Chandrababu Naidu : టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు గుడ్ న్యూస్.. మళ్లీ వారికే టిక్కెట్లు
టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు.

Chandrababu Naidu : టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు.
గురువారం సాయంత్రం తన నివాసంలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఈ విషయంపై స్పష్టతనిచ్చారు చంద్రబాబు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వీరోచిత పోరాటం చేస్తున్నారని అభినందించారు. వీళ్లందరికి మళ్లీ టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత తనదేనని చంద్రబాబు అన్నారు. 1994లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు గెలుపొందిన 74మంది ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్లు ఇచ్చామని, అందులో కళా వెంకట్రావ్ మినహా ప్రతి ఒక్కరూ గెలిచారని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రజా పోరాటమే తిరిగి వారిని గెలిపిస్తుందని, ధైర్యంగా ముందుకెళ్లాలని వారికి చంద్రబాబు పిలుపునిచ్చారు.
మరోవైపు వైసీపీలో మాత్రం పరిస్థితి పూర్తి రివర్స్ గా ఉందన్నారు చంద్రబాబు. జగన్ తో రేపో మాపో జరిగే సమావేశానికి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చంద్రబాబు చెప్పారు. వైసీపీలో మళ్లీ టిక్కెట్లు తమకు రావనే భయం కొందరిలో ఉంటే, వచ్చినా గెలవలేము అనే ఆందోళన మరికొంత మందిలో ఉందన్నారు. టిక్కెట్లు ఇవ్వబోను అని తమ ఎమ్మెల్యేలను జగన్ బెదిరిస్తున్నారని, దీనిపై వైసీపీ ఎమ్మెల్యేంతా అసంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.
ఇక రాజధాని అంశంపైనా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీలో సుదీర్ఘ చర్చ జరిగింది. తాము వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ఖర్చు లేకుండా 5కోట్ల మంది ప్రజలకు సంపద సృష్టి కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. జగన్ తో సహా అందరి ఆమోదంతోనే రాజధానిగా అమరావతిని ఖరారు చేశామని, ఇప్పటికీ తెలుగుదేశం ఇదే అంశానికి కట్టుబడి ఉందన్నారు.
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అమరావతిపై మాట తప్పి మడమ తిప్పింది జగన్ మోహన్ రెడ్డే అని చంద్రబాబు విమర్శించారు. అందరి ఆమోదంతోనే రాజధాని ఏర్పాటు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్ట్ గా అమరావతి ప్రణాళిక రూపొందించామని, ఖర్చు లేకుండా 33వేల ఎకరాల భూసమీకరణ చేసి మౌలిక సదుపాయాలు సమకూర్చామన్నారు. అమరావతి నిర్మాణం పూర్తైతే రాష్ట్రమంతటికీ సంపద సృష్టి కేంద్రం అవుతుందని చంద్రబాబు తెలిపారు.
అమరావతిపై సీఎం జగన్ ద్వేషానికి అర్థం లేదన్నారు చంద్రబాబు. జగన్ తన ద్వేషానికి ప్రాంతీయ వాదం ముసుగు వేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు తేల్చి చెప్పారు. తమ హయాంలో విశాఖ, తిరుపతిలో అమరావతిని మించిన అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, జాతీయ సంస్థలను రాష్ట్రమంతటా పెట్టామన్నారు. తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.