రాజధానిపై ఫ్యామిలీతో బాబు ప్లాన్‌!

  • Published By: sreehari ,Published On : January 3, 2020 / 06:52 AM IST
రాజధానిపై ఫ్యామిలీతో బాబు ప్లాన్‌!

Updated On : January 3, 2020 / 6:52 AM IST

ఏపీ రాజధానిలో రైతుల పోరాటం కొనసాగుతోంది. వారికి మద్దతుగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అక్కడకు వెళ్లారు. రైతులకు అండగా నిలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా అమరావతి ప్రాంత రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచారు. కాకపోతే చంద్రబాబు పక్కాప్లాన్‌తో రైతుల దగ్గరకు సతీ సమేతంగా వెళ్లారు. దీని వెనుక బాబు వ్యూహాలున్నాయని అంటున్నారు. తానొక్కరే వెళ్తే అది రాజకీయం అవుతుందనే ఉద్దేశంతో భార్య భువనేశ్వరి, బావమరిది రామకృష్ణతో కలసి వెళ్లి రైతులను పరామర్శించారు. రైతుల ఆందోళనలకు సంఘీభావాన్ని ప్రకటించారు.

రాజధాని ప్రాంతంలో హెరిటేజ్‌కు సంబంధించిన భూములున్నాయన్న వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టేందుకు భువనేశ్వరిని కూడా తోడు తీసుకెళ్లారు. రైతులకు తన గాజులను అందజేశారు భువనేశ్వరి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజధాని సంక్షోభం విషయంలో పార్టీ పరంగా ఇబ్బందులను అధిగమించాలంటే ప్రత్యర్థుల ఎత్తుగడలను తిప్పికొట్టాలంటే బ్రహ్మాండమైన ప్లాన్‌తో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. అందుకే ఈసారి ఒంటరిగా కాకుండా భువనేశ్వరిని కూడా తోడుగా తీసుకెళ్లారంటున్నారు. అప్పుడు పొలిటికల్‌గా విమర్శలు ఎదురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నది బాబు ఆలోచనగా చెబుతున్నారు.

ఆ భూములు తిరిగి ఇచ్చేయండి :
చంద్రబాబు ప్లాన్‌ రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ప్లస్‌ అయ్యింది. రైతుల్లో చంద్రబాబు మీద నమ్మకం ఏర్పడిందంటున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా వెళ్లడం వల్ల రైతులు కూడా బాబుకు తన సమస్యలను చెప్పుకున్నారు. రైతులకు సాయంగా భువనేశ్వరి తన గాజులను ఇవ్వడంతో మరింత అభిమానం పెరిగినట్టయ్యింది. కానీ, అధికార వైసీపీ మాత్రం ఇదంతా పొలిటికల్‌ డ్రామాగా విమర్శిస్తోంది. ఇవ్వాల్సింది గాజులు కాదు హెరిటేజ్‌ కోసం తీసుకున్న 14 ఎకరాల భూములను వెనక్కు ఇచ్చేయాలన్న డిమాండ్‌ను ముందుకు తీసుకొచ్చింది.

బాబు ప్లాన్..  50-50 సక్సెస్‌ 
గతంలో ఆక్వా రైతులు, బందరు పోర్టు విషయంలో రైతుల ఆందోళనలకు సమయంలో కూడా భువనేశ్వరి ఇదే విధంగా స్పందించి ఉంటే బావుండేదని వైసీపీ నేతలు అంటున్నారు. అప్పుడు చేయనిది ఇప్పుడు చేయడం వెనుక రాజకీయ లబ్ధి తప్ప ఇంకేం లేదని విమర్శిస్తున్నారు. చంద్రబాబు వేసిన ప్లాన్‌ కొంత వరకూ పార్టీ ప్లస్‌ అయినా.. మరో కోణంలో మాత్రం పొలిటికల్‌గా నెగెటివ్‌ కూడా అయ్యిందంటున్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబుకు మద్దతు దొరికినప్పటికీ ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదనే వాదనలున్నాయి. మొత్తం మీద చంద్రబాబు ప్లాన్‌ 50-50గా మారిందంటున్నారు. పొలిటికల్‌గా 50 శాతం నెగెటివ్‌ అయిన ఈ ప్లాన్‌.. 50 శాతం సక్సెస్‌ అయ్యిందనే చెబుతున్నారు.