వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి కీలక నేత రాజీనామా, కారణం ఏంటంటే..
భవిష్యత్తు కార్యాచరణపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు ఆళ్ల నాని.

Alla Nani Resign : ఏలూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు మాజీ మంత్రి ఆళ్ల నాని. కొద్దిరోజుల క్రితమే ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి, నియోజకవర్గ ఇంచార్జ్ పదవికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. కొంతకాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆళ్ల నాని చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు స్పష్టం చేశారు ఆళ్ల నాని.
”నాకు వ్యక్తిగత బాధ్యతలు ఉన్నాయి. ఏదో ప్రణాళికతో నేను ఈ పని చేయడం లేదు. నాకు ఎవరితోనూ బేధాభిప్రాయాలు లేవు. పూర్తిగా ఇది నా వ్యక్తిగత కారణాలతో, వ్యక్తిగతంగా నాకున్న కొన్ని బాధ్యతలతో నేను ఈ నిర్ణయం తీసుకున్నా. కొంత కాలం రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని నేను అనుకోవడం నా వ్యక్తిగతం. దీనికి ఎవరూ కారణం కాదు. ఎవరి మీదనో అసంతృప్తితోనో, ఎవరి మీద ఇష్టం లేకనో ఇలా చేయడం లేదు. నాపై ఎవరి ఒత్తిడి లేదు. నాకు అసంతృప్తి అంతకన్నా లేదు” అని స్పష్టం చేశారు ఆళ్ల నాని.
వైసీపీ కార్యాలయం కూల్చివేతపై పుకార్లు నమ్మొద్దు- ఆళ్ల నాని
వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని ఏలూరు జిల్లాలోని పార్టీ కార్యాలయం కూల్చివేతపైన వచ్చే వదంతులను నమ్మొద్దని వివరణ ఇచ్చారు. రెండు సంవత్సరాల కాలంగా పార్టీ ఆఫీస్ కోసం స్థలాన్ని లీజుకి తీసుకున్నామని, లీజు అయిపోయిన నేపథ్యంలో తాత్కాలిక షెడ్లను కూల్చివేశారని ఆయన వివరించారు. ఎన్నికలకు 3 నెలల ముందే మిధున్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, దాన్ని హ్యాండోవర్ చేయమని అప్పుడే చెప్పారన్నారు. పార్టీ కార్యాలయం అంశంలో దష్ప్రచారం జరగడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొందని ఆళ్ల నాని చెప్పారు.
”ఏలూరు వైసీపీ జిల్లా కార్యాలయం కూల్చివేతపై వదంతులు నమ్మొద్దు. ఆ భవనాన్ని లీజుకి తీసుకున్నాం. భవన యజమాని రిపేర్లు చేస్తామని చెప్పడంతో ఖాళీ చేశాం. ఎన్నికలకు ముందే ఖాళీ చేయాల్సి ఉండగా అప్పుడు వాయిదా వేశాం. పార్టీ అధిష్టానానికి తెలియజేసిన తర్వాతే ఖాళీ చేశాం” అని ఆళ్ల నాని పేర్కొన్నారు.
Also Read : టీడీపీతో టచ్‌లోకి వస్తున్న వైసీపీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు