Gossip Garage : ఈసారి బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ పక్కానా? ఆ కీలకమైన పోస్ట్ ఆమెకేనా?

ఈ ఏడాది మహానాడుని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది టీడీపీ. మహానాడులో పార్టీలో కీలక మార్పుల గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Gossip Garage : ఈసారి బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ పక్కానా? ఆ కీలకమైన పోస్ట్ ఆమెకేనా?

Updated On : February 1, 2025 / 1:27 AM IST

Gossip Garage : ఆ పార్టీలో అధ్యక్షుడి తర్వాత అంత పెద్ద పోస్ట్. చిన్నబాబు ఆ పదవిని వేరే వాళ్లకు ఇద్దామన్న ఆలోచనలో ఉన్నారు. దీంతో నెక్స్ట్‌ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ స్టార్ట్ అయింది. కొందరు నందమూరి నటసింహం పేరును తెరమీదకు తెస్తుంటే.. మరికొందరు నారా వారి కోడలి పేరును ప్రస్తావిస్తున్నారు. ఇంతకీ లోకేశ్‌ తర్వాత ఆ పోస్ట్‌లో కూర్చునేదెవరు? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమించబోతున్నారు?

ప్రాంతీయ పార్టీగా ఏర్పడి..ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని జాతీయ పార్టీగా పేరు తెచ్చుకుంది టీడీపీ. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. అయితే లోకేశ్‌ ఈ మధ్యే ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్‌ ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తోంది.

కీల‌క‌మైన ఆ ప‌ద‌విని ఎవ‌రికి అప్పగిస్తార‌ు?
ఒక పోస్ట్‌లో ఒక వ్యక్తి మూడు సార్లు ఉండొద్దనేది తన అభిప్రాయమన్న లోకేశ్‌..టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్‌ను మరొక నేతకు ఇస్తామని చెప్పారు. 10 సంవ‌త్సరాల‌కు పైగా పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శిగా కొనసాగుతోన్న ఆయ‌న తన స్థానానికి రాజీనామా చేస్తే.. కీల‌క‌మైన ఈ ప‌ద‌విని ఎవ‌రికి అప్పగిస్తార‌న్న చ‌ర్చ ఉంది. దీనిపై అటు టీడీపీలో..ఇటు ఏపీ పాలిటిక్స్‌లో సరికొత్త హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది.

Also Read : విజయనగరం డీసీసీబీ పీఠంపై తెలుగు తమ్ముళ్ల ఎత్తులు.. తమకు అనుకూలంగా ఉండే నేతకు పదవి దక్కేలా లాబీయింగ్..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్‌ను ఎవరికి ఇస్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఆ పదవి ఇస్తారన్న ఓ టాక్ నడుస్తోంది. బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి నెగ్గారు. ఈసారి ఆయనకు క్యాబినెట్‌లో కూడా బెర్త్ దక్కుతుందని అనుకున్నారు. కానీ అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు సీనియర్ నేతలకు, సామాజికవర్గం పరంగా మంత్రివర్గంలో చోటు కల్పించడంతో..బాలయ్యను మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశం లేదంటున్నారు.

ఆయన సేవలను తెలుగు స్టేట్స్‌లో వాడుకోవాలనే ఉద్దేశ్యం..
అలాంటప్పుడు ఆయన సేవలను పార్టీ పటిష్టత కోసం వాడుకోవాలని భావిస్తున్నారట చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే బాలయ్యను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్‌గా, ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణను నేషనల్ జనరల్ సెక్రటరీగా చేసి పార్టీలో మరింత కీలకం చేస్తారని అంటున్నారు. బాలయ్య సినీ గ్లామర్ బాగా పెరిగిన నేపథ్యంలో ఆయన సేవలను రెండు తెలుగు స్టేట్స్‌లో వాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం ఉంటుందట.

