Vijayasai Reddy: విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్‌ వెనక అంతరార్థం ఏంటి? ఆయన టార్గెట్ ఎవరు?

ఇక భవిష్యత్‌లో ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండని విజయసాయి మాటల వెనక.. రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా పెను మార్పు రాబోతోందా.. లేదా కీలక నేతలపై కేంద్ర సంస్థలు మరిన్ని కఠిన చర్యలు తీసుకోబోతున్నాయా అనే చర్చ కూడా నడుస్తోంది.

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్‌ వెనక అంతరార్థం ఏంటి? ఆయన టార్గెట్ ఎవరు?

Updated On : January 19, 2026 / 8:46 PM IST
  • వెనెజువెలా రాజకీయ సంక్షోభాన్ని లింక్ చేస్తూ ట్వీట్‌..
  • కోటరీల మధ్య బందీలుగా ఉన్న నాయకులారా..
  • ఈడీ నోటీసులు అందిన కాసేపటికే ఇలాంటి పోస్ట్‌

 

Vijayasai Reddy: ఓవైపు కొనసాగుతున్న సిట్ దర్యాప్తు.. మరోవైపు ఈడీ ఎంట్రీ.. ఏపీ లిక్కర్‌ కేసులో జరుగుతున్న పరిణామాలు ఇవి. వీటిన్నింటి మధ్య ఈ కేసులో ఈడీ నోటీసులు అందుకున్న విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్‌.. ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్ అవుతోంది. చాలా రోజులుగా సైలెంట్‌గా ఉన్న ఆయన.. ఇప్పుడు అలాంటి ట్వీట్ చేయడం వైసీపీ నేతలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అసలాయన మాటలకు అంతరార్థం ఏంటి.. విజయసాయి ఎవరిని టార్గెట్‌ చేసినట్లు.. ఆయన విచారణ తర్వాత పరిణామాలు ఎవరి మెడకు చుట్టుకునే చాన్స్ ఉంది.. పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న గాసిప్ ఏంటి..

విజయసాయి రెడ్డి.. పార్టీ మారిన తర్వాత, పదవికి రాజీనామా చేసిన తర్వాత.. చాలావరకు మౌనంగానే ఉంటున్నారు. అలాంటి వ్యక్తి.. ఇప్పుడో సంచలన ట్వీట్ చేశారు. ఇది ఫ్యాన్ పార్టీని షేక్‌ చేస్తోంది. వెనెజువెలా రాజకీయ సంక్షోభాన్ని లింక్ చేస్తూ.. ఆయన చేసిన సోషల్‌ మీడియా పోస్ట్.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రజాదరణ ఉన్న నేత చుట్టూ ఉన్న వ్యవస్థలు అమ్ముడుపోతే.. అగ్రరాజ్యాలు ఎంతటి వారినైనా బందీలను చేస్తాయని విజయసాయి రాసుకొచ్చారు. అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండనే పదాలు మరింత ఆసక్తి రేపుతున్నాయ్‌. దీంతో విజయసాయి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు.. అసలు ఎవరిపై చేశారనే చర్చ నడుస్తోంది. ఐతే లిక్కర్‌ కేసులో ఈడీ నోటీసులు అందిన కాసేపటికే.. విజయసాయి రెడ్డి ఇలాంటి పోస్ట్‌ చేయడం.. మరింత ఆసక్తి రేపుతోంది.

ఫ్యూచర్‌ పరిణామాలను తన ట్వీట్‌తో చెప్పకనే చెప్పారా..

విజయసాయి ట్వీట్‌ వెనక మర్మం ఏంటనేది ఇప్పుడు పార్టీ నేతలకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. లిక్కర్ స్కామ్‌లో నోటీసులు వచ్చాయనే వార్త బయటకు రాగానే ట్వీట్ చేయడం.. అది కూడా దేశ రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని విషయంతో లింక్ చేస్తూ రాసుకురావడం.. వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది. ఫ్యూచర్‌లో జరగబోయే పరిణామాలను విజయసాయి రెడ్డి తన ట్వీట్‌తో చెప్పకనే చెప్పారా అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయ్‌. తన ట్వీట్‌తో జగన్‌కు విజయసాయి ఏదో హింట్ ఇచ్చారంటూ మరికొందరు డిస్కషన్ మొదలుపెట్టారు.

ఇక అటు ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు మీద కనిపిస్తోంది. మొదట విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన ఈడీ.. ఆ తర్వాత వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా ఇచ్చింది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే.. విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారా అనే అనుమానాలు కూడా ఫ్యాన్‌ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయ్‌.

మిథున్ రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం?

జనవరి 22న విచారణకు రావాలని.. విజయసాయికి ఈడీ నోటీసులు ఇచ్చింది. లిక్కర్‌ కేసుకు సంబంధించి తనకు తెలిసిన వివరాలు చెప్పేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఐతే తను చెప్పబోయే విషయాలతో ఎలాంటి ప్రభావం ఉండబోతుందనేది.. ట్వీట్‌తో విజయసాయి వైసీపీకి చెప్తున్నారా అనేది మరికొందరి ప్రశ్న. విజయసాయి తర్వాత రోజే.. అంటే జనవరి 23న మిథున్‌ రెడ్డిని ఈడీ విచారించనుంది. మరి విజయసాయి చెప్పబోయే.. బయటపెట్టబోయే విషయాలు మిథున్ రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం ఉందా అని.. ఈ ట్వీట్ తర్వాత రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

వైసీపీకి, రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత.. ఈ కేసుకు సంబంధించి విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం విజిల్ బ్లోయర్ మాత్రమేనని.. ఒక్క రూపాయి తీసుకోలేదని.. దొంగలను పట్టుకునేందుకు సహకరిస్తానంటూ అప్పట్లో ట్వీట్లు కూడా చేశారు. అలాంటిది ఇప్పుడు ఆయన విచారణలో ఏం చెప్తారు.. అది వైసీపీ నేతలను ఎలా టార్గెట్ చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది.

వైసీపీకి దూరమయ్యాక.. ఎన్డీయే నేతలతో సన్నిహితంగా..

వైసీపీకి రాజీనామా చేసినప్పటి నుంచి.. విజయసాయి ఎక్కువగా ఎన్డీయే నేతలతోనే సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఏదో కీలక సమాచారం వచ్చి ఉండొచ్చని.. అందుకే ఇలాంటి వార్నింగ్‌లు ఇస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. పైగా జగన్ హయాంలో జరిగిందని చెప్తున్న ఈ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు.. ఆయనకు పక్కాగా తెలుసు. దీంతో ఏదో లోతైన కోణంలోనే.. ఇలాంటి ట్వీట్ చేసిన ఉంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

ఇక భవిష్యత్‌లో ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండని విజయసాయి మాటల వెనక.. రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా పెను మార్పు రాబోతోందా.. లేదా కీలక నేతలపై కేంద్ర సంస్థలు మరిన్ని కఠిన చర్యలు తీసుకోబోతున్నాయా అనే చర్చ కూడా నడుస్తోంది. ఏమైనా.. ఒక్క ట్వీట్‌.. ఏపీ రాజకీయాల్లో పుట్టిస్తున్న హీట్ అంతా ఇంతా కాదు.

Also Read: మళ్లీ ప్రతిపక్షంలోకి రావడానికి మేము సిద్ధంగాలేము.. ఏపీలోనూ ఇక గుజరాత్‌లాగే..: చంద్రబాబు