ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పా: చంద్రబాబు

2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎంపికై ఢిల్లీకి వెళ్లాను. పోలవరం ముంపునకు గురయ్యే ఏడు మండలాలు అప్పటికి ఇంకా తెలంగాణలోనే ఉన్నాయి.

ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పా: చంద్రబాబు

chandrababu naidu comments on polavaram project

chandrababu naidu on polavaram project: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిముఖ్యమైన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీయిచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో 72 శాతం పనులు పూర్తి చేశామని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడానికి తాను చేసిన ప్రయత్నాలను ఆయన వివరించారు.

”గవర్నమెంట్‌లో ఎంత అప్పు ఉందో తెలియదు. ఎక్కెక్కడ అప్పులు తెచ్చారో తెలియదు. ఎన్ని లక్షల కోట్ల అప్పుంది, ఏవేవి తాకట్టు పెట్టారో, ఆర్థికవ్యవస్థ ఏవిధంగా చిన్నాభిన్నం అయింది.. ఇవన్నీ అధ్యయనం చేయాల్సిన అవసరముంది. ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం. కేంద్రం క్లియర్‌గా పోలవరానికి సహకరించింది. నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది.

2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎంపికై ఢిల్లీకి వెళ్లాను. పోలవరం ముంపునకు గురయ్యే ఏడు మండలాలు అప్పటికి ఇంకా తెలంగాణలోనే ఉన్నాయి. దీంతో తెలంగాణ ఒప్పుకుంటే తప్పా ముంపు బాధితులకు పునరావాసం కల్పించే పరిస్థితి లేదు. ఆ ఏడు మండలాలను ఏపీలో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనని స్పష్టంగా చెప్పాను. దీంతో ప్రధాని మోదీ ఈ అంశాన్ని ఫస్ట్ క్యాబినెట్‌లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపారు. తర్వాత పార్లమెంట్‌లో బిల్లు పాస్ చేశారు. ఆ రోజు కేంద్రం ఆ ఏడు మండలాలు ఇవ్వకపోయుంటే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమయ్యేది కాదన్నారు. ఎన్నో కష్టాలు పడి కోర్టుల్లో కేసులు పరిష్కారమయ్యేలా చూశాం.

Also Read: ఆయనకు ఎంపీ సీటు ఇచ్చినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది: చంద్రబాబు నాయుడు

మా హయాంలో 72 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేశాం. ఈరోజు మళ్లీ మొదటికి వచ్చింది. డయాఫ్రం వాల్ పూర్తిగా కొట్టుకుపోయింది. కేంద్రం సహకారంతో పోలవరం పూర్తి చేసి, నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లవ్వగలిగితే దానకంటే బ్రహ్మండమైన పనిమరోటి ఉండదు. వ్యవసాయం రంగం స్టెబిలైజ్ అవుతుంది. ఇది సాధించడానికి అన్ని విధాలా కష్టపడతామ”ని చంద్రబాబు అన్నారు.