Nara Lokesh: మాటలో వాడి.. నడకలో స్పీడు.. పాదయాత్రతో రాటుదేలిన లోకేశ్

తనపై విమర్శలకు.. ట్రోల్స్‌కు ఎప్పుడూ స్పందించని లోకేశ్.. ఆ విమర్శలు.. ట్రోల్స్ వాటంతటి అవే నిలిచిపోయేలా తన నడవడికతోనూ.. నడకతోనూ యువగళంలో సమాధానం చెప్పారు.

Nara Lokesh: మాటలో వాడి.. నడకలో స్పీడు.. పాదయాత్రతో రాటుదేలిన లోకేశ్

how nara lokesh transformed with yuvagalam padayatra

Updated On : December 20, 2023 / 12:28 PM IST

Nara Lokesh Yuvagalam: తడబడుతూ మాట్లాడటం.. పదాల కోసం వెతుక్కోవడం.. భారీ జన సందోహం మధ్య చెప్పాలనుకున్నది సరిగా చెప్పలేకపోవడం.. అధికార వైసీపీ ట్రోలింగ్‌లకు దొరికిపోవడం.. ఇది యువగళం పాదయాత్ర మొదలవ్వకముందు టీడీపీ ప్రధాన కార్యదర్శ లోకేశ్ పరిస్థితి… కానీ, యువగళం పూర్తయ్యేసరికి లోకేశ్ మాటలో.. నడవడికలో.. జనాన్ని ఆకట్టుకోవడంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా.. అనర్గళంగా.. కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పేస్తున్నారు లోకేశ్.. యువగళం కొత్త లోకేశ్‌ను టీడీపీ శ్రేణులకు పరిచయం చేసింది. ఇటు టీడీపీ సీనియర్ నాయకులు కూడా లోకేశ్‌ను తమ భావి నాయకుడిగా భావించేలా చేసింది.

యువగళం ప్రారంభంలో కుప్పం నియోజకవర్గంలో లోకేశ్ మాట్లాడిన మాటలివి.. నోట్సు చదువుతూ ప్రసంగించడం.. ఆ సభలో ఉన్నవారికి సంబంధంలేని సమస్యలు ప్రస్తావించడంతో లోకేశ్ స్పీచ్ బోర్ కొట్టేది. జనం నుంచి కూడా పెద్దగా స్పందన కనిపించేది కాదు.. కానీ, యువగళం యాత్ర ముగింపు వచ్చేసరికి సానబెట్టిన వజ్రంలా.. పదునెక్కిన కత్తిలా తయారయ్యారు లోకేశ్.

పంచ్ డైలాగ్‌లు.. ప్రత్యర్థులపై ధాటైన విమర్శలు..
ఈ మాటల్లో కొత్త లోకేశ్‌ను చూడొచ్చు. తన ప్రసంగాల్లో పంచ్ డైలాగ్‌లు.. ప్రత్యర్థులపై ధాటైన విమర్శలు.. పూర్తి అవగాహనతో వివరణాత్మకంగా.. ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడుతూ సరికొత్తగా కనిపిస్తున్నారు లోకేశ్. మంత్రిగా, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఎప్పుడూ ఇంత వాగ్దాటితో మాట్లాడలేదు లోకేశ్. ఇంకా చెప్పాలంటే తన మాటలతో చాలా రకాల ట్రోల్స్‌కు కంటెంట్‌గా మారేవారు లోకేశ్. ఓ సందర్భంలో దేశంలో రాహుల్ గాంధీ తర్వాత తానే ఎక్కువ ట్రోల్ అవుతున్నట్లు స్వయంగా అంగీకరించారు ఆయన. కానీ, ఇప్పుడు.. సుదీర్ఘ పాదయాత్ర తర్వాత లోకేశ్‌ను తరచిచూస్తే ఎంతో మార్పు కనిపిస్తోంది.. మాటలో వాడి పెరిగింది. నడకలో స్పీడు పెరిగింది. నేనున్నా.. అంటూ కార్యకర్తలకు భరోసాగా నిలుస్తున్నారు లోకేశ్. ఇక పెద్దపెద్ద నాయకులు కూడా లోకేశ్ తమ నియోజకవర్గంలో పర్యటించేలా ఒత్తిడి చేసి రూట్‌మ్యాప్ మార్చి.. యువగళం పాదయాత్రను ఆహ్వానించారంటే.. లోకేశ్‌లో వచ్చిన మార్పే కారణమంటున్నారు పరిశీలకులు.

