Vijayasai Reddy: అప్పటివరకు జగన్ అధికారంలోకి రారు, వారిని కలుపుకుని వెళ్ళే పార్టీకే భవిష్యత్తు- విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
నాకు అక్రమ ఆస్తులు ఉన్నాయని వస్తున్న ఆరోపణలన్నీ చంద్రబాబు చేస్తున్నవే. నాకు అక్రమ ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే.. నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా అని చెప్పాను.
Vijayasai Reddy Representative Image (Image Credit To Original Source)
- జగన్ పొగ పెట్టి నన్ను బయటకు పంపారు
- నేను ప్రలోభాలకు లొంగి ఉంటే లక్షల కోట్లు సంపాదించే వాడిని
- ఈ కూటమి ఇలాగే కొనసాగితే జగన్ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు
- చంద్రబాబు ప్రభుత్వం దుష్ట ప్రభుత్వం
- ఈ నెల 25 తర్వాత రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేస్తా
Vijayasai Reddy: లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ విచారించింది. 8 గంటలకు పైగా ఈ విచారణ సాగింది. విజయసాయిరెడ్డి స్టేట్ మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. ఆర్థిక లావాదేవిల గురించి ప్రశ్నించినట్లు సమాచారం. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది. ఈడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో తనకేమీ తెలియదన్నారు. ఈ స్కామ్ కు కర్త, కర్మ, క్రియ రాజ్ కేసిరెడ్డి అని చెప్పారు. ఏపీలో కూటమిని విడగొట్టినప్పుడు జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో అప్రూవర్ గా మారే ప్రసక్తే లేదన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ లో సుదీర్ఘంగా విచారించింది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి పలు అంశాలపై సంచలన కామెంట్స్ చేశారు.
”ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 అనేది ఉండదని చెప్పా. కేసులు చుట్టుముట్టిన తర్వాతే.. నన్ను నెంబర్ 2 అని ప్రచారం చేశారు. కేసులు ఉన్నప్పుడే నన్ను నెంబర్ 2 అంటారు అని వారితో చెప్పా.
అధికారంలోకి వచ్చాక నన్ను పక్కన పెట్టారు..
ఏవైనా లాభాలు వస్తే.. నేను నెంబర్ 100 లో కూడా ఉండను. అధికారం రాకముందు వరకు జగన్ నాకు నెంబర్ 2 స్థానమే ఇచ్చారు. గుండెల్లో పెట్టుకుని చూశారు. కానీ అధికారం లోకి వచ్చిన తర్వాత నుంచి జగన్ చుట్టూ ఉన్న కోటరీ.. నాపై లేనిపోనివి చెప్పారు. నేను నమ్ముతున్న వేంకటేశ్వర స్వామి మీద ఒట్టు వేసి చెప్తున్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే నన్ను పక్కన పెట్టారు. జగన్ కి క్కర్ స్కాం గురించి తెలియదు.. తెలిసి ఉంటే.. జగన్ ఊరుకోరు.. ఈ విషయాన్ని నేను ED అధికారులకు చెప్పాను. ఈ సమాధానం రికార్డ్ చేయలేదు. లిక్కర్ స్కాం బయటకు రావడం వల్లే.. నువ్వు పార్టీ నుంచి బయటకు వచ్చావా అని అడిగారు. జగన్ నన్ను దూరం పెట్టడాన్ని తట్టుకోలేక.. అవమానం, మనస్థాపంతోనే పార్టీ నుంచి బయటకు వచ్చాను అని చెప్పాను. ఈ విషయం రికార్డ్ చేశారు.
నా ఆస్తుల వివరాలన్నీ ED అధికారులకు ఇచ్చాను. ఇవి కాకుండా నాకు ఏవైనా ఆస్తులు ఉంటే.. ఎలాంటి చర్యలకైనా సిద్ధం అని చెప్పా. నాకు అక్రమ ఆస్తులు ఉన్నాయని వస్తున్న ఆరోపణలన్నీ చంద్రబాబు చేస్తున్నవే. నాకు అక్రమ ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే.. నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా అని చెప్పాను. నేను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల నుంచి తప్పుకోను. భవిష్యత్ ప్రణాళిక ఏంటో త్వరలో మీడియా ముందు ప్రకటిస్తాను.. తిరిగి రాజకీయ ప్రవేశం చేస్తా. చంద్రబాబు ప్రభుత్వం.. కక్ష పూరిత చర్యలకు పాల్పడుతోంది. సాయిరెడ్డి అనే వ్యక్తి.. వెనక్కి తగ్గే వాడు కాదు.
