TTD Reforms : అన్యమత ఉద్యోగులు బదిలీ..! టీటీడీలో సంస్కరణలపై సీఎం చంద్రబాబు ఫోకస్..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే టీటీడీలో అనేక సంస్కరణల అమలుకు నడుం బిగించింది.

TTD Reforms : టీటీడీలో సంస్కరణలపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. శ్రీవారి లడ్డూ నాణ్యత పెంపుతో ప్రక్షాళన ప్రారంభించిన కూటమి సర్కార్ ఒక్కో విభాగంలో మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తోంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసిన కల్తీ నెయ్యి వ్యవహారంలో ఉక్కుపాదం మోపిన సర్కార్.. వివాదాస్పదంగా మారిన శ్రీవాణి ట్రస్ట్ నిధుల్లో అక్రమాలకు చెక్ పెట్టింది. దీంతో పాటు నిత్య అన్నదానంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇక క్యూలైన్లలో భక్తులకు విరివిగా అన్నప్రసాదాలను పంపిణీ చేస్తోంది.
మరోవైపు టీటీడీలో అన్యమత ఉద్యోగుల బదిలీకి చర్యలకు ఉపక్రమించింది. అటు శేషాచల కొండలకు సమీపంలో కేటాయించిన ముంతాజ్ హోటల్ నిర్మాణ అనుమతులను రద్దు చేసింది. ఇక నుంచి తిరుమల కొండలకు సమీపంలో ప్రైవేట్ నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మద్యం, మాంసం కొండపైకి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది టీటీడీ.
Also Read : మాజీ మంత్రి విడదల రజినికి బిగ్ షాక్.. ఏసీబీ కేసు నమోదు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే టీటీడీలో అనేక సంస్కరణల అమలుకు నడుం బిగించింది. ప్రధానంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత పెంపుతో మొదలైన ఈ ప్రక్షాళన గత 10 నెలలుగా విరివిగా కొనసాగుతోంది. తాజాగా తిరుమల కొండకు అతి సమీపంలోనే ముంతాజ్ హోటల్ పేరుతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో ఆ హోటల్ నిర్మాణానికి అనుమతులు రద్దు చేశారు.
శేషాచలం కొండలకు ఆనుకుని భవిష్యత్తులో మరెప్పుడూ కూడా ఎలాంటి ప్రైవేట్ నిర్మాణాలకు కూడా అనుమతి ఇచ్చేదే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పడం ఒక సంచలన, చరిత్రాత్మక నిర్ణయంగా భావించొచ్చు. ప్రధానంగా నిత్య అన్నదానం, శ్రీవారి ప్రసాదాల విషయంలో, క్యూలైన్ లో భక్తులకు ఇబ్బందులు నివారించడంలో కానీ, కొండపైకి మద్యం మాంసం వెళ్లకుండా నివారించడంలో కానీ.. ఇలా టీటీడీకీ చెందిన అనేక విభాగాల్లో ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం బిగించింది.
కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించింది. ఉన్నత స్థాయి దర్యాఫ్తు కొనసాగుతోంది. లడ్డూ ప్రసాదం నాణ్యతను పెంచారని భక్తుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
టీటీడీ పాలకమండలి కీలక సమావేశం..
అటు సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భేటీ కానుంది. రేపు ఉదయం 10 గంటలకు అన్నమయ్య భవన్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. 2025-26 వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
సీఎం చంద్రబాబు సూచనలతో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నూతన ట్రస్ట్ ఏర్పాటు అంశంపై చర్చించబోతున్నట్లుగా సమాచారం. అలాగే అలిపిరి కొండ ప్రాంతాన్ని టెంపుల్ కారిడార్ గా చేసే అంశంపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరగబోతోంది. అలాగే టీటీడీలో అన్యమత ఉద్యోగుల తరలింపు, శ్రీవారి ఆస్తుల పరిరక్షణ తదితర అంశాలపైన కూడా డిస్కస్ చేయనున్నారు.