Nara Lokesh Yuvagalam Yatra

Nara Lokesh Yuvagalam Yatra

అడుగు దూరంలోనే ఆగిపోయినా..
400 రోజులు.. 4 వేల కిలోమీటర్లు.. వంద నియోజకవర్గాల్లో పాదయాత్ర అనే లక్ష్యంతో జనవరి 27న పాదయాత్ర మొదలుపెట్టిన లోకేశ్.. వంద నియోజకవర్గాల్లో పర్యటించకపోయినా.. నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయలేకపోయినా.. నాలుగు వందల రోజులు నడవకపోయినా.. తన లక్ష్యాన్ని మాత్రం చేరుకున్నారని నిస్సంకోచంగా చెప్పొచ్చు. ఎందుకంటే.. మధ్యలో చంద్రబాబు అరెస్టుతో దాదాపు రెండు నెలల పాటు పాదయాత్ర నిలిచిపోయినా.. 226 రోజుల్లో మూడు వేల 132 కిలోమీటర్లు తిరగడమే కాకుండా.. 97 నియోజకవర్గాలను చుట్టేశారు లోకేశ్. అంటే వంద నియోజకవర్గాల్లో పర్యటించాలనే తన లక్ష్యానికి అడుగు దూరంలోనే ఆగిపోయినా.. మొత్తం పాదయాత్ర సక్సెస్‌పుల్‌గా కంప్లీట్ చేశారు.

Also Read: నాకు కాకపోతే వారిద్దరికిస్తారా?.. నగరిలో పోటీపై మంత్రి రోజా ఆక్తికర వ్యాఖ్యలు

పాదయాత్ర ఆరంభంలో తడబడినట్లు కనిపించినా.. ఫైనల్‌కి వచ్చేసరికి రాటుదేలిన నాయకుడిగా మారడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. చిత్తూరులో యాత్ర ప్రారంభ సమయంలో ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నారు లోకేశ్.. జీవో నెంబర్ 1తో పాదయాత్రకు అడుగడుగునా నిబంధనలు ఆటంకంగా మారేవి. కొన్నిచోట్ల మైకు లేకుండా మాట్లాడాల్సివచ్చేది. చిన్న స్టూల్‌నే స్టేజ్‌గా చేసుకుని ప్రజలందరి మధ్యలో నిలబడి.. ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ తనలో మొండోడిని ఆవిష్కరించారు లోకేశ్. తొలి వారంలోనే తనను తాను సమీక్షించుకున్న లోకేశ్.. పాదయాత్ర అసాంతం మారుతూ.. మార్పును ఆహ్వానిస్తూ ముందుకు సాగిపోయారు.

Nara Lokesh Padayatra

Nara Lokesh Padayatra

నడవడికతోనూ.. నడకతోనూ సమాధానం
చంద్రబాబు కుమారుడిగా పార్టీలోకి వచ్చిన లోకేశ్‌కు పాదయాత్ర ముందు పార్టీపై పెద్దగా పట్టు ఉండేది కాదు. ఆయన చుట్టూ కొందరు కోటరీగా ఏర్పడి.. పార్టీ క్యాడర్‌కు లోకేశ్‌కు మధ్య పెద్ద అగాధమే ఏర్పరిచారు. మరోవైపు ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకపోయినా మంత్రిగా బాధ్యతలు చేపట్టడం.. అప్పటికీ ప్రజల్లో పెద్దగా తిరగకపోవడంతో.. మంత్రి పదవిని ఓ ఉద్యోగంలా చేశారనే విమర్శలు ఎదుర్కొన్నారు లోకేశ్. రాజకీయ నాయకుడిగా.. ఓ పార్టీకి భావి సారథిగా ఉన్నాననే విషయాన్ని పెద్దగా పట్టించుకోని లోకేశ్.. తానో బ్యూరోక్రట్‌లా వ్యవహరించేవారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం బీమా పాలసీని రూపొందించి.. కార్యకర్తలకు భరోసా కల్పించినా.. అవేవీ కార్యకర్తలకు లోకేశ్‌ను చేరువ చేయలేకపోయాయి. కేవలం చంద్రబాబు ఇమేజ్ ముందు లోకేశ్ ఎక్కడా కనిపించేవారు కాదు. పైగా.. ట్రోల్స్‌తో ఈయనకు రాజకీయం అచ్చిరాదేమో అనే సందేహాలు ఉండేవి. అధికారం పోయి విపక్షంలోకి వచ్చాక కూడా లోకేశ్‌పై ఇంటా.. బయటా ఇదే అభిప్రాయం ఉండేది. కానీ, తనపై విమర్శలకు.. ట్రోల్స్‌కు ఎప్పుడూ స్పందించని లోకేశ్.. ఆ విమర్శలు.. ట్రోల్స్ వాటంతటి అవే నిలిచిపోయేలా తన నడవడికతోనూ.. నడకతోనూ యువగళంలో సమాధానం చెప్పారు.

