జీఎస్టీ ఉత్సవ్‌ను సక్సెస్ చేయాలి.. రాష్ట్రవ్యాప్తంగా 6వేల సమావేశాలు నిర్వహించాలి : టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు

జీఎస్టీ సంస్కరణలతో కలిగే లాభాలపై ప్రజలకు వివరించి చెప్పాలని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పార్టీ నేతలకు సూచించారు.

జీఎస్టీ ఉత్సవ్‌ను సక్సెస్ చేయాలి.. రాష్ట్రవ్యాప్తంగా 6వేల సమావేశాలు నిర్వహించాలి : టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu

Updated On : September 28, 2025 / 2:41 PM IST

CM Chandrababu : కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో కలిగే లాభాలపై ప్రజలకు వివరించి చెప్పాలని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. ఆదివారం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామ స్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా విద్యుత్ కొనుగోళ్లలో సుమారు రూ.1000 కోట్లు ఆదా చేశామని, ఆ మేరకు రానున్న కాలంలో ప్రజలపై రూ.వెయ్యి కోట్ల భారాన్ని తగ్గస్తున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది.. వైసీపీ ప్రభుత్వం అసమర్థ విధానాల వల్ల ప్రజలపై విద్యుత్ చార్జీల రూపంలో భారం పడింది. నేడు తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టామని చంద్రబాబు చెప్పారు.

పార్టీ కార్యకర్తలైనా, నాయకులైనా ప్రజలకు ఎప్పుడూ దగ్గరగా ఉండాలి.. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను వారికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి. ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వెళ్తానంటే ప్రజలు హర్షించరని చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. 11మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు.. అదే వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు మాత్రం సభకు వస్తారు.. ఇదేం ద్వంద్వం వైఖరి.. ఇదేం డ్రామా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: AP Government : ఏపీలో విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన కూటమి సర్కార్.. రూ. 400 కోట్లు విడుదల

సూపర్ సిక్స్‌సహా అనేక మేనిఫెస్టో హామీలను నెరవేర్చాం. ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలి. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుంది. దేశంలో ఇదొక నూతన అధ్యాయమని చంద్రబాబు అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పులను ప్రజలకు వివరించి చెప్పాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు సూచించారు.

కూటమి పార్టీలు ఉమ్మడిగా జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారాన్ని నిర్వహించాలి. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 60వేల సమావేశాలు పెట్టి జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ఉపయోగాలను వివరించాలని చంద్రబాబు సూచించారు. పారిశ్రామిక, ఆటో మొబైల్, ఫార్మా వంటి కంపెనీలకు జీఎస్టీ సంస్కరణలతో మేలు జరుగుతుంది. టూవీలర్, ఏసీలు, కార్లు, వంటింటి వస్తువులు తగ్గుతాయి. ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువుల ధరలూ తగ్గాయి. రోగులు వాడే మందులపై జీఎస్టీ లేదని చంద్రబాబు అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు రూ.8వేల కోట్ల మేర లబ్ధి జరగనుందని అన్నారు. మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గినా సంస్కరణల వల్ల ప్రజలు ఆర్థికంగా బలోపేతం అవుతారు. సుపరిపాలన కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏం చేశామో వివరించాం.. అదే తరహాలో జీఎస్టీ ఉత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టాలి. కార్యకర్తల భాగస్వామ్యంతో యోగాడే సక్సెస్ అయింది.. అలాగే జీఎస్టీ ఉత్సవ్ ను సక్సెస్ చేయాలని చంద్రబాబు సూచించారు.