సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్‌ ఎన్వీ రమణ?

సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్‌ ఎన్వీ రమణ?

Chief Justice Of India Sa Bobde Has Recommends Justice Nv Ramana As His Successor After He Retires

Updated On : March 24, 2021 / 12:59 PM IST

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌గా జస్టిస్‌ ఎన్వీ రమణ పేరు సిఫార్సు చేశారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే. జస్టిస్ బాబ్డే ఏప్రిల్ 23న రిటైర్ అవుతుండగా.. సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఎన్వీ రమణను నియమించాలని న్యాయశాఖకు సిఫార్సు చేశారు. దీంతో భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు జస్టిస్‌ బోబ్డే.. ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ హోంశాఖకు పంపిన తర్వాత.. హోంశాఖ పరిశీలించి ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి పంపుతుంది.

రాష్ట్రపతి ఆమోదంతో సీజేఐ ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతుంది. జస్టిస్‌ బోబ్డే ఏప్రిల్‌ 23న రిటైర్ కానుండగా.. ఏప్రిల్‌ 24న జస్టిస్‌ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 2022 ఆగస్టు 26వ తేదీ వరకు జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టులో జస్టిస్‌ బోబ్డే తర్వాత అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణే. 48వ సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ పేరును బోబ్డే ప్ర‌తిపాదించారు.

1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జన్మించిన జస్టిస్‌ ఎన్వీ రమణ 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలెట్టి.. 2000 సంవత్సరం జూన్‌లో ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వాత ఢిల్లీ హైకోర్టుకు.. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. జ‌స్టిస్ బోబ్డే 2019 న‌వంబ‌రులో సుప్రీంకోర్టు 47వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ (రిటైర్డ్) రంజ‌న్‌ గొగొయ్ స్థానంలో‌ ప్ర‌మాణ స్వీకారం చేశారు.