Cm Chandrababu: 20వేల కోట్లు, వెయ్యి కిలోమీటర్లు- జాతీయ రహదారుల నిర్మాణంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఇకపై ఏ రహదారి నిర్మాణమూ ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు.

Cm Chandrababu: 20వేల కోట్లు, వెయ్యి కిలోమీటర్లు- జాతీయ రహదారుల నిర్మాణంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Updated On : June 9, 2025 / 6:38 PM IST

Cm Chandrababu: జాతీయ రహదారులు, రోడ్ల పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నిర్ణీత కాల వ్యవధికి మించి పూర్తి కాని ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ సంస్థలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ఆదేశాలు ఇచ్చారు. రహదారి నిర్మాణం ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు.

”రాష్ట్రంలో శరవేగంగా రహదారుల నిర్మాణం జరగాలి. జూలై నెలాఖరుకు ఆటంకాలు తొలగాలి. ఈ ఏడాది 1,040 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోవాలి. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, త్వరలో నిర్మించ తలపెట్టిన అన్ని రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ, వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జూలై నెలాఖరుకు పరిష్కరించాలి. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలి” అని సీఎం చంద్రబాబు చెప్పారు.

Also Read: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పని చేయాలి- స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు

వివిధ రహదారి ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు సీఎం చంద్రబాబు. నిర్ణీత కాల వ్యవధికి మించి ఆలస్యమైన ప్రాజెక్టుల కాంట్రాక్ట్ సంస్థలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఏ రహదారి నిర్మాణమూ ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. ఎన్‌హెచ్ఏఐ, ఎంఓఆర్టీహెచ్ కింద రూ.11,325 కోట్లతో 770 కిలోమీటర్ల రహదారులు గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రికి తెలిపారు అధికారులు.

20,067 కోట్ల విలువైన 1,040 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో చెప్పారు. 1,307 కిలోమీటర్ల పొడవైన అత్యంత రద్దీ కలిగిన 18 రహదారుల డీపీఆర్ రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. మిగిలిన 8,893 కి.మీ. పొడవైన 242 రహదారుల ప్రీ ఫీజబిలిటీ అధ్యయనాన్ని రెండు విడతల్లో చేపట్టాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు అదనంగా యలమంచిలి-గాజువాక, గాజులమండ్యం-శ్రీసిటీ రహదారులను కూడా పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నారు అధికారులు.

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు నిర్మాణ పనులను అంతరాయం లేకుండా, వేగవంతంగా నిర్వహించాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నొక్కి చెప్పారు. రోడ్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల స్థితిని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలో సీనియర్ అధికారులు , కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొన్ని ప్రాజెక్టుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రోడ్డు నిర్మాణంలో ఇకపై ఎలాంటి జాప్యాలను సహించబోమని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మొత్తం 8వేల 744 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయి. వీటిలో 4వేల 406 కి.మీ.లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) పరిధిలోకి వస్తాయి. 641 కి.మీ.లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఆధ్వర్యంలోని ప్రాజెక్ట్ అమలు యూనిట్ (PIU) ద్వారా నిర్వహించబడతాయి. 3,697 కి.మీ.లు NH (R&B) విభాగం కింద నిర్వహించబడుతున్నాయి. ప్రస్తుతం, రాష్ట్రంలో 3,483 కి.మీ.ల పొడవున 144 రోడ్డు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటిని NHAI, MoRTH కింద రూ. 76,856 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. వీటితో పాటు, మరిన్ని ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. త్వరలో ప్రారంభం కానున్నాయి.