అత్తింటి వేదింపులకు తోడు కరోనా అటాక్ చేయడంతో మహిళ ఆత్మహత్య

అత్తింటి వేదింపులకు తోడు కరోనావైరస్ ఆ మహిళ జీవితాన్ని చిదిమేసింది. పిల్లలు పుట్టకపోవడంతో పాటు అదనపు కట్నం తీసుకురావాలని మహిళకు వేదింపులు ఎక్కువైపోయాయి. దీంతో శనివారం మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు జిల్లాలోని గ్రామీణ మండలానికి చెందిన ఓ యువతికి బంధువుల్లోని వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహమైంది.
మనుమసిద్ధి నగర్‌లో నివాసం ఉంటున్న వీరికి పిల్లలు లేరు. ఇదే కారణంతో కొంతకాలంగా అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఇదే సమయంలో సమీప బంధువులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అనుమానంతో ఆమెకు కూడా పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలింది. అత్తింటి వారి నిరాదరణకు గురైన మహిళ శనివారం ఒంటరిగా ఉంది.
ఆ సమయంలో భర్త, కుటుంబ సభ్యులు కావలి వెళ్లగా.. ఒంటరిగా ఉన్న యువతి మనస్తాపంతో పురుగులమందు తాగింది. కావలికి వెళ్లిన మృతురాలి భర్త పలుమార్లు ఫోన్‌చేసినప్పటికీ ఆన్సర్ చేయకపోవడంతో హుటాహుటిన నెల్లూరుకు వచ్చి తలుపులు పగులగొట్టి చూశారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిసి బాధిత కుటుంబ సభ్యులు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.