ఆ బాధను ప్రధాని మోదీలో చూశాను: చంద్రబాబు నాయుడు
ఎప్పుడూ ఆహ్లాదకరంగా జరిగే తమ భేటీ ఆ రోజున మాత్రం గంభీరంగా సాగిందని చెప్పారు.

పహల్గాం దాడి తాలుకా బాధను ప్రధాని మోదీలో చూశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి పున:ప్రారంభ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. అమరావతి రీ సార్ట్ కార్యక్రమానికి ఆహ్వానించడానికి ఢిల్లీకి వెళ్లినప్పుడు మోదీ గంభీరంగా కనిపించారని చంద్రబాబు తెలిపారు. ఎప్పుడూ ఆహ్లాదకరంగా జరిగే తమ భేటీ ఆ రోజున మాత్రం గంభీరంగా సాగిందని చెప్పారు.
ఉగ్రదాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న ఆవేదన మోదీలో కనిపించిందని తెలిపారు. “అందుకే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల తరుఫున చెబుతున్నాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోదీ తీసుకునే ప్రతి చర్యకు మేం మద్దతుగా ఉంటాం. మోదీ జీ హమ్ ఆప్ కే సాత్ హై.. ఆంధ్రప్రదేశ్ కే పాంచ్ కరోర్ లోగ్ ఆప్ కే సాత్ హై.. పూరా దేశ్ ఆప్ కే సాత్ హై” అని అన్నారు.
ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అమరావతి. అమరావతి పునర్నిర్మాణ వేడుక భూత్యాగాలు చేసిన రైతుల పోరాట ఫలితం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు ఇది. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని వైసీపీ ఐదేళ్లు విధ్వంసం చేసింది.
మళ్లీ ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునప్రారంభం కావటం ఓ చరిత్ర. ప్రపంచంలో భారతదేశాన్ని నంబర్ 1 స్థానంలో నిలబెట్టడం మోదీకే సాధ్యం. అభివృద్ధి, పేదరిక నిర్మూలన రెండింటిని సమన్వయం చేస్తూ దేశాన్ని నడిపిస్తున్నారు. కులగణన పై ఓ చారిత్రిక నిర్ణయం తీసుకున్నారు.
వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మోదీ చేయూతనిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆర్థిక కష్టాలనుంచి బయట పడుతున్నాం. మోదీ అర్థం చేసుకున్నట్లు మరే నేత సాంకేతికతను అర్థం చేసుకోలేరు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. జూన్ 21న విశాఖలో జరిగే యోగా డే వేడుకకు ప్రధాని మోదీ మళ్లీ రానున్నారు” అని చంద్రబాబు అన్నారు.