Ys Jagan Mohan Reddy : మీ కేసులకు భయపడేది లేదు, పోరాటాలు ఆపేది లేదు- వైఎస్ జగన్

మిర్చి రైతులు సంక్షోభంలో ఉంటే మేము స్పందించే వరకు ప్రభుత్వంలో కదలిక రాలేదని సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు జగన్.

Ys Jagan Mohan Reddy : మీ కేసులకు భయపడేది లేదు, పోరాటాలు ఆపేది లేదు- వైఎస్ జగన్

Updated On : February 21, 2025 / 12:43 AM IST

Ys Jagan Mohan Reddy : కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ సీఎం జగన్. మీ కేసులకు భయపడేది లేదు, ప్రజా పోరాటాలను ఆపేదిలేదని జగన్ స్పష్టం చేశారు. నేను రైతు పక్షపాతిని, ప్రజల పక్షపాతిని. మీరు ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం, ప్రజల కోసం నిలబడతాను అని జగన్ తేల్చి చెప్పారు. ఇప్పటికైనా మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోండి అని సీఎం చంద్రబాబును కోరారు జగన్. ఈ సంక్షోభం నుంచి రైతులు బయటపడేలా, వారికి ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే కొనుగోళ్లు ప్రారంభించండి అంటూ ట్వీట్ చేశారు జగన్.

మిర్చి రైతులు సంక్షోభంలో ఉంటే మేము స్పందించే వరకు ప్రభుత్వంలో కదలిక రాలేదని సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు జగన్. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ రైతుల కోసమే అన్నట్లుగా కలరింగ్ ఇచ్చారని ధ్వజమెత్తారు. ఎప్పుడూ మిర్చి కొనని నాఫెడ్.. కొనాలంటూ కేంద్రానికి లేఖ రాయడం ఏంటని చంద్రబాబును ప్రశ్నించారు. రైతులకు బాసటగా నిలిస్తే మాపై కేసులు పెట్టారని మండిపడ్డారు జగన్.

‘తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయిన పరిస్థితి ఉంది. కొనే వాడు లేక రూ.10వేలకు రైతులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు రూ.1,50,000 పైమాటే. ఇంతటి సంక్షోభం ఉన్నప్పటికీ, మేం స్పందించేంతవరకూ మీలో కదలిక లేదు. మీరు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ మిర్చి రైతుల కోసమే వెళ్తున్నట్టుగా కలరింగ్‌ ఇస్తున్నారు.

తూతూ మంత్రంగా మళ్లీ రైతులను మోసం చేసి, ఏ సంబంధం లేని కేంద్రానికి లేఖ రాయడం ఏంటి? కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌ ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖ రాయడం ఏంటి? మీరు బాధ్యతను వేరే వాళ్ల మీద నెట్టడం ఏంటి? మీరు చేయాల్సిన పనులు చేయకుండా కుంటిసాకులు వెతుక్కోవడం ఏంటి? ఈ రకంగా రైతులను మోసం చేస్తున్నారు.

Also Read : జగన్ ఏపీని అప్పుల కుప్పగా మార్చేశారు- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

మిర్చి రైతులకు బాసటగా వెళ్లినందుకు మాపై కేసులు పెట్టారు. అలాంటప్పుడు ఈ ఫిబ్రవరి 15న, మీరు పాల్గొన్న మ్యూజికల్‌ నైట్‌కు ఎన్నికల కోడ్‌ అడ్డం రాలేదా? నేను మిర్చి రైతులను కలుసుకుంటే ఎన్నికల కోడ్‌ అడ్డు వచ్చిందా? పైగా మేము ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నిన్నటి కార్యక్రమంలో పలానా వారికి ఓటు వేయమని కూడా చెప్పలేదు. కనీసం మైక్‌లో కూడా మాట్లాడలేదు. అయినా అన్యాయంగా కేసులు పెట్టారు. ఇది అప్రజాస్వామికం కాదా?” అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు జగన్.