ప్రజలే కాదు నేనూ బాధితుడినే, సైకో పాలనలో అంతా విధ్వంసమే- సీఎం జగన్‌పై చంద్రబాబు నిప్పులు

రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తున్నారంటే పాలన ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చు.

ప్రజలే కాదు నేనూ బాధితుడినే, సైకో పాలనలో అంతా విధ్వంసమే- సీఎం జగన్‌పై చంద్రబాబు నిప్పులు

Chandrababu Mass Warning To CM Jagan

Updated On : February 15, 2024 / 11:35 PM IST

Chandrababu Naidu : జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ పాలనలో విధ్వంసం తప్ప మరొకటి లేదని మండిపడ్డారాయన. జగన్ హయాంలో ప్రజలే కాదు నేనూ బాధితుడినే అని చంద్రబాబు వాపోయారు. విజయవాడలో ”విధ్వంసం” పుస్తకావిష్కరణ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేశ్ కుమార్ రచించిన విధ్వంసం పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

”దేశంలో ఇదే తొలిసారి. పాలనపై విధ్వంసం అనే పుస్తకం రావడం మొదటిసారిగా చూస్తున్నా. నా మనసులోనే కాదు 5 కోట్ల ప్రజల మనసులో ఉంది విధ్వంసం పుస్తకంలో రాశారు. సైకో పాలనలో మన పిల్లల భవిష్యత్తు విధ్వంసమైంది. ఈ ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసం అయ్యింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తున్నారంటే పాలన ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చు.

Also Read : కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం చివరికి కూలిపోతుంది- జగన్ సర్కార్ పై పవన్ కల్యాణ్ ఫైర్

30వేల ఎకరాలు 33వేల మంది రైతులు రాజధాని కోసం భూమి ఇచ్చారంటే అది త్యాగం. రాష్ట్రం బాగుపడాలని స్వచ్చందంగా ముందుకు వచ్చి 30వేల ఎకరాలు ఇచ్చారు. అమరావతిలో రాజధాని కట్టి ఉంటే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి ఉపాధి దొరికేది. అమరావతి నిర్మించి ఉంటే 2 లక్షల కోట్లు వచ్చేవి. రాష్ట్ర ప్రజల ఆస్తిని విధ్వంసం చేశారు. నాల్గవ రాజధాని హైదరాబాద్ కావాలని మాట్లాడుతున్నారు. సిగ్గు ఎగ్గు ఉంటే అలా‌ మాట్లాడతారా? నాల్గవ రాజధాని కోసం పోరాడతామంటే సిగ్గుపడాలి.

ప్రజావేదిక కూల్చి అలా వదిలేశారు. నేను చూసి బాధపడాలని. నేను అడిగానని ప్రొక్లైనర్లతో కూల్చి విధ్వంసం చేశారు. వచ్చే పరిశ్రమలను తోసేసిన ముఖ్యమంత్రిని రాజకీయ చరిత్రలో మొదటిసారి చూశా. అమర్ రాజా ఇండస్ట్రీని వేధిస్తే తెలంగాణకు పోయింది. గల్లా జయదేవ్ తన వ్యాపారం కాపాడుకోవాలి కాబట్టి రాజకీయాలకు దూరమవ్వాల్సిన పరిస్ధితి ఏర్పడింది. నేను, పవన్ కలిసి పోరాడతాం” అని చంద్రబాబు అన్నారు.

”రాష్ట్రంలో ఎవరికైనా రక్షణ ఉందా? ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. తన సొంత చెల్లిని, తల్లిని సోషల్ మీడియాలో వేధిస్తున్నారంటే ఏం చెప్తాం. అలిపిరిపైన బ్లాస్ట్ చేసినా‌ ప్రాణానికి భయపడలేదు. అసెంబ్లీలో నాపైన చేసిన దానికి కన్నీరు పెట్టుకున్నా. ఎమ్మెల్సీ.. ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేశాడంటే రాష్ట్రంలో పరిస్ధితి ఏ విధంగా అర్ధం చేసుకోండి. మద్యం, ఇసుక, మైనింగ్ తో పాటు ఏది దొరికితే అది ఎత్తుకు పోయారు. ఎమ్మెల్యేలు ఇష్టానుసారుగా దోచేస్తున్నారు. పవన్‌ భీమవరం వెళ్లాలంటే హెలికాఫ్టర్ దిగేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. పర్చూరులో నాకు అనుమతినివ్వలేదు.
ఎవరికైనా సమస్య వస్తే ప్రభుత్వం వద్దకు వెళ్తాం. ప్రభుత్వమే సమస్యైతే ఎవరి దగ్గరికి వెళ్లాలి?

జగన్ మానసిక స్ధితి వలనే ఇలాంటివి జరుగుతున్నాయి. చెడును పూర్తిగా నివారించడానికి ప్రజలంతా‌ నడుం బిగించాలి. కులాలకు, మతాలకు ప్రాంతాలకు అతీతంగా చైతన్యం కావాలి. ఎక్కడైతే భయంగా గడుపుతామో అక్కడ స్వేచ్చ ఉండదు. స్వేచ్చ లేని చోట అభివృద్ధి ఉండదు. తెలుగు జాతి.. ప్రపంచమంతా నెంబర్ వన్ గా ఉండాలి. అదే నాది, పవన్ ది లక్ష్యం. తిరగుబడతారా? బానిసలుగా ఉంటారా? అనేది మీరే ఆలోచించుకోండి. ఇంకా 54 రోజుల మాత్రమే సమయం ఉంది. జగన్ ను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంచితే‌నే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది.

Also Read : ఏపీని షేక్ చేస్తున్న నెల్లూరు పెద్దారెడ్ల పొలిటికల్ ఇష్యూస్

ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ఓ సభలో మాట్లాడుతూ.. చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది అని అన్నారు. నువ్వు, మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడతపెడితే.. మా టీడీపీ కార్యకర్తలు, ‌జనసైనికులు, ప్రజలు కుర్చీలు మడతపెడతారు. అందరూ కుర్చీలు మడతపెడితే నీ కుర్చీ లేకుండా పోతుంది జగన్ రెడ్డి. పిచ్చి పిచ్చి కూతలు కూస్తే దానికి పరిష్కారం 5 కోట్ల మంది ప్రజలు చూపిస్తారు” అంటూ సీఎం జగన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.