Tirumala Laddu Counter Fire : తిరుమల లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన భక్తులు..

Tirumala Laddu Counter Fire : తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం జరిగింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు రావడంతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. 47వ నెంబర్ లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్ తో కేబుల్స్ కాలిపోయాయి. వెంటనే సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ..
లడ్డూ కౌంటర్ నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అటువంటి ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. మంటలు చెలరేగి, పొగ వ్యాపించడంతో భక్తుతు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఘటన జరిగిన వెంటనే టీటీడీ సిబ్బంది అప్రమత్తమైంది. మంటలను అదుపు చేసింది.
Also Read : తిరుపతి తొక్కిసలాట బాధితులకు చెక్కులు పంపిణీ.. వారికి ఇచ్చే పరిహారం ఎంతంటే..
యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు..
కంప్యూటర్ సిస్టమ్ కు సంబంధించిన యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు అక్కడి నుంచి భక్తులను బయటకు పంపేశారు. ఆ వెంటనే మంటలను అదుపు చేశారు. లేదంటే, ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని అంటున్నారు.
నిన్న తొక్కిసలాట, నేడు అగ్నిప్రమాదం..
ఇటీవలే తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు. 30 మందికిపైగా భక్తులు గాయపడ్డారు. స్వామి వారి వైకుంఠ దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం పెను విషాదాన్ని నింపింది. టీటీడీ చరిత్రలో ఎన్నడూ ఇలా జరిగింది లేదని అధికారులు తెలిపారు. ఇది మరువక ముందే.. తిరుమలలో మరో అపశ్రుతి జరిగింది. ఈసారి లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ వరుస ఘటనలు భక్తుల్లో కలవరం నింపాయి.
Also Read : తప్పుడు వార్తలు నమ్మొద్దు.. పాలక మండలిలో వివాదాలు లేవు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు