Narasaraopet : టీడీపీ నేత ఇంటిపై రాళ్ల దాడి.. నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత, భారీగా పోలీసులు మోహరింపు

Narasaraopet : టీడీపీ అధికార ప్రతినిధి ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఫర్నీచర్ ధ్వంసం చేసి కిటికీలు పగలగొట్టారు.

Narasaraopet : టీడీపీ నేత ఇంటిపై రాళ్ల దాడి.. నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత, భారీగా పోలీసులు మోహరింపు

Narasaraopet TDP YSRCP Clash

Updated On : July 16, 2023 / 11:37 PM IST

Narasaraopet High Tension : పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో టీడీపీ నేత కడియాల రమేశ్, అరవింద్ బాబు కార్లు ధ్వంసం అయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టాయి.

మరోవైపు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఫర్నీచర్ ధ్వంసం చేసి కిటికీలు పగలగొట్టారు. నిన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై చల్లా సుబ్బారావు అవినీతి ఆరోపణలు చేశారు. కోటప్పకొండ రోడ్డులో ఇంటిని సుబ్బారావు ఆక్రమించాడని వైసీపీ వర్గీయులు ఆరోపించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి.

Also Read..YCP: వైసీపీలో వారసుల సందడి.. తలలు పట్టుకుంటున్న వైసీపీ పెద్దలు..!

వైసీపీ శ్రేణుల దాడిలో టీడీపీ నేత అరవింద్ బాబు డ్రైవర్ కు గాయాలయ్యాయి. దీంతో సుబ్బారావు ఇంటి సమీపంలోకి టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రెండువర్గాల మధ్య ఘర్షణతో కోటప్పకొండ రోడ్డు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రతీ వీధిలో గస్తీ కాస్తున్నారు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘర్షణపై నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా స్పందించారు. టీడీపీ నేత ఓ ఇంటిని ఆక్రమించుకోవడంతో పాటు వారిపై దాడి చేశారని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం సృష్టించి అధికారంలోకి రావాలని టీడీపీ అనుకుంటోందని ఆయన అన్నారు.

అందరి సంగతి తేలుస్తాం- ఎమ్మెల్యే గోపిరెడ్డి వార్నింగ్
”జడా భార్గవ్ అనే వ్యక్తికి చెందిన ఇంటికి అక్రమంగా డాక్యుమెంట్స్ సృష్టించి టీడీపీ ప్రధాన కార్యదర్శి చల్లా సుబ్బారావు కబ్జా చేయడానికి ప్రయత్నించాడు. రూ.2లక్షలు ఇవ్వాల్సిన క్రమంలో 50వేలు, వడ్డీ ఇచ్చిన క్రమంలో మిగిలిన డబ్బును కూడా వెంటనే ఇవ్వాలని ఇంటిని ఆక్రమించాడు.
రూ.75లక్షలకు ఇంటిని కొన్నట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి చల్లా సుబ్బారావు ఆ ఇంటిని ఆక్రమించాడు.

ఇంట్లో ఉన్నవారిపై దాడి చేసి ఇంటి నుంచి గెంటేశారు. ఓ పార్టీ ఇంచార్జ్ గా ఉన్న అరవింద్ బాబు.. ఇలా ఇంట్లోకి దూరి కర్రలతో దాడి చేయడం అమానుషం. రౌడీ షీటర్ అయిన చల్లా సుబ్బారావుకి మద్దతిస్తూ అక్రమంగా ఇంటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం సరైన పద్ధతి కాదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరాం.

Also Read..Pilli Subhash Chandra Bose: పిల్లి సుభాశ్‌చంద్రబోస్ వైఖరిలో మార్పు ఎందుకొచ్చింది.. అసంతృప్తిగా ఉన్నారా?

టీడీపీ గొడవలు సృష్టించి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు మేము ఎవరినీ హింసించ లేదు. ఈ నాలుగేళ్ల కాలంలో ఎవరినీ ఇబ్బందులకు గురిచేసింది లేదు. కానీ, ఇక మేము కూడా రోడ్లపైకి రావాల్సిన సమయం వచ్చింది. టీడీపీ ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తోంది. ఎంత దూరం వెళ్ళడానికైనా మేము సిద్ధం. అన్యాయంగా ఆక్రమించే వారందరి సంగతి తేలుస్తాం” అని ఎమ్మెల్యే గోపిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.