Ys Jagan Mohan Reddy : సెకీ లేఖ, సోలార్ పవర్ వివాదంపై జగన్ కీలక వ్యాఖ్యలు..
రాష్ట్రానికి మంచి చేస్తే బురదజల్లుతున్నారు. చంద్రబాబు హయాంలో రూ.87 వేల కోట్ల సంపద ఆవిరైంది..

Ys Jagan Mohan Reddy : అదానీ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ బీఐ ఛార్జిషీటులో తన పేరు ఎక్కడా లేదని జగన్ అన్నారు. అదానీతో భేటీకి, విద్యుత్ ఒప్పందాలకు సంబంధమే లేదని ఆయన స్పష్టం చేశారు. నాకు లంచం ఆఫర్ చేసినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని జగన్ ప్రశ్నించారు. వాస్తవాలు తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. తన పరువు, ప్రతిష్టలు దెబ్బతీసేవారిపై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేయబోతున్నా అని జగన్ అన్నారు.
”అదానీతో భేటీకి, విద్యుత్ ఒప్పందాలకు సంబంధమే లేదు. రాష్ట్రంలో అదానీకి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఎఫ్ బీఐ చార్జ్ షీటులో నా పేరు ఎక్కడా లేదు. వాస్తవాలు తెలియకుండా నాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అమెరికాలో పెట్టిన కేసు గురించి నాకు తెలియదు. నా పరువు, ప్రతిష్టలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి లీగల్ నోటీసులు ఇస్తాం. రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేయబోతున్నాం ”అని జగన్ చెప్పారు.
రాష్ట్రంలో బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాపోయారు. ఐదేళ్ల అభివృద్ధి అంతా కూటమి ప్రభుత్వంలో వెనకబడుతోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ లో ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. సూపర్ సిక్స్ లు అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న జగన్.. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రం తిరోగమనం వైపు వెళ్తోందని, రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు జగన్.
సోలార్ పవర్ వివాదంపైనా జగన్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ”డిసెంబర్ 1న సెకీ, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగింది. ఒప్పందంలో సెకీ, ఏపీ ప్రభుత్వం, డిస్కమ్ లు సంతకాలు చేశాయి. 2021 సెప్టెంబర్ 15న సెకీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వచ్చింది. యూనిట్ కు రూ.2.49కి విద్యుత్ ఇస్తామని సెకీ పేర్కొంది. ఐఎస్ టీఎస్ ఛార్జీలు లేకుండా సెకీ ఆఫర్ చేసింది. 9వేల మెగావాట్ల సోలార్ పవర్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
ఏపీ చరిత్రలోనే అతి తక్కువకు చేసుకున్న ఒప్పందం ఇది. ఉచిత కరెంట్ కు రూ.9వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం. రాష్ట్రానికి మంచి చేస్తే బురదజల్లుతున్నారు. చంద్రబాబు పీపీఏల వల్ల రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ కు అదనంగా రూ.3.41 కట్టాలి. చంద్రబాబు పీపీఏల వల్ల ఏడాదికి రూ.1500 కోట్ల అదనపు భారం పడింది. మా హయాంలో సంపద సృష్టి లక్ష కోట్లు అయితే.. చంద్రబాబు హయాంలో రూ.87 వేల కోట్ల సంపద ఆవిరైంది” అని జగన్ అన్నారు.
”కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ల ఉద్యోగాలు పోయాయి. రాష్ట్రంలో దళారుల రాజ్యం నడుస్తోంది. తక్కువ రేటుకు రైతులు ధాన్యం అమ్ముకుంటున్న దుస్థితి ఉంది. రాష్ట్రంలో 104, 108 పడకేసింది. సంపద సృష్టి మా హయాంలోనే జరిగింది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో విప్లవాత్మక అడుగులు పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ అడుగులు వెనక్కి పడుతున్నాయి. ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నట్లు కనిపించడం లేదు. బడ్జెట్ తో ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారు. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకం ఇంటి వద్దకే అందించాం. ఏపీలో ఎక్కడ చూసినా లిక్కర్, ఇసుక స్కామ్, పేకాట క్లబ్బులే” అని కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగారు జగన్.
Also Read : కస్టోడియల్ టార్చర్ కేసు.. అప్పటి సీఐడీ చీఫ్‌కు చిక్కులు తప్పవా? ఆ పెద్ద నేతే టార్గెట్టా?