ప్రత్యర్థులపై నిప్పులు
చిత్తూరు టూ విశాఖపట్నం పాదయాత్రతో లోకేశ్‌పై ట్రోల్స్ దాదాపు నిలిచిపోయాయి. ఇక ఆయన శక్తిసామర్థ్యాలపై గతంలో ఉండే అనుమానాలన్నీ పటా పంచలయ్యాయి. లోకేశ్‌పై రాజకీయ విమర్శలకు ప్రత్యర్థులు పదాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేసమయంలో ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతూ వాక్పటిమను పెంచుకున్నారు లోకేశ్. అంతేకాదు సక్సెస్‌పుల్‌గా యువగళం నడపడంలో ఎంతో శ్రమించారు లోకేశ్. ఆయన పాదయాత్రను అడ్డుకోవాలని ప్రారంభంలో జరిగిన ప్రయత్నాలు.. చివరికి వచ్చేసరికి ఆయన సభలకు జనం రాకుండా అడ్డుకోలేని స్థితికి చేర్చుకోవడం విశేషంగా చెబుతున్నారు పరిశీలకులు.

Also Read: వైసీపీలో భారీ మార్పులు.. రాయలసీమ, కోనసీమ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు

పాదయాత్రతో పార్టీలో కార్యకర్తలు.. ముఖ్యంగా క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తిగా అవగాహన పెంచుకున్న లోకేశ్.. తన కోటరీని దాటి పార్టీకి ఏం కావాలో.. ఏం చేయాలో తెలుసుకున్నారు. ఇక చంద్రబాబు అరెస్టుతో లోకేశ్ పోరాట పటిమ.. నాయకత్వం వెలుగుచూసింది. పార్టీ క్యాడర్ సంయమనం కోల్పోకుండా అదుపు చేయడంతోపాటు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో కార్యకర్తలను, నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడం.. మరోవైపు క్లిష్ట సమస్యను అధిగమించే వ్యూహాలను అమలు చేయడం చూసిన వారంతా లోకేశ్‌ను తమ భవిష్యత్ లీడర్‌గా అంగీకరించాల్సివచ్చింది.

రాయలసీమలో రికార్డు
రాష్ట్రంలో 11 ఉమ్మడి జిల్లాల్లో పాదయాత్ర చేసిన లోకేశ్ తన టార్గెట్‌కు చేరవయ్యారనే చెబుతున్నారు. రాష్ట్రంలో గతంలో చాలామంది నేతలు పాదయాత్రలు చేసినా.. అందరిలో లోకేశ్ పాదయాత్ర కాస్త డిఫరెంట్‌గానే సాగింది. పరుగులాంటి నడకతో ఎక్కడా అలుపు సొలుపు లేకుండా ముందుకు సాగిన లోకేశ్ పార్టీకి పెద్దగా పట్టులేకపోయిన రాయలసీమ జిల్లాల్లో 44 నియోజకవర్గాల్లో ప్రతిపల్లెలోనూ తిరగడం ఓ రికార్డుగానే చెప్పాలి. సుమారు 15 వందల కిలోమీటర్ల మేర రాయలసీమలో పర్యటించిన లోకేశ్.. సీమలో ఓ రికార్డు సృష్టించారు. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో యువగళం పాదయాత్రకు అనూహ్య స్పందన లభించడంతో అంతవరకు లైట్‌గా తీసుకున్న అధికార పార్టీ కూడా అలర్ట్ అయింది.