Brahmani Nara : చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి..? పార్టీ కష్టాల్లో ఉండటంతో బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధం

ఎప్పుడూ రాజకీయ విమర్శలు చేయని బ్రాహ్మణి రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలతో కార్యకర్తల్లో కసి పెరిగింది. Brahmani Nara - Political Entry

Brahmani Nara : చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి..? పార్టీ కష్టాల్లో ఉండటంతో బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధం

Nara Brahmani Political Entry

Brahmani Nara – Political Entry : విజయవంతమైన యువ వ్యాపారవేత్తగా రాణిస్తున్న నారా బ్రాహ్మణి త్వరలో పొలిటికల్ అరంగ్రేటం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్న బ్రాహ్మణి చంద్రబాబు అరెస్ట్ తో పార్టీ బాధ్యతలు కూడా స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఓవైపు కుటుంబం, మరోవైపు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తనదైన బాధ్యతను భుజాన వేసుకునేందుకు బ్రాహ్మణి రెడీ అయ్యారు.

నారా లోకేశ్ సతీమణి, నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. 2011లో హెరిటేజ్ బాధ్యతలు స్వీకరించిన బ్రాహ్మణి.. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి 2013లో ఎంఎస్ పూర్తి చేశారు. తన తెలివితేటలతో హెరిటేజ్ ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. బ్రాహ్మణి శక్తి సామర్థ్యాలు చూసిన తర్వాత లోకేశ్, చంద్రబాబు, భువనేశ్వరి..హెరిటేజ్ పూర్తి బాధ్యతలను బ్రాహ్మణికే వదిలేశారు.

Also Read..TDP- Janasena: జనసేన, టీడీపీ పొత్తు.. ఏపీ రాజకీయాల్లో జరిగే మార్పులేంటి?

అయితే తాతయ్య ఎన్టీఆర్ దగ్గరి నుంచి భర్త లోకేశ్ వరకు కుటుంబం మొత్తం రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. పాలిటిక్స్ లోకి రావడానికి ఎప్పుడూ పెద్దగా ఆసక్తి చూపలేదు బ్రాహ్మణి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ పెద్ద చంద్రబాబు అరెస్ట్ కావడంతో 10 రోజుల నుంచి రాజమండ్రిలోనే బ్రాహ్మణి మకాం వేశారు. చంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గరి నుంచి భర్త లోకేశ్ కు చేదోడువాదోడుగా ఉంటూ అత్త భువనేశ్వరి యోగక్షేమాలు చూసుకుంటూ రాజమండ్రిలోనే ఉంటున్నారు. చంద్రబాబుని నంద్యాలలో అదుపులోకి తీసుకుని విజయవాడ సిట్ ఆఫీసుకి తరలించినప్పుడు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి పరామర్శించారు బ్రాహ్మణి.

నారా కుటుంబంలో వచ్చిన ఓ కుదుపు ఆమెను రాజకీయాల్లోకి వచ్చేలా చేస్తోంది. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రాజమండ్రిలో చేపట్టిన కాగడాల ప్రదర్శనలో భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు. ఇందులో బ్రాహ్మణి మాట్లాడిన మాటలు పార్టీ నేతల మనసులని కదలింపజేశాయి.

దేశం గర్వించదగిన నాయకుడు చంద్రబాబు, ఏ తప్పు చేశారని జైల్లో పెడతారు అంటూ ఆక్రోషించారు. సంక్షేమం చేయడమే ఆయన చేసిన నేరమా? అని నిలదీశారు. తాను ఒకచోట, లోకేశ్-దేవాన్ష్ మరోచోట ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని, తన భర్త లోకేశ్ ను అరెస్ట్ చేస్తారేమో అని చెప్పినప్పుడు కార్యకర్తల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తాము ఎప్పుడూ ఒంటరి కాదని, తమ వెంట లక్షలాది మంది ప్రజలు ఉన్నారంటూ ఆమె ఇచ్చిన స్పీచ్ కు కార్యకర్తలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Also Read..TDP: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ దొరికేశారా?

ఒకవేళ లోకేశ్ అరెస్ట్ అయితే నారా బ్రాహ్మణి ప్రజల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఎప్పుడూ రాజకీయ విమర్శలు చేయని బ్రాహ్మణి రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలతో కార్యకర్తల్లో కసి పెరిగింది. టీడీపీని బతికించుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధం అంటూ 2 రోజుల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బ్రాహ్మణి ప్రజల్లోకి వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ కష్ట సమయలో చంద్రబాబు, లోకేశ్ ప్రశాంతంగా బయటకు వచ్చే వరకు నారా బ్రాహ్మణి రాజకీయంగా కీలక పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నారు.