గుంతకల్ టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి.. భారీ ర్యాలీతో నిరసన

గుమ్మనూరు జయరాంకు వ్యతిరేకంగా గుత్తి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. జయరాం మాకొద్దు, జితేంద్ర గౌడ్ ముద్దు అంటూ నినాదాలు చేశారు.

గుంతకల్ టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి.. భారీ ర్యాలీతో నిరసన

Guntakal tdp leaders protest against gummanur jayaram

Guntakal tdp leaders protest: అనంతపురం జిల్లా గుంతకల్ టీడీపీలో అసమ్మతి రేగింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం రాకను గుంతకల్ టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గుంతకల్ నుంచి టీడీపీగా అభ్యర్థిగా పోటీ చేస్తానని, ఈ మేరకు చంద్రబాబు నాయుడు తనకు హామీయిచ్చారని గుమ్మనూరు జయరాం ప్రకటించడంతో స్థానిక నేతలు మండిపడుతున్నారు. గుంతకల్ నియోజకవ్యాప్తంగా టీడీపీ అసమ్మతి నేతలు రోడ్డెక్కారు.

గుమ్మనూరు జయరాంకు వ్యతిరేకంగా గుత్తి పట్టణంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి రాజీవ్ సర్కిల్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. గుమ్మనూరు జయరాం మాకొద్దు, జితేంద్ర గౌడ్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. గుమ్మనూరు జయరాం తమ పార్టీలో చేరడం సంతోషమే కానీ గుంతకల్ నుండి పోటీ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా మన్నారు. గుమ్మనూరు జయరాం గుంతకల్ నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఓడించి తీరుతామని వారు అంటున్నారు. ఈనెల 11న గుంతకల్‌లో జరిగే శంఖారావం సభలోపు టీడీపీ అభ్యర్థిగా జితేంద్ర గౌడ్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. జితేంద్ర గౌడ్‌ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించకపోతే సభను బహిష్కరిస్తామని తెలిపారు. మరోవైపు గుంతకల్ టికెట్ తనకే ఇవ్వాలని జితేంద్ర గౌడ్ కూడా గట్టిగానే పట్టుబడుతున్నారు.

కాగా, గుమ్మనూరు జయరాం కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించాలని సీఎం జగన్ నిర్ణయించడంతో ఆయన వైసీపీ పార్టీని వీడారు. చంద్రబాబు తనకు గుంతకల్ టికెట్ ఇస్తానని హామీయిచ్చినట్టు ఆయన చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఎక్కడ అవకాశం ఇచ్చినా పోటీ చేస్తానని అంతకుముందు చెప్పారు.

Also Read: కాపు ఓట్ల కోసం వైసీపీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ అడుగులు.. ఎవరి వ్యూహం ఫలిస్తుందో..!