచనలు చేస్తుందో చెప్పాలని ఎంపీ గల్లా జయదేవ్ సూటిగా ప్రశ్నించారు. దీనిపై కేంద్రం స్పష్టమైన సమాధానమిచ్చింది.
ఏపీలో మూడు రాజధానుల అంశం తమ దృష్టికి వచ్చిందని, రాజధాని ఎక్కడ ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వందే నిర్ణయమని కేంద్రం తేల్చేసింది. కేంద్రం ప్రకటనతో ఏపీ రాష్ట్రానికి, ప్రభుత్వానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టు అయింది.ఏపీలో మూడు రాజధాని అంశంపై కేంద్రం వైఖరి ఏంటి అనేది ఇప్పటివరకూ సస్పెన్ష్ సాగింది. తాజాగా కేంద్రం హోం శాఖ అధికారికంగా ఇచ్చిన సమాధానంతో రాజధాని అంశంపై కేంద్రం వైఖరి ఏంటో స్పష్టమైపోయింది. రాజధాని అంశం ఇకపై పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశంగానే పరిగణించాలని అన్నట్టుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన స్పష్టతతో వైసీపీ సర్కారు హర్షం వ్యక్తం చేస్తోంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరైనదేనే వాదన మళ్లీ తెరపైకి వస్తోంది.
మరోవైపు.. అమరావతి రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఎంపీ గల్లా జయదేవ్ లోక సభలో కేంద్రం దృష్టికి తెచ్చారు. తనపట్ల మానమ హక్కుల ఉల్లంఘన జరిగిందన్నారు. తన ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారని అన్నారు.
అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తే వారిపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. రాజధానిని తరలించడం పట్ల రైతులు ఆందోళనకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అమరావతి కోసం 29 వేల మంది రైతులు 30 వేల ఎకరాల భూమిని ఇచ్చారని ఈ సందర్భంగా లోకసభలో గల్లా జయదేవ్ ప్రస్తావించారు.