Extreme Sunshine : నిప్పుల కొలిమి : తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

కనిష్టంగా 42 .. గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవడంతో .. జనం బయటకు అడుగుపెట్టేందుకే జంకుతున్నారు. ఏపీలో.. భానుడి భగభగలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి.

Extreme Sunshine : నిప్పుల కొలిమి : తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

Sun

Updated On : May 3, 2022 / 7:45 PM IST

Extreme sunshine : సూర్యుడు సుర్రుమంటున్నాడు. తెలుగు రాష్ట్రాలపై సెగలుగక్కుతున్నాడు. భానుడి భగభగలకు ఎండలు మండిపోతున్నాయ్‌. ఉష్ణోగ్రతలు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండంగా మారిపోయాయి. కనిష్టంగా 42 .. గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవడంతో .. జనం బయటకు అడుగుపెట్టేందుకే జంకుతున్నారు. ఏపీలో.. భానుడి భగభగలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి.

రాష్ట్రంలో వేడి తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దాదాపు 514 మండలాల్లో సోమవారం ఎండ దంచికొట్టింది. 152 మండలాల్లో తీవ్రమైన వేడి గాలులు ఉన్నట్లు వాతావరణశాఖ చెప్పింది. నెల్లూరు, వైఎస్సార్, తిరుపతి, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఎక్కువ మండలాల్లో .. ఎండ ప్రభావం అధికంగా ఉంది.

Temperatures : దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు.. ఏప్రిల్‌లో 122 ఏళ్ల అత్యధిక ఉష్ణోగ్రతలు

రాయలసీమ జిల్లాల్లో.. ఎక్కువ ప్రాంతాల్లో ఎండ వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇక ఇవాళ, రేపు ఇదే తరహా వాతావరణం ఉంటుందని .. అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. మరోవైపు బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులతో.. చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. విశాఖ ఏజెన్సీలోనూ అక్కడక్కడా జల్లులు పడ్డాయి.

అటు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. రాష్ట్రంలో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తెలంగాణ నిప్పులగుండంగా మారుతోంది. వారం రోజులుగా సూర్యుని ప్రతాపానికి.. జనం చెమటలుగక్కుతున్నారు. బయటకు రావడానికి అల్లాడుతున్నారు. అటు వేసవిలో వ్యాధులు, వడదెబ్బకుగురి కాకుండా తగిన జాగత్తలు తీసుకోవాలని.. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆరేళ్లలోపు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలంటున్నారు.

heatwave: పెరుగుతున్న ఎండలు.. జాగ్రత్తలు చెప్పిన కేంద్రం

అటు రానున్న నాలుగు రోజుల్లో.. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 6 వరకు ఈదురుగాలులు వీయడంతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమల మీదుగా ఇంటీరియర్‌ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని, దీని ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో హైదరాబాద్‌లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.