కోటరీ ఉన్నంత వరకు జగన్ అధికారంలోకి రాడు..
అధికారం శాశ్వతం కాదు.. జగన్ అధికారంలోకి రాగానే.. 25 ఏళ్ల పాటు అధికారంలో ఉంటా అనుకున్నాడు. చంద్రబాబు, లోకేష్ కూడా ఇప్పుడు మరో 25 ఏళ్ళు మేమే ఉంటాం అనుకుంటున్నారు. జగన్ చుట్టూ.. కోటరీ ఉన్నంత వరకు జగన్ అధికారంలోకి రాడు. కూటమిని విడగొట్టాలి.. అప్పుడే అధికారం సాధ్యం. కొన్ని నెలలుగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను. ఎవరినీ విమర్శించలేదు. నేను ప్రలోభాలకు లొంగాను అని జగన్ అన్నారు.
జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. వేంకటేశ్వర స్వామిపై ఒట్టు వేసి చెప్తున్నా. నేను ప్రలోభాలకు లొంగలేదు. అలా చేసి ఉంటే.. వందల కోట్లు సంపాదించి ఉండే వాడిని. జగన్ కి ఒక పాలేరుగా పనిచేశా. అలాంటి నన్ను పొగ పెట్టి పంపేశారు. నేను పాలేరుగా ఉండి పండించిన మొత్తాన్ని కోటరీలో ఉన్న చాలామంది పందికొక్కుల్లా తిన్నారు. నేను ఏ పార్టీలో చేరను. నా భవిష్యత్ ప్రణాళిక నేనే ప్రకటిస్తా. నేను ఏదో సెపరేట్ పార్టీ పెట్టి.. చంద్రబాబు ఆర్థిక సహాయం తీసుకుంటూ.. పని చేస్తున్నా అని కొందరు జర్నలిస్టులు అంటున్నారు. అలా కామెంట్ చేస్తున్న వాళ్ళు.. YCP paytm బ్యాచ్.
ప్రపంచంలోనే ఉత్తమ ప్రధాని నరేంద్ర మోదీ..
రాజ్ కేసిరెడ్డి 100 కోట్లు ఎరేంజ్ చేయమని నేను రికమెండ్ చేసిన మాట వాస్తవమే. కానీ ఈ విషయం జగన్ కి తెలియదు. మిథున్ రెడ్డికి తెలుసు. లిక్కర్ స్కామ్ కి సంబంధించి.. ఎప్పుడైనా సమావేశం అయ్యారా అని అడిగారు. ఎప్పుడూ అవలేదు.. నాకు లిక్కర్ స్కాం అంశమే తెలియదు..
రాజ్ కేసిరెడ్డి మాత్రమే లిక్కర్ స్కామ్ కి కర్త, కర్మ, క్రియ. ప్రపంచంలోనే ఉత్తమ ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్నారు. ఆంధ్రాలో కూడా ఒక రాజకీయ శక్తి ఉద్భవించాలి. బీజేపీని కలుపుకుని వెళ్ళే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. నేను అప్రూవర్ గా మారలేదు. నేను లిక్కర్ స్కాం లో ఉండి ఉంటే.. నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు.. నేను అక్యూస్డ్ లిస్ట్ లో ఉన్నాను కాబట్టే నన్ను ED పిలిచింది. నేనేదో ఆస్తులు దోచుకున్నాను అని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని పరిగణలోకి తీసుకునే.. నన్ను ED పిలిచింది. నేను ఛాలెంజ్ చేస్తున్నా..నేను ఆస్తులు కూడబెట్టి ఉన్నట్లు ప్రూవ్ చేస్తే.. దేనికైనా సిద్ధం..
సిట్ చీఫ్ కి ఛాలెంజ్ చేస్తున్నా.. నేను ఇటీవల చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేయలేదు. ప్రతీ ఒక్కరికీ వర్తిస్తుంది. ఏ రాజకీయ పార్టీలో అయితే వంశపారంపర్య నేపథ్యం ఉంటుందో.. ఆ పార్టీలో పంది కొక్కుల కోటరీ ఉంటుంది” అని విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: పాదయాత్ర 2.O.. పాత ఫార్ములా జగన్‌ను తిరిగి పవర్‌లోకి తెస్తుందా?
