Kuppam TDP: కుప్పం టీడీపీ వ్యవహారాల బాధ్యతలు ఇక ఆ నేత చేతుల్లోకి.. చంద్రబాబు కీలక నిర్ణయం
Kuppam TDP: చిత్తూరులోని కుప్పంలో 38 మంది పార్టీ సభ్యులతో ఏర్పాటైన నియోజకవర్గ ఎన్నికల కమిటీకి ఛైర్మన్ ను కూడా నియమించారు.

Kuppam TDP
Kuppam TDP: చిత్తూరులోని కుప్పం టీడీపీ వ్యవహారాల బాధ్యతలు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు అప్పగిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కంచర్ల శ్రీకాంత్ సంచలన విజయం సాధించారు.
తాజాగా, 38 మంది పార్టీ సభ్యులతో ఏర్పాటైన కుప్పం నియోజకవర్గ ఎన్నికల కమిటీకి ఛైర్మన్ గా కంచర్ల శ్రీకాంత్ నియమితుడయ్యారు. కుప్పంలో చంద్రబాబు నాయుడికి లక్ష ఓట్ల మెజార్టీ సాధించే లక్ష్యంతో కమిటీ ఏర్పాటైంది. ప్రస్తుతం కుప్పంలో పర్యటిస్తున్నారు కంచర్ల శ్రీకాంత్. వారంలో మూడు రోజులు పాటు కుప్పంలోనే గడపనున్నారు.
కాగా, ఇటీవల జరిగిన ఘర్షణలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పర్యటించారు. కుప్పంలో మీడియాతో మాట్లాడారు. పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అటువంటి పోలీసులను వదిలిపెట్టబోమని, ప్రైవేటు కేసులు బుక్ చేస్తామని చెప్పారు.
మానవత్వం లేని ప్రభుత్వం: చంద్రబాబు
కుప్పం మండలం గుల్లేపల్లి అంగన్వాడీ కేంద్రంలో గత ఏడాది ఫిబ్రవరిలో అంగన్వాడీ కేంద్రంలో కోడి గుడ్డు తిని ఊపిరి ఆడక నాలుగేళ్ల చిన్నారి దీక్షిత మృతి చెందిన ఘటనపై బుధవారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తూ సర్కారుపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. బాలిక మృతిపై కుటుంబానికి పరిహారం వద్దంటూ ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఒక నిరుపేద బాలిక మరణిస్తే… ఆమె కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం ఇవ్వాలని హెచ్ఆర్సీ ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే, పరిహారం ఇవ్వడం కుదరదంటూ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడం ఏంటని నిలదీశారు. ఇదేనా సంక్షేమ ప్రభుత్వం? అని అన్నారు. కనీస మానవత్వం కూడా లేదా అని ప్రశ్నించారు.
కోర్టుకు రాకుండా ఉండాల్సిందని హైకోర్టు ప్రశించిందంటే ఎంత సిగ్గుచేటని ట్వీట్ చేశారు. ఆ చిన్నారి కుటుంబానికి పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, కోడి గుడ్డు తిని చిన్నారి మృతి కేసులో బాధిత కుటుంబానికి ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించాలని హైకోర్టు నిన్న ఆదేశించింది. అనారోగ్యంతో దీక్షిత మృతి చెందిందంటూ అప్పట్లో అంగన్వాడీ సిబ్బంది బుకాయించిన విషయం తెలిసిందే.
దీంతో న్యాయం కోసం హెచ్ఆర్సీని ఆశ్రయించారు దీక్షిత తల్లిదండ్రులు. ఖననం చేసిన నాలుగు నెలల తర్వాత మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కోడిగుడ్డు గొంతులో ఇరుక్కోవడంతోనే దీక్షిత మృతి చెందిందంటూ పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది.
చివరకు, దీక్షిత కుటుంబానికి 8 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ ఈ ఏడాది జనవరిలో హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ హైకోర్టును ఆశ్రయించింది. హెచ్ఆర్సీ తీర్పును సమర్థిస్తూ హైకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చింది.
BRS Party Resolutions: దేశవ్యాప్తంగా దళితబంధు.. బీఆర్ఎస్ కీలక తీర్మానాలు ఇవే..