అందుకే పార్టీ మారుతున్నా- మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కీలక వ్యాఖ్యలు
జనసేనలో తన రోల్ ఎలా ఉండాలో పవన్ కల్యాణ్ చెబుతారని సామినేని పేర్కొన్నారు.

Samineni Udayabhanu : వైసీపీని వీడటానికి కారణం ఏంటో చెప్పారు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. వైఎస్ జగన్ నాయకత్వంపై నమ్మకం లేకనే తాను పార్టీ మారుతున్నానని ఆయన తెలిపారు. గతంలో తన నియోజకవర్గం అభివృద్ధికి జగన్ సహకరించలేదని సామినేని ఆరోపించారు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ జగన్ విఫలం అయ్యారని వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ మారుతున్నానని వివరించారు.
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో సామినేని భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ తో అనేక విషయాలు చర్చించానని ఆయన తెలిపారు. జనసేనలో తన రోల్ ఎలా ఉండాలో పవన్ కల్యాణ్ చెబుతారని సామినేని పేర్కొన్నారు. ఈ నెల 22న జనసేనలో చేరతానన్నారు. రేపు నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశం అవుతానని సామినేని ఉదయభాను వెల్లడించారు.
వైఎస్ఆర్ కోసమే ఇన్నాళ్లూ వైసీపీలో ఉన్నా..
”12 ఏళ్లు వైసీపీలోనే పని చేశాను. ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీని వీడి జనసేనలో చేరబోతున్నా. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో నేను పని చేశాను. రాజశేఖర్ రెడ్డి నాకు రాజకీయ భిక్ష పెట్టారు. మొట్టమొదటి సారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. రెండోసారి కూడా ఇచ్చారు. ఇలా మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశాను. వైఎస్ఆర్ నాయకత్వంలో పని చేశాను కాబట్టి ఆ కుటుంబానికి నేను కూడా అండగా ఉండాలని ఇన్నాళ్లూ ఉన్నా. ఇవాళ ఆ పార్టీతో కొనసాగాలి అనే ఉద్దేశం నాకు లేదు. అందుకే వైసీపీకి రిజైన్ చేసి జనసేనలో చేరతాను. మంత్రి పదవి ఇవ్వలేకపోవడం వల్ల కొంత అసంతృప్తికి లోనైన మాట వాస్తవమే.
జగన్ వ్యవహారశైలి నచ్చలేదు..
ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా జగన్ వ్యవహార శైలి నాకు నచ్చ లేదు. ప్రతిపక్ష పాత్ర వహించడంలో జగన్ ఫెయిల్ అయ్యారు. జగన్ నాయకత్వం పట్ల నాకు నమ్మకం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీకి రిజైన్ చేస్తున్నా. ఏ పార్టీలో పని చేసినా, ప్రజాప్రతినిధిగా ఉన్నా.. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పని చేశా. ఐదేళ్లు జగన్ సీఎంగా ఉన్నా నా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయలేదు. అనేక రకాల సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లినా.. ఆ సమస్యల పరిష్కారానికి జగన్ ఎక్కడా సహకరించలేకపోయారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వైసీపీకి రాజీనామా చేస్తున్నా. నేను కూటమికి సపోర్ట్ గా, పవన్ కల్యాణ్ నాయకత్వంపై నమ్మకంతోనే జనసేనలో చేరుతున్నా. అంతేతప్ప ఎటువంటి హామీలు నేడు అడగలేదు. వాళ్లు చెప్పలేదు” అని సామినేని ఉదయభాను తెలిపారు.
Also Read : జగన్‌పై మాజీమంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు.. పవన్‌పై ప్రశంసల వర్షం..