గృహ హింస బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం హెల్స్ లైన్

Helpline Victims Domestic Violence Ap 31840
కరోనా వైరస్ కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధించటంతో అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఈ టైమ్ లో క్రైం రేటు తగ్గినా… గృహ హింస కేసులు పెరుగుతున్నాయి. దీర్ఘకాల లాక్ డౌన్ నేపధ్యంలో గృహ హింసను ఎదుర్కొంటున్న మహిళలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ బాసటగా నిలుస్తోంది. వారికి పూర్తి రక్షణను కల్పించే క్రమంలో పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటికే పని చేస్తున్న దిశ వన్ స్టాప్ కేంద్రాలలో 24గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. గృహ హింసకు గురవుతున్న మహిళలకు ఇక్కడ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. బాధితులకు ఆరోగ్య, వైద్య, మానసిక, సాంఘిక, న్యాయ సహాయాలు నిపుణుల ద్వారా ఒకే చోట అందించేలా మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంది. మరోవైపు 24 గంటలు ఉచిత న్యాయ, వైద్య, పోలీస్ సంరక్షణతో పాటు అత్యవసర వసతి కూడా ఇక్కడ అందించబడుతుంది.
వన్ స్టాప్ సెంటర్స్ కు వైద్య శాఖ, పోలీసు శాఖ ప్రత్యక్ష సహాయ సహకారాలను అందిస్తుండగా రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ విభిన్న శాఖల మధ్య సమన్వయ బాధ్యతలను సైతం పర్యవేక్షిస్తుందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు, దిశ ప్రత్యేక అధికారి డాక్టర్ కృతికా శుక్లా చెప్పారు.
ఈ వన్ స్టాప్ సెంటర్లలో లభించే అన్ని సేవలు ఉచితమేనని, ఈ కేంద్రాలలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో గల 23 స్వధార్ గృహములలో సైతం బాధిత మహిళలకు వసతి, రక్షణ ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. మహిళా భద్రత పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారని, ఏ ఒక్కరూ గృహ హింసకు లోను కారాదని సూచించారని తెలిపారు.
ఉచిత మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 181 కూడా బాధితుల సహాయార్ధం 24 గంటలు పనిచేస్తుందని కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో తక్షణ సహాయం కోసం మహిళలు సంబంధిత జిల్లా అధికారులను సంప్రదించాలని ఆమె కోరారు.
శ్రీకాకుళం – 9110793708
విజయనగరం – 8501914624
విశాఖపట్నం – 6281641040
తూర్పు గోదావరి – 9603231497
పశ్చిమ గోదావరి – 9701811846
కృష్ణ – 9100079676
గుంటూరు – 9963190234
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు – 9848653821
చిత్తూరు – 9959776697
కర్నూలు – 9701052497
అనంతపురము – 8008053408
నెంబర్లలో రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ జిల్లా స్ధాయి అధికారులు అందుబాటులో ఉంటారని, బాధితులు ఎటువంటి సహాకారం కావాలన్నా ఈ నెంబర్లకు ఆయా జిల్లాల పరిధిలోని వారు ఫోన్ చేయవచ్చని డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు.