Pawan Kalyan : మీ నమ్మకాన్ని సరైన వ్యక్తుల దగ్గర పెట్టడం లేదు- మత్స్యకారులతో పవన్ కల్యాణ్
Pawan Kalyan : ఈ అభివృద్ధి వెనక విధ్వంసం ఉందన్నారు. మీకు ఉపాధి అవకాశాల కోసం సంపూర్ణంగా కృషి చేస్తా.

Pawan Kalyan (Photo : Twitter)
Pawan Kalyan – Fishermen : మత్స్యకారులు వారి నమ్మకాన్ని సరైన వ్యక్తుల దగ్గర పెట్టడం లేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నేను చాలా కమిట్ మెంట్ తో పార్టీని స్థాపించాను అని పవన్ అన్నారు. మత్స్యకారులది వృత్తి ఆధారిత ప్రాంతం అన్న పవన్.. చమురు సంస్థలు, కెమికల్ ఫ్యాక్టరీలకు సముద్ర తీర ప్రాంతం అనువుగా మారిందన్నారు. ఈ అభివృద్ధి వెనక విధ్వంసం ఉందన్నారు. వ్యవసాయంతో పాటు మత్స్యకారులు కూడా రైతులే అని స్పష్టం చేశారు. కాకినాడ ఏటిమొగలో మత్యకారులతో ఆత్మీయ సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
”మత్స్యకారులలోనే గ్రూపులుగా మారిపోయారు. మీ ముఖ్యమంత్రి చెప్పిన దివిస్ ని సముద్రంలో కలిపేస్తా అన్నారు. ఆ మాటలు ఎవరు చెప్పినా నమ్మొద్దు. మీ సమస్యలను తీర్చే విధంగా జనసేన పోరాటం చేస్తుంది. మత్స్యకార యువతలో తెగింపు ఉంది. లోతైన సముద్రంలోకి దూకాలంటే ఎంతో ధైర్యం ఉండాలి.
మీరు సత్యలింగ నాయకర్ వారసులు. మీ వేదనను కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తా. మీకు ఉపాధి అవకాశాల కోసం సంపూర్ణంగా కృషి చేస్తా. ఏ పనీ చేయకుండా అధికారంతో దోచేస్తున్నారు. కష్టపడే వాడి దగ్గర క్యాపిటల్ ఉండాలి” అని పవన్ అన్నారు. ఆత్మీయ సమావేశంలో మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు పవన్ కల్యాణ్. నేను మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారాయన.
నాయకర్.. మత్స్యకార విభాగం అధ్యక్షుడు
ఓఎన్జీసీ పైప్ లైన్ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులకు నష్ట పరిహారం ఇవ్వడం లేదు. సముద్రంలో వేసిన పైప్ లైన్ వల్ల వ్యర్థ పదార్థాలను వదిలేస్తున్నారు. దాంతో మత్స్య సంపద మొత్తం తగ్గిపోతోంది. చమురు సంస్థల వల్ల ఎక్కువుగా నష్టపోయేది కాకినాడ మత్స్యకారులు. మేము కూడా అగ్రికల్చర్ లోకే వస్తాము. రైతులను గుర్తిస్తున్నారు. కానీ మమ్మల్ని గుర్తించడం లేదు. ఈ ప్రభుత్వం 217 జీవో తెచ్చి మత్స్యకారుల పొట్ట కొట్టింది. ప్రకృతి వైపరీత్యాలు వస్తే మొట్టమొదటిసారి బలైపోయేది మత్స్యకారులే. మత్స్యకారులు చనిపోతే 10 లక్షల బీమా ఇస్తానని చెప్పారు. కానీ, ఎక్కడా అమలు కాలేదు.