సీఎం పదవికి చంద్రబాబు అనర్హుడు, పవన్ కల్యాణ్ ఏమయ్యారు?- మాజీమంత్రి కాకాణి ఫైర్
ప్రకాశం బ్యారేజీలో బోటు ఇరుక్కుంటే వైసీపీ కుట్ర చేసిందని మాట్లాడతారా? మెదడు ఉండే ఇలా మాట్లాడుతున్నారా?
Kakani Govardhan Reddy : వరదల్లో నష్ట నివారణ చర్యల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం ఉందని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు. ఆడలేక మద్దెల ఓడ అన్నట్లుగా సీఎం చంద్రబాబు మాటలు ఉన్నాయని ఆయన విమర్శించారు. అధికారులపై నింద వేసి వైఫల్యాలను కప్పి పుచ్చుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై నిందలు వేయడం ఏంటి? అని ధ్వజమెత్తారు. అధికారులు గతంలో టీడీపీ హయాంలో కూడా పని చేశారని గుర్తు చేశారు కాకాణి.
”నివారణ చర్యలు చేపట్టలేని చంద్రబాబు సీఎం పదవికి అనర్హుడు. చంద్రబాబు చెత్త సీఎంలా మిగిలిపోయారు. వరదలు వచ్చిన మూడు రోజుల తర్వాత చంద్రబాబు బయటకు వచ్చి హడావిడి చేశారు. మీ చేష్టల వల్ల ఇలా ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. రియల్ టైం గవర్నెన్స్ అని పదే పదే చెప్పే మీరు ఇప్పుడెందుకు విఫలమయ్యారు? వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు ఫోటోలకు ఫోజివ్వడం తప్ప చేసిందేమీ లేదు? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏమయ్యారో తెలీదు. ఇంకా బర్త్ డే వేడుకల్లోనే ఉన్నారా? చంద్రబాబు అనుభవం ఉన్న నేత అంటూ కితాబిచ్చి అన్నీ ఆయనే చూసుకుంటారని చెప్పి పవన్ ఊరుకున్నారు. లోకేశ్ ఏమయ్యారు..? హైదరాబాద్ వెళ్లి మళ్ళీ ఎప్పుడో వచ్చారు.
చంద్రబాబు స్కాముల ఆధారాలు సేకరించడం అధికారుల తప్పా? రెడ్ బుక్ తెచ్చి దాని ప్రకారం పాలన చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో బోటు ఇరుక్కుంటే వైసీపీ కుట్ర చేసిందని మాట్లాడతారా? చంద్రబాబుకు మెదడు ఉండే ఇలా మాట్లాడుతున్నారా? వరదల ముందస్తు చర్యలు మాని ఐపీఎస్ అధికారులు, సినీ నటి కేసులో బిజీగా ఉన్నారు.
జగన్ నీళ్ళలోకి దిగిన తర్వాత చంద్రబాబు నేలపై కాలు పెట్టారు. రాజకీయాల్లోకి రాకముందు వేసుకునే కోట్లు కూడా లేని చంద్రబాబుకు ఇప్పుడు 25 వేల కోట్లు ఎలా వచ్చాయి? జగన్ బెస్ట్ చంద్రబాబు వేస్ట్ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇకనైనా చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్స్ మానుకోవాలి. అధికారంలో ఉన్నది చంద్రబాబు. ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత మీదే. జగన్ వచ్చాక ప్రజల స్పందన చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారు” అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
Also Read : 10 నిమిషాల వర్షానికే నదుల్లా కాలనీలు.. బెజవాడ మునిగింది అందుకేనా? ఇక్కడా బుల్డోజర్ దిగాల్సిందేనా?