CM Jagan Delhi Tour : పార్లమెంట్‌లో ప్ర‌ధాని మోదీతో ముగిసిన సీఎం జ‌గ‌న్ భేటీ.. ఏఏ అంశాల‌పై చ‌ర్చించారంటే?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో భేటీ అయ్యారు.

CM Jagan Delhi Tour : పార్లమెంట్‌లో ప్ర‌ధాని మోదీతో ముగిసిన సీఎం జ‌గ‌న్ భేటీ.. ఏఏ అంశాల‌పై చ‌ర్చించారంటే?

CM JAGAN Delhi Tour

AP CM Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం వైసీపీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కు వెళ్లిన జగన్.. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వీరి మధ్య భేటీ సుమారు అరగంట పాటు కొనసాగింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రాష్ట్రానికి ఆర్థిక సహకారం, పెండింగ్ అంశాలపై ప్రధానికి జగన్ వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం త్వరిత గతిన నిధులను విడుదల చేయాలని ప్రధాని మోదీని జగన్ కోరారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు రావాల్సిన విద్యుత్ బకాయిలు, కేంద్ర వాటా నుంచి ఏపీకి రావాల్సిన పన్ను చెల్లింపులతో సహా, నూతన జిల్లాల్లో మెడికల్ కాలేజీలకు అనుమతులు, సుదీర్ఘకాలంగా పౌరసరఫరాల శాఖ లనుంచి పెండింగ్ లో ఉన్న సబ్సిడీ బకాయిలను త్వరగా క్లియర్ చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి  వినతిపత్రం అందజేశారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలపైనా ప్రధాని మోదీ, జగన్ మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

Also Read : Minister RK Roja : తోక పార్టీలన్నీ కలిసినా జగన్ను ఏమి చేయలేవు.. మళ్లీ నగరి నుంచే పోటీ చేస్తా!

జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సార్లు మోదీతోనూ, కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యారు. ఈ భేటీల్లో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా, ఏపీకి ఆర్థిక సహాయంపై విజ్ఞాపనలు అందిస్తూ వస్తున్నారు. వీటన్నింటిపై కేంద్రం నుంచి ఆశించినంత సహకారం రాకపోయినా.. వైసీపీ సహకారం పార్లమెంట్ లోపల బయట బీజేపీకి కొనసాగుతూనే ఉంది. మరికొద్ది కాలంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ, జగన్ మధ్య ఎలాంటి రాజకీయ అంశాలపై చర్చ జరిగిందన్న అంశం ఆసక్తికరంగా మారింది.

Also Read : కోట్లు కొల్లగొట్టారు..! ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చార్జిషీట్‌ దాఖలు చేసిన సీఐడీ

ఇప్పటికే ఏపీలో టీడీపీ – జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందని, వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాలతో చర్చలు జరిపారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లివచ్చిన రెండురోజుల వ్యవధిలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం, ప్రధానితో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో భేటీలో ఏపీలో తాజా రాజకీయాలపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎలాంటి రాజకీయ అంశాలపై మోదీ, జగన్ మధ్య చర్చకు వచ్చాయనే అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.