Pawan Kalyan: మరో 15ఏళ్లు కూటమి ప్రభుత్వమే ఉండాలి.. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తాం- పవన్ కల్యాణ్
మోదీ ప్రభుత్వాన్ని నడపటమే కాదు.. భావి తరాలకు బాట వేస్తున్నారని కీర్తించారు.

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం 15ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తట్టుకుని నిలబడతామన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో సమిష్టిగా ముందుకెళ్తామన్నారు. కర్నూలు నన్నూరులో సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఎలాంటి లాభం ఆశించకుండా ప్రధాని మోదీ దేశ సేవ చేస్తున్నారని పవన్ కితాబిచ్చారు. ప్రధాని మోదీ భారత దేశాన్ని ప్రపంచపటంలో నిలిపారని చెప్పారు. పన్నుల భారాన్ని తగ్గించారని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాలకు లబ్ది చేకూరిందన్నారు. జీఎస్టీ తగ్గింపుతో అందరూ లాభం పొందారని చెప్పారు. ఒక తరం కోసం ఆలోచించే నాయకుడు సీఎం చంద్రబాబు అని పవన్ కల్యాణ్ కితాబిచ్చారు.
మోదీ ప్రభుత్వాన్ని నడపటమే కాదు.. భావి తరాలకు బాట వేస్తున్నారని కీర్తించారు. ”మోదీని కర్మయోగిగా చూస్తా. ధర్మాన్ని పాటిస్తూ.. కర్మని అనుసరిస్తారు. దేశం తలెత్తుకుని చూసేలా మోదీ చేస్తున్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తాం. వచ్చే తరం ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తాం” అని పవన్ కల్యాణ్ అన్నారు.
దేశాన్ని సూపర్ పవర్ గా మార్చిన ఘనత మోదీది అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మోదీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అయిందన్నారు. నమో అంటేనే విక్టరీ అని చెప్పారు. మోదీ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ దిమ్మతిరిగిందని మంత్రి లోకేశ్ అన్నారు.
Also Read: దేశానికి సరైనోడు.. ఇలాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు- ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం