కొడాలి నాని అరెస్ట్‌ ఇష్యూ.. అసలేం జరుగుతోంది? ఆ వార్తల వెనుక ఉన్నదెవరు?

టెక్నికల్ ఎవిడెన్స్‌ ఆధారంగా పలువురు అనుమానితులపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

కొడాలి నాని అరెస్ట్‌ ఇష్యూ.. అసలేం జరుగుతోంది? ఆ వార్తల వెనుక ఉన్నదెవరు?

Kodali Nani

Updated On : June 21, 2025 / 8:17 PM IST

రేపోమాపో అరెస్ట్ అంటూ ప్రచారం. కేసుల ఉచ్చు బిగిసిందన్న టాక్. ఆయన కదలికలపై పోలీసులు నిఘా పెట్టారన్న లీకులు..ఇలా ఏడాదిగా మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ ఇష్యూ డైలీ ఎపిసోడ్‌గా కొనసాగుతూ వస్తోంది. అక్కడక్కడ ఆయన మీద కేసులు అయ్యాయి. కానీ ఇప్పటివరకు కొడాలి నాని అరెస్ట్ కాలేదు. ఈ సారి ఆయన అరెస్ట్ పక్కా అని ప్రచారం జరిగిన ప్రతీసారి అది నిజం కాలేదు. పైగా నానికి పోలీసులు నోటీసులు ఇచ్చిన సందర్భాలు లేవు. తన మీద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయపోరాటం చేస్తూ వస్తున్నారు కొడాలి నాని.

కానీ ఏమైందో ఏమో తెలియదు. ఎవరు క్రియేట్‌ చేశారో..లీకులు ఇచ్చిందెవరో కానీ కొడాలి నాని అరెస్ట్‌ అంటూ ఊదరగొట్టారు. అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలోని కొన్ని న్యూస్‌ ఛానల్స్‌, వెబ్‌సైట్స్‌ నాని అరెస్ట్ అంటూ కథనాలు ఇచ్చాయి. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. తీరా పోలీసులు క్లారిటీ ఇచ్చే వరకు నాని అరెస్ట్ అయ్యారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. చివరకు ఏపీ పోలీసులు రంగంలోకి దిగి నాని హైదరాబాద్‌లోనే ఉన్నారు..ఆయనను ఎవరు అరెస్ట్ చేయలేదని చెప్పాల్సి వచ్చింది.

వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి..ఇలా పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. యాక్చువల్‌గా వంశీ కంటే ముందే కొడాలిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. పరిస్థితులు కూడా అప్పట్లో అలాగే కనిపించాయి. అయితే అపోజిషన్‌లోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు నాని. ఆ మధ్య వంశీ అరెస్టు సమయంలో విజయవాడ జైలు దగ్గర కనిపించి అరెస్టులకు భయపడేది లేదన్నట్లుగా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

Also Read: స్మార్ట్‌ వాచ్‌ల నుంచి స్మార్ట్‌ రింగ్స్‌కి.. అప్‌గ్రేడ్ అవుతున్న జనాలు.. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలూ ఇవే వాడుతున్నారు.. ఎందుకంటే?

అయితే అప్పటికే కొడాలి నానికి హార్ట్‌కు సంబంధించిన ప్రాబ్లమ్‌ ఉందని..ఆయన రెగ్యులర్‌గా ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటున్నారని ఆయన సన్నిహతులు చెబుతూ వచ్చారు. ఆ మధ్య గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ కూడా చేయించుకున్నారు నాని. ఆ తర్వాత ముంబై వెళ్లి కూడా చికిత్స తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మొత్తం మీద ఆయనకు హెల్త్ ప్రాబ్లమ్స్‌ ఉండటంతో..ఇప్పట్లో కొడాలి నాని అరెస్ట్ ఉండకపోవచ్చన్న చర్చ తెరమీదకు వచ్చింది.

ఇబ్బంది పెట్టారన్న బద్నాం ఎందుకని ఆలోచన?
అనారోగ్యంతో ఉన్నందున అతడ్ని అరెస్ట్ చేసి సాధించేదేమి లేదని కూటమి సర్కార్ భావిస్తుందని అంటున్నారు. హెల్త్ బాలేనీ వ్యక్తిని అరెస్ట్ చేసి జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారన్న బద్నాం ఎందుకని కూడా ఆలోచిస్తున్నట్లు టాక్. ఇప్పటికే అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ జైలులో హెల్త్‌ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. రెగ్యులర్‌గా జైలు నుంచి హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. ఆరోగ్యం బాలేనందున బెయిల్ ఇవ్వాలని కోర్టులను అభ్యర్థిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొడాలి ఆరోగ్యం వంశీ కంటే కాస్త ఇబ్బందికరంగానే ఉందని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందట. అందుకే నాని విషయంలో క్యాడర్, లీడర్ల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా మానవత్వంతో వ్యవహరించాలని కూటమి పెద్దలు డిసైడ్ అయ్యారంటున్నారు. ప్రస్తుతానికి నాని ఎపిసోడ్‌ను పక్కకు పెట్టినట్లేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొడాలి ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నాకే ఆయనపై చర్యలు ఉంటాయని వైసీపీ కూడా భావిస్తోందట. అయితే ఇప్పటికీ ఆయన మెడికల్ సపోర్టుతోనే తిరుగుతున్నారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో కొడాలి అరెస్టు అంటూ వచ్చిన వార్తలపై ప్రభుత్వ పెద్దలు కాస్త సీరియస్‌గానే రియాక్ట్‌ అయ్యారట. అందుకే ఇమీడియేట్‌గా పోలీసులు రంగంలోకి దిగారంటున్నారు. కొడాలి అరెస్టు వార్తల ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తీసుకురావాలని ఎవరైనా కుట్ర చేస్తున్నారా.? అనేది తెలుసుకోవాలనుకుంటోందట ప్రభుత్వం.

టెక్నికల్ ఎవిడెన్స్‌ ఆధారంగా పలువురు అనుమానితులపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ క్యాడరే అత్యుత్సాహంతో నాని అరెస్ట్‌పై ప్రచారం చేశారని వైసీపీ కార్యకర్తలు అంటుంటే..వైసీపీ సోషల్‌ మీడియానే మైండ్ గేమ్ ఆడుతోందని..ఒకరిపై ఒకరు కౌంటర్ అటాక్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో నాని అరెస్ట్‌పై ఫేక్‌ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో క్లారిటీ వస్తుందని అంటున్నారు పోలీసులు.