రైట్..రైట్.. 6 నెలల తర్వాత ఏపీలో రోడ్డెక్కిన సిటీ బస్సులు

ఏపీలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ఆరు నెలలుగా డిపోలకే పరిమితమైన సిటీ సర్వీసులు నేటి(సెప్టెంబర్ 19,2020) నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా మార్చి 22 నుంచి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. క్రమంగా కొన్ని రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అన్‌లాక్ దశలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌పై ఆంక్షలను ఎత్తివేసింది. ఏపీలో కూడా ఇప్పటికే జిల్లాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరుగుతున్నప్పటికీ విజయవాడ, విశాఖలో సిటీ సర్వీసులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. తాజా ఉత్తర్వులతో రెండు నగరాల్లోని బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.
కరోనా కారణంగా ఆగిన బస్సులు:
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. ఏపీలోనూ దాని ప్రభావం పడింది. ఆర్టీసీ దూర ప్రాంతాలకు నడిపే బస్సులతో పాటు స్థానికంగా సిటీ బస్సు సర్వీసులను కూడా రద్దు చేసింది. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పల్లె వెలుగు బస్సులతో పాటు దూర ప్రాంత సర్వీసులు కూడా మొదలయ్యాయి. అంతర్ రాష్ట్ర సర్వీసుల్లో తెలంగాణ మినహా మిగిలిన రాష్ట్రాలకు సర్వీసులు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణకు కూడా బస్సులు నడిపే అంశంపై ఆర్టీసీ చర్చలు జరుపుతోంది. ఇదే సమయంలో స్థానికంగా ప్రజా రవాణా మెరుగుపడటం, కేంద్రం అన్‌లాక్ మార్గదర్శకాలు పాటిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించింది.
6 నెలల్లో రూ.200 కోట్ల నష్టం:
విశాఖ, విజయవాడ నగరాల్లో మొత్తం 1,100 బస్సులు ఉన్నాయి. వీటిలో విజయవాడ పరిధిలో 450, విశాఖపట్నంలో 650 బస్సులు ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో బస్సులు డిపోలకే పరిమితం అవ్వడంతో ఆర్టీసీ భారీగా నష్టాలను చవిచూసింది. ఆరు నెలల కాలంలో సుమారు 200 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఆర్టీసీ ప్రస్తుతం దూర ప్రాంత సర్వీసులు నడుపుతున్నా.. కరోనా భయంతో ఎక్కువ సేపు బస్సు ప్రయాణాలకు జనం ఇష్టపడటం లేదు. తప్పనిసరి అయితేనే బస్ జర్నీ చేస్తున్నారు. కానీ సిటీ బస్సుల్లో అయితే తక్కువ దూరమే కాబట్టి జనం ఆసక్తి చూపుతారనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రజా రవాణా మెరుగు పడినందున సిటీ సర్వీసులకు కూడా ఆదరణ ఉంటుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది.
మొత్తానికి సిటీ బస్సు సర్వీసులు ప్రారంభమవ్వడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే బస్సుల్లో మాత్రం కరోనా నిబంధనలు తప్పనిసరి అని.. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణం చేయాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.
శానిటైజేషన్ చేశాకే రోడ్డుపైకి:
సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతి రావడంతో విశాఖ, విజయవాడలో సిటీ బస్సులు నడుపుతోంది. బస్సులను అన్నింటిని శానిటైజేషన్ చేశాకే రోడ్డెక్కిస్తున్నారు. రేపు(సెప్టెంబర్ 20,2020) గ్రామ వార్డు సెక్రటేరియట్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేశారు.
విద్యార్థులతో పాటు సాధారణ ప్రయాణికులకు కూడా బస్సులను అందుబాటులోకి తెచ్చామని.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. సిటీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్యను బట్టి సమీక్ష చేసి సర్వీసులను పెంచాలా? తగ్గించాలా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.