Cm Chandrababu: సంపద సృష్టితోనే అభివృద్ధి సాధ్యం- సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు
నేను మొదటి నుంచి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వస్తున్నా అని అన్నారు. ఏపీ సీఎంగా సీఐఐ సదస్సులు నిర్వహించానన్నారు.

Cm Chandrababu: సీఐఐ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ వెళ్లవద్దని కొందరు తనకు సూచించారని చంద్రబాబు చెప్పారు. దావోస్ లో పారిశ్రామికవేత్తలను కలిస్తే పేదలు ఓట్లు వేయరని వారు తనతో అన్నారని చంద్రబాబు తెలిపారు. ఆ సమయంలో ప్రధాని, కేంద్ర మంత్రులు కూడా దావోస్ వెళ్లలేదని చెప్పారు.
తాను మాత్రం తరుచూ దావోస్ వెళ్లి వస్తున్నా అని చంద్రబాబు తెలిపారు. నేను మొదటి నుంచి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వస్తున్నా అని అన్నారు. ఏపీ సీఎంగా సీఐఐ సదస్సులు నిర్వహించానన్నారు. సంపద సృష్టితోనే అభివృద్ధి సాధ్యం అన్నారు చంద్రబాబు. ఆదాయం పెరిగితే మరిన్ని సంక్షేమ పథకాలు అందించవచ్చన్నారు. సంపద సృష్టిలో ఆంధ్రప్రదేశ్ కు పారిశ్రామికవేత్తలు సహకరించాలని చంద్రబాబు కోరారు. సీఐఐ సదస్సులో ఏపీలో పెట్టుబడుల అవకాశంపై పారిశ్రామికవేత్తలకు వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
”ఏపీని ప్రమోట్ చేసే విషయంలో నాకు సొంత అజెండా ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను నేను ప్రమోట్ చేశాను. బెస్ట్ ఎకో సిస్టమ్ హైదరాబాద్ ను క్రియేట్ చేశాను. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ తెలంగాణకు పోయింది. హైదరాబాద్ కారణంగా తెలంగాణకు 75శాతం ఆదాయం వస్తోంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ అని నేను గర్వంగా చెప్పగలను. ఈ అభివృద్ధి అంతా గత 25ఏళ్లలో జరిగింది. అంతేకాదు మోస్ట్ లివబల్ సిటీగా కూడా హైదరాబాద్ గుర్తింపు పొందింది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మరో సిటీని తయారు చేయడానికి దేవుడు నాకు మరో అవకాశం ఇచ్చాడు. అదే అమరావతి.
Also Read: అది ఇల్లా, బ్యాంకా? ఆ అధికారి ఇంట్లో నోట్ల కట్టల కలకలం.. ఏకంగా రూ.2కోట్లకు పైగా క్యాష్ గుర్తింపు..
హైదరాబాద్ బ్రౌల్ ఫీల్డ్ సిటీ, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అమరావతి నిర్మాణంలో మీ అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా. రాబోయే భవిష్యత్తులో అమరావతి బెస్ట్ సిటీ కానుంది. యావత్ దేశ ప్రజలు గర్వపడేలా అమరావతి ఉంటుంది. ఆ విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. మరో 22 ఏళ్లకు మేము ప్లాన్ చేస్తున్నాం. 15శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా పెట్టుకున్నాం. నా ప్రజలకు మేలు చేయడానికి నేను కృషి చేస్తున్నా.
ఆ దిశగా ముందుకు సాగుతున్నా. 1995లో హైటెక్ సిటీని నేనే ప్రమోట్ చేశా. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ విత్ ఏఐ-ఇప్పుడు ఇదే నా నినాదం. భారత్ లో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో వస్తోంది. ఐబీఎం, ఎల్ అండ్ టీ వస్తున్నాయి. మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నా. క్వాంటమ్ కంప్యూటింగ్ ను సద్వినియోగం చేసుకోండి, మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోండి” అని సీఎం చంద్రబాబు అన్నారు.