రాయలసీమలో పార్టీ పటిష్టం చేయడం, తెలంగాణలో పూర్వ వైభవం తేవడం..
టీడీపీలో ఇప్పటిదాకా ముఖ్యపాత్రను పోషిస్తూ వస్తున్నారు బాలయ్య. 1984 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వస్తున్న బాలకృష్ణ..పార్టీకి విధేయుడిగా ఉంటున్నారు. పదవుల విషయంలోనూ ఆయన ఏ రోజూ పట్టుబట్టింది లేదంటున్నారు నేతలు. తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నారని గుర్తు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే బాలయ్యకు పార్టీలో బరువైన బాధ్యతలు అప్పగించడం ద్వారా రాయలసీమ రీజియన్‌లో టీడీపీని మరింతగా పటిష్టం చేయాలని భావిస్తున్నారట. అలాగే బాలయ్య ద్వారా తెలంగాణలో కూడా టీడీపీకి పూర్వవైభవం తీసురావాలని ప్లాన్ చేస్తున్నారట.

రేసులోకి నారా బ్రాహ్మణి పేరు..
ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేశ్‌ తప్పుకుంటే..ఆయనను టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తారన్నది కూడా ప్రచారంలో ఉన్న మాట. అయితే పార్టీలో అత్యంత కీల‌క‌మైన, నెంబర్‌ 2 పోస్ట్‌గా చెప్పుకునే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్‌ను వేరే వారికి అప్పగించే అవ‌కాశం లేదట. ఈ నేప‌థ్యంలో కొందరు టీడీపీ నేతలు నారా బ్రాహ్మణి పేరును జాతీయ ప్రధాన కార్యద‌ర్శి రేసులోకి తెస్తున్నారు.

ఈసారి నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ పక్కా..!
గతంలోనూ చాలాసార్లు బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరిగింది. విజయవాడ ఎంపీగా కూడా ఆమె పోటీ చేస్తారని టాక్ వినిపించింది. చంద్రబాబు అరెస్ట్‌ సమయంలో కూడా బ్రాహ్మణికి పార్టీ పగ్గాలు అప్పగిస్తార్న చర్చ నడిచింది. కానీ ఆమె అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పుడు మాత్రం ఆమె పొలిటికల్ ఎంట్రీ పక్కా అంటున్నారు కొందరు తెలుగు తమ్ముళ్లు.

టీడీపీ ఫ్యూచర్‌ లీడర్‌గా ఎస్టాబ్లిష్‌ అవుతున్న లోకేశ్‌కు అండగా నిలిచేందుకు..పార్టీలో ఆయన సమానంగా బాధ్యతలను పంచుకునేందుకు బ్రాహ్మణి అయితేనే సరైన ఆప్షన్ అనేది కొందరి నేతల అభిప్రాయమట. బ్రాహ్మణిని జాతీయ ప్రధాన కార్యదర్శి నియమిస్తే మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు ఉండ‌డంతో పాటు..విద్యావంతుల‌ను కూడా పార్టీవైపు ఆక‌ర్షించే అవ‌కాశం ఉంటుంద‌ని లెక్కలు వేసుకుంటున్నారట.

Also Read : మారిన వైసీపీ వ్యూహం.. బడ్జెట్ సెషన్‌కు జగన్?

గ‌తేడాది ఎన్నిక‌ల‌కు ముందు ఆమె పార్టీకి చేసిన సేవ‌ల‌ను గ‌మ‌నిస్తే..జాతీయ ప్రధాన కార్యద‌ర్శి పోస్టుకు అన్ని విధాలా అర్హురాలేన‌న్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయట. అలా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్‌తోనే ఉంటుందని కొందరు నేతలు అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది మహానాడుని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది టీడీపీ. మహానాడులో పార్టీలో కీలక మార్పుల గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పూర్తిస్తాయిలో మార్పులు చేర్పులు ఉంటాయని.. పొలిట్‌ బ్యూరోలో కూడా కొత్త ముఖాలు కనిపించబోతున్నామని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నియామకం కూడా జరుగుతుందట. మహానాడులోనే పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఎవరో ప్రకటిస్తారని అని అంటున్నారు. బాలయ్యకు ఇస్తారా..లేక బ్రాహ్మణిని ఆ పదవిలో కూర్చోబెడుతారా..మరెవరైనా నేతకు అవకాశం కల్పిస్తారా అన్నది చూడాలి మరి.