Jagan Kodi Katti Case : జగన్ కచ్చితంగా కోర్టుకి రావాల్సిందే.. కోడికత్తి కేసులో న్యాయవాది సలీమ్ హాట్ కామెంట్స్
నేను చెప్పేది ఒక్కటే. రావాలి జగన్. కావాలి సాక్ష్యం. చెప్పాలి నిజం. బండారం బట్టబయలు చేస్తాను Jagan Kodi Katti Case

Jagan Kodi Katti Case
Kodi Katti Case : జగన్ కోడికత్తి కేసుపై విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై రేపు (గురువారం-సెప్టెంబర్ 21) వాదనలు వింటామని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు తెలిపినట్లు శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీమ్ వెల్లడించారు. ఈ కేసులో సీఎం జగన్ కచ్చితంగా కోర్టుకి హాజరుకావాల్సిందే అని న్యాయవాది సలీమ్ తేల్చి చెప్పారు. జగన్ హాజరుకాకపోతే న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు. ఎయిర్ పోర్టు ఘటన రోజే వైసీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయని చెప్పారాయన. దానిపై విచారణ ఎందుకు జరగటం లేదని ప్రశ్నించారు న్యాయవాది సలీమ్.
Also Read..Pawan Kalyan: జనసేనాని డైరెక్షన్.. వచ్చే ఎన్నికలకు పవన్ కళ్యాణ్ సరికొత్త రూట్ మ్యాప్!
”జగన్ విచారణకు హాజరుకాకుంటే ఆయన మీద 228 ఐపీసీ కింద కేసు పెట్టండి. ఏపీ లా 1991 అమెండ్ మెంట్ అయ్యింది. కోర్టుకి రాను ఎవరూ చెప్పడానికి లేదు. జుడీషియల్ అధికారిని కించపరుస్తూ మాట్లాడితే 228 ఐపీసీ కింద కేసు పెడతారు. జగన్ మీద పెడతారా పెట్టరా అని అడిగాము. వాళ్ల వాదనలు విన్న తర్వాత దాని గురించి ఆలోచిస్తామన్నారు. ఈ నెల 29 తర్వాత తదుపరి ప్రొసీడింగ్స్ ఉంటాయని కోర్టు చెప్పింది. నేను చెప్పేది ఒక్కటే. రావాలి జగన్. కావాలి సాక్ష్యం. చెప్పాలి నిజం. బండారం బట్టబయలు చేస్తాను” అని న్యాయవాది సలీమ్ అన్నారు.
సంచలనం రేపిన జగన్ కోడి కత్తి కేసుపై విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు తరపున న్యాయవాది సలీమ్ తన వాదనలు వినిపించారు. అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 2018లో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో జగన్ పై దాడి జరిగింది. ఈ కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించారు.
కోడికత్తి కేసులో ముఖ్య నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ కాదని, మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీను, వైసీపీ నేతలని నిందితుడి తరపు న్యాయవాది సలీమ్ ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ కోర్టుకు హాజరైతే వాస్తవాలు బయట పెడతామని సలీమ్ అంటున్నారు. అయితే సీఎం జగన్ తరపున వాదిస్తున్న న్యాయవాది వెంకటేశ్వరరెడ్డి.. నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర ఉందని, ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో ఆ విషయాన్ని దాఖలు చేసిందని తెలిపారు. 2017లో శ్రీనివాస్‌పై కేసు నమోదైందని.. నిందితుడు శ్రీనివాస్ పదునైన ఆయుధంతో జగన్ పై హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో నమోదు చేశారని వెల్లడించారు.
ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్న నాటికి శ్రీనివాస్ పై కేసు పెండింగ్ లో ఉందన్నారు. జగన్‌పై పక్కా ప్లాన్ ప్రకారమే కోడికత్తితో దాడి జరిగిందని న్యాయవాది వెంకటేశ్వరరెడ్డి అన్నారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిందని ఎన్‌ఐఏ స్పష్టం చేసిందన్నారు. ఈ కేసుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.