Janasena Razole : కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న ఆ నియోజకవర్గాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు పట్టించుకోవడం లేదు?

లీడర్ లేకపోయినా పార్టీ ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు జనసైనికులు. ఇప్పటికీ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో .. Janasena Razole Politics

Janasena Razole : కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న ఆ నియోజకవర్గాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు పట్టించుకోవడం లేదు?

Janasena Razole Politics

Updated On : September 8, 2023 / 11:41 PM IST

Janasena Razole Politics : ఏపీలో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలు. అలా గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కూడా పార్టీని వదిలేశారు. అలా ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించినా క్యాడర్ గట్టిగా నిలబడి పార్టీని బతికించింది. కానీ, జనసేన అగ్రనాయకత్వం కీలక నియోజకవర్గానికి ఇంఛార్జి నియామకంపై కాలయాపన చేస్తోంది. ఎన్నికలు ముంచుకొస్తున్నా ఇంఛార్జి ఎవరో తేల్చకపోవడంపై కార్యకర్తల్లో గుబులు రేగుతోంది. ఈ పరిస్థితుల్లో చుక్కాని లేని నావలా తమ పరిస్థితి తయారైందని, నడి సంద్రంలో వదిలేస్తే కొట్టుకుపోవడమే తప్ప కాపాడే పరిస్థితి లేదని గగ్గోలు పెడుతున్నారు జనసైనికులు. ఇంతకీ రాజోలు జసనసేలో ఏం జరుగుతోంది?

రాష్ట్రం మొత్తం ఒక లెక్క అయితే రాజోలు మరో లెక్క. గత ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా తుడుచుపెట్టుకుపోయినా.. రాజోలు మాత్రం ఘన విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రాజోలులో సత్తా చాటింది జనసేన. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎన్నాళ్లో పార్టీలో కొనసాగలేదు. 152వ నెంబర్ ఎమ్మెల్యేగా ఉండటం ఇష్టం లేదు. నేను నెంబర్ 1 ఎమ్మెల్యేనంటూ మొదట్లో గొప్పలు చెప్పుకున్న రాపాక ఆ తర్వాత 152నే ఇష్టపడ్డారు.(Janasena Razole)

Also Read..Gudivada: కొడాలి నానిని ఓడించాలంటే సరైనోడు ఉండాల్సిందే.. టీడీపీ టిక్కెట్ ఎవరికి!

ఎమ్మెల్యేని కట్టడి చేయలేని జనసేన నాయకత్వం ఆ తర్వాత నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు. కానీ, జనసైనికులు మాత్రం లీడర్ లేకపోయినా పార్టీ ఉనికిని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పటికీ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో రాజోలు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

కేడర్ పటిష్టంగా ఉన్నా నియోజకవర్గ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవడం లేదు జనసేన అగ్రనాయకత్వం. ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్లిపోయినా అధికార పార్టీతో బలంగా పోరాడుతున్నారు రాజోలు కార్యకర్తలు. ఎమ్మెల్యే రాపాకతో నువ్వా? నేనా? అన్న రేంజ్ లో ఫైట్ చేస్తున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ తొలి విడత వారాహి యాత్రను దిగ్విజయం చేశారు. ఎమ్మెల్యే రాపాక పార్టీ ఫిరాయించిన తర్వాత నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కు ఎవరూ లేకపోయినా కార్యకర్తలే అన్నీ తామై నడిపించారు. ఇప్పటికీ నడిపిస్తున్నారు.(Janasena Razole)

అయితే, ఎన్నికలకు సమయం సమీపిస్తున్నా ఇంఛార్జిగా ఎవరినీ నియమించకపోవడంపై కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో 6 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఎవరో ఒకరికి ఇంఛార్జి బాధ్యతలు అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచే చాన్స్ ఉందని చెబుతున్నారు జనసైనికులు.

Also Read..Lagadapati Rajagopal : మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి రాజగోపాల్‌? ఏ పార్టీలో చేరతారు? ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?

తొలి విడత వారాహి యాత్రలో తూర్పుగోదావరి జిల్లాలో మూడు నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించారు జనసేనాని పవన్. కానీ, రాజోలులో మాత్రం ఎవరికీ బాధ్యత అప్పగింలేదు. వారాహి యాత్ర సమయానికి రాజోలు ఇంఛార్జి పదవి కోసం నలుగురు నేతలు పోటీపడితే ఇప్పుడు వారి సంఖ్య మరింత పెరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇంఛార్జి పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతూ ఉండటంతో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని భయపడుతున్నారు జనసైనికులు.(Janasena Razole)

ప్రస్తుత ఇంఛార్జి పదవి కోసం గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, డాక్టర్ రాపాక రమేశ్ బాబు, బొంతు రాజేశ్వరరావు, జనవాణి కార్యక్రమాల కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ పోటీ పడుతున్నారు. వీరిలో బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో అమలాపురం ఎంపీ జసేనన అభ్యర్థిగా వీఎంఆర్ శేఖర్ పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటే ఎంపీగా పోటీ చేసే అవకాశం రాదని రాజోలు కోసం పట్టుబడుతున్నారు శేఖర్. ఇలా ఐదుగురు నేతలు పోటీపడుతున్నా ఎవరికీ ఏ బాధ్యత అప్పగించకుండా వాయిదా వేస్తోంది జనసేన అగ్రనాయకత్వం. కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గంపై ఇప్పటికైనా జనసేనాని పవన్ దృష్టి పెట్టాల్సి ఉందంటున్నారు జనసైనికులు.