ఏపీ వైపు కాంగ్రెస్ అధిష్టానం చూపు.. ఢిల్లీలో కీలక భేటీ
తెలంగాణ విజయం తర్వాత ఇప్పుడు ఏపీలో రాజకీయ సమీకరణాలు తమకు కలిసి వస్తాయని భావిస్తోంది కాంగ్రెస్. తమ పార్టీ అడ్రస్‌ను గల్లంతు చేసిన జగన్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

Congress Party focus on Andhra Pradesh assembly elections
Andhra Pradesh Congress: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పొత్తుల లెక్కల రోజురోజుకు మారుతున్నాయి. జగన్ సింగిల్‌గా పోటీకి దిగుతుంటే.. టీడీపీ-జనసేన పొత్తు ఖాయమైంది. ఇక బీజేపీ నిర్ణయం మాత్రం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే వేగంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఏపీపై నేరుగా ఫోకస్ చేసిన ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ.. బుధవారం రాష్ట్ర నేతలతో భేటీ కావాలని నిర్ణయించారు. ఏపీలో కలిసివచ్చే పార్టీలతో పొత్తుల వ్యూహాలు రచిస్తూనే.. అధికార పార్టీకి టఫ్ ఫైట్ ఇచ్చేందుకు షర్మిలను రంగంలోకి దింపాలని చూస్తోంది.
దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణలో వరుస విజయాలు సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌పై గురిపెట్టింది. ఓవైపు జగన్ ఎంట్రీ.. మరోవైపు రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే పడింది. 2014, 2019 ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు. తెలంగాణ విజయం తర్వాత ఇప్పుడు ఏపీలో రాజకీయ సమీకరణాలు తమకు కలిసి వస్తాయని భావిస్తోంది కాంగ్రెస్. తమ పార్టీ అడ్రస్‌ను గల్లంతు చేసిన జగన్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్ షర్మిలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలతో ఏపీలో పొత్తులు పెట్టుకోవాలని చూస్తోంది హస్తం పార్టీ. ఈ క్రమంలోనే సీపీఐతో చర్చలు పూర్తిచేసిన కాంగ్రెస్.. సీపీఎం విషయంలోనూ త్వరలోనే స్పష్టత వస్తుందని భావిస్తోంది.
ఈ క్రమంలోనే బుధవారం ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలతో ఢిల్లీలో భేటీ కావాలని నిర్ణయించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. పొత్తులతో పాటు ఇతర అంశాలపై ఎలా వ్యవహరించాలన్న దానిపై AICC చీఫ్ ఖర్గేతోపాటు, రాహుల్‌గాంధీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో పర్యటించడం ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్రణాళిక రూపొందించారు ఆ పార్టీ అగ్రనేతలు ప్రియాంక, రాహుల్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సభలో రాహుల్ పాల్గొననుండగా.. అమరావతికి మద్దతుగా నిర్వహించే సభకు ప్రియాంక హాజరుకానున్నారు. జనవరిలోనే ఈ రెండు సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో పాటు, సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌కు ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంక్ తమవైపు మళ్లే అవకాశముందని అంచనా వేస్తున్నారు ఆ పార్టీ నేతలు.
Also Read: హాట్ టాపిక్‌గా కొడాలి నాని, వంగవీటి రాధ కలయిక.. ఏం జరుగుతోంది?
AICC అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సమయంలో ఏపీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలిపారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎలాంటి పోరాటాలు చేయాలనే దానిపై ఈ సందర్భంగా సూచనలు చేస్తారని తెలిపారు. ఇక ఏపీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు వైఎస్ షర్మిల వస్తే గ్రాండ్ వెల్‌కమ్ చెబుతామన్నారాయన. కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామన్నారు రుద్రరాజు.
Also Read: వైసీపీలో టికెట్ల పంచాయతీ.. అభ్యర్థుల మార్పుపై మంత్రుల కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు పూర్తిగా జగన్‌వైపు నిలిచింది. వచ్చే ఎన్నికల్లో ఇది ఏమేరకు టర్న్ అవుతుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అయితే.. జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తులు పెట్టుకుంటున్నామని ప్రకటించిన చంద్రబాబు-పవన్ ఆశలపై మాత్రం కాంగ్రెస్ తాజా నిర్ణయాల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019లో జగన్‌కు ఓటు వేసిన వారు.. ఇప్పుడు వైసీపీకి ఓటు వేయొద్దని భావిస్తే.. టిడిపి-జనసేనతోపాటు కాంగ్రెస్ కూడా ప్రత్యామ్నాయంగా కనిపించే అవకాశముంది. కానీ అది కూడా అంత సులువుగా అయ్యేది కాదు. మొత్తంమీద కాంగ్రెస్ చేపట్టబోయే కార్యాచరణ ఎలా ఉండబోతోందన్నది మాత్రం 27న జరిగే సమావేశం తర్వాతే తెలిసే అవకాశముంది.