ఏపీలో దంచికొడుతున్న వానలు

ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. అంతేకాదు ఎగువప్రాంతాల్లో కూడా జోరుగా వానలు పడుతుండటంతో కృష్ణా నదికి మరోసారి వరద ఉధృతి పెరిగింది. ఇప్పటికే తుంగభద్ర జలాశయం గేట్లను ఎత్తివేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక కొన్ని చోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాయలసీమలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాను అనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రేపు, ఎల్లుండి కూడా కోస్తా, ఉత్తారాంద్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
శ్రీకాకుళం జిల్లాని కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నాగావళి నదికి వరద ఉధృతి పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేగిడి మండల కేంద్రంలోని పలు గ్రామాలు జలదిగ్భంలో చిక్కుకున్నాయి. మరోవైపు గొట్టా బ్యారేజీకి వరద పోటు కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 83వేల 134 క్కూసెక్కులు, ఔట్ ఫ్లో 74వేల 12 క్యూసెక్కులుగా నమోదైంది.
ఇక తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు రాజుపాలెం గ్రామాన్ని ముంచెత్తింది. ఇళ్లలోకి కూడా నీరు చేరింది. గ్రామంలో ఎక్కడ చూసినా వరదనీరే కనిపిస్తుండటంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకురాలేక ఇబ్బందులు పడుతున్నారు.