Ys Jagan : కష్టాలనేవి శాశ్వతంగా ఉండవు, మళ్లీ వచ్చేది వైసీపీ సర్కారే- కార్యకర్తలతో జగన్
ప్రతి సమస్యలోనూ ప్రజలకు అండగా ఉండే కార్యక్రమం ముమ్మరంగా అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది.

Ys Jagan : సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత జగన్. ప్రస్తుతం ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు హుందాతనం లేదన్నారు. అన్ని పదవులు తనకే కావాలన్న అహంకారం చంద్రబాబుదని జగన్ విమర్శించారు. కష్టాలు అనేవి శాశ్వతంగా ఉండవని, వచ్చేది వైసీపీ సర్కారే అని జగన్ అన్నారు. ప్రతీ సమస్యలోనూ ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.
ప్రతి సమస్యలోనూ ప్రజలకు అండగా ఉండే కార్యక్రమం ముమ్మరంగా అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజు జరుగుతున్న పరిస్థితులు, విషయాలు మీ అందరికీ తెలుసు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా జరుగుతోందో మీ అందరికీ తెలుసు.
Also Read : 12రోజులుగా పరారీలో మాజీమంత్రి కాకాణి.. దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు..
చంద్రబాబు అనే వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి హుందాతనం ఉంటుంది. ఈ మనిషికి ఆ హుందాతనం లేదు. తాను ముఖ్యమంత్రిని కాబట్టి ఏ పదవైనా తనకే కావాలి, తనకు సంఖ్యా బలం లేకపోయినా తనకే కావాలి అనే అహంకారంతో ఈరోజు చంద్రబాబు రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు.
”రాజకీయాల్లో గెలుపోటములు సహజం. వైసీపీకి సంబంధించిన ఏ నాయకుడైనా గర్వంగా కాలర్ ఎగరేసుకుని ఏ ఇంటికైనా వెళ్లి చిరునవ్వుల మధ్య వారి ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఏ నాయకుడికైనా ఉంది అంటే అది ఒక్క వైసీపీ నాయకులకే మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలను. వైసీపీ అధికారంలోకి రాకముందు రాజకీయాలు ఒకలా ఉండేవి. వైసీపీ వచ్చాక రాజకీయాలకు అర్థం ఇది అని చెప్పి తిరగరాసిన చరిత్ర ఏ పార్టీకైనా ఉందని అంటే అది వైసీపీకి మాత్రమే ఉందని గర్వంగా చెబుతున్నా.
ప్రజలకు తోడుగా ఉండాల్సిన సమయం వచ్చింది. గ్రామ స్థాయి నుంచి మనం బలోపేతం కావాలి. క్యాడర్ ను ఏకం చేయాలి. ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం దిశగా ముమ్మరంగా అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది. చంద్రబాబు తన అహంకారంతో ప్రలోభాలు పెడుతూ, భయపెడుతూ పాలన సాగిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి పదవి తనకే కావాలని తపన పడుతున్నారు.
ఎందుకు చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నారు, ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటే.. దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చంద్రబాబుకు భయం. వైసీపీ కార్యకర్త అంటే చంద్రబాబుకి భయం. చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోయాయి. టీడీపీ క్యాడర్ ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు.
చిన్నపిల్లలు సైతం టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీల గురించి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారనే భయంతో ప్రజల ఇళ్ల వద్దకు కూడా వెళ్లలేని పరిస్థితిలో చంద్రబాబు పార్టీ పాలన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబును ప్రశ్నించే స్వరం ఉండకూడదని రాష్ట్రవ్యాప్తంగా ఒక భయానక వాతావరణం క్రియేట్ చేయడంలో భాగంగా చంద్రబాబు ఇవన్నీ చేయిస్తున్నారు” అని ధ్వజమెత్తారు జగన్.