RK Roja: నగరి వైసీపీ ఇన్‌చార్జ్‌గా గాలి జగదీశ్ ఖాయమా? ఆర్కే రోజా ట్వీట్ వెనుక అర్థమేంటి?
ఇన్నాళ్లు కిందా మీద పడి నెట్టుకొచ్చిన రోజా..ఇప్పుడు మాత్రం గాలి జగదీశ్ చేరికను అడ్డుకోలేని సిచ్యువేషన్‌లోకి ఉన్నారట.

Minister Roja
నమ్మి వైసీపీ అధినేత వెంట నడిచారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు ఆర్కే రోజా. రెండోసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సొంత పార్టీ వైసీపీలో ఆమెను కష్టాలు వెంటాడుతున్నాయి. గత ఎన్నికల ముందు నుంచి నగరిలో రోజాకు తలనొప్పులు ఎక్కువయ్యాయి.
మొన్నటి ఎలక్షన్స్‌లోనే రోజాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవచ్చన్న చర్చ జరిగింది. గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ వైసీపీలో చేరుతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూ వస్తోంది. ఎప్పటికి అప్పుడు గాలి జగదీష్ రాకను అడ్డుకుంటూ వస్తున్న రోజా..గత ఎన్నికలకు ముందు పట్టుబట్టి మరీ వైసీపీ టికెట్ తెచ్చుకున్నారు. గాలి జగదీష్ సోదరుడు గాలి భానుప్రకాశ్ చేతిలో ఓడిపోయారు.
వైసీపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా గాలి జగదీష్ ఫ్యాన్ పార్టీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నెల రోజుల క్రితమే గాలి జగదీశ్ వైసీపీలో చేరికకు అంతా సిద్దమైనా ఎందుకో బ్రేక్ పడింది. సొంత అన్న భానుప్రకాశ్‌ను దెబ్బ కొట్టాలన్న కసి మీదున్న గాలి జగదీశ్..వైసీపీలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన రాకను అడ్డుకునేందుకు రోజా వేస్తున్న ఎత్తులు కూడా మామూలుగా లేవు.
నెల రోజుల క్రితమే వైసీపీలో చేరేందుకు బయలుదేరిన గాలి జగదీశ్ మధ్యలోనే ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. అప్పుడు అయితే గాలి జగదీశ్ చేరికను అడ్డుకోగలిగిన రోజాకు..ఈసారి మాత్రం తన ప్రయత్నాలు ఫలించడం లేదట. ఈ నేపథ్యంలోనే ఆర్కే రోజా చేసిన ఓ ట్వీట్ ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
రోజాకు జగన్ హ్యాండిస్తున్నారనే టాక్
హెల్ప్ అనేది చాలా విచిత్రమైంది. చేస్తే మరచిపోతారు..చేయకపోతే గుర్తు పెట్టుకుంటారంటూ రోజా ట్వీట్ చేశారు. దీనిపై ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. రోజాకు జగన్ హ్యాండిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆమె చేసిన ట్వీట్ పార్టీలో తన స్థాయిని తగ్గించేశారనడానికి సంకేతమా అన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. నగరి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా రోజా స్థానంలో గాలి జగదీశ్‌కు బాధ్యతలు ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే విషయాన్ని వైసీపీ అధినేత జగన్ రోజాకు క్లియర్ కట్‌గా చెప్పేశారని..అందుకే ఆమె అసంతృప్తితో ట్వీట్ చేశారని చర్చ జరుగుతోంది.
లేడీ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోజా.. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో కొంతకాలం టీడీపీలో పనిచేశారు. తర్వాత వైసీపీ కీలక లీడర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే ఏ పార్టీలో ఉన్నా పొలిటికల్‌గా ఆమెకు ఎప్పుడు తలనొప్పులు ఉంటూనే ఉన్నాయి. వైసీపీలో చేరాక అయితే ఓడినా, గెలిచినా..ఇంటా, బయటా ఇక్కట్లు తప్పట్లేదు. ఇప్పుడు ఏకంగా నియోజకవర్గ ఇంచార్జ్‌గా మరొకరికి అవకాశం ఇస్తామనడంతో ఆమె తీవ్ర నిరాశలో ఉన్నట్లు లోకల్ లీడర్లు, క్యాడర్ గుసగుసలు పెట్టుకుంటున్నారు.
మొన్నటి ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ కేజే కుమార్ దంపతులతో పాటు పలువురు నేతలు బహిరంగంగానే ఫ్యాన్ పార్టీ హైకమాండ్‌కు అల్టిమేటం ఇచ్చారు. అయితే నగరిలో తనకు వ్యతిరేక వర్గాన్ని క్రియేట్ చేసి..ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించేందుకు ఓ వైసీపీ కీలక నేత ప్రయత్నం చేస్తున్నారని రోజా ఎప్పటినుంచో ఆవేదనతో ఉన్నారు. ఆ మాజీ మంత్రి మీద అసంతృప్తిని బయటికి చెప్పకపోయినా వైసీపీ అధినేత దగ్గర పంచాయితీ పెడుతూ అడ్డంకులను ఎదుర్కొంటూ వస్తున్నారు రోజా.
ఇన్నాళ్లు కిందా మీద పడి నెట్టుకొచ్చిన రోజా..ఇప్పుడు మాత్రం గాలి జగదీశ్ చేరికను అడ్డుకోలేని సిచ్యువేషన్‌లోకి ఉన్నారట. ఆయనను చేర్చుకోవడంతో పాటు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు కూడా ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఇక తనకంటూ సొంత నియోజకవర్గమే లేకుండా పోతుందని..తన పొలిటికల్ లైఫ్ డైలమాలో పడే ప్రమాదం ఉందని రోజా ఫీల్ అవుతున్నారట. అందులో భాగంగానే ఆమె ట్వీట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గాలి జగదీష్ చేరిక ఖాయమేనా.? ఒకవేళ ఆయనకు నగరి వైసీపీ ఇంచార్జ్ బాధ్యతలు ఇస్తే రోజా రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది వేచి చూడాలి.