కుటుంబ పెత్తనానికి చెక్ పెడుతున్న జగన్

  • Published By: chvmurthy ,Published On : January 11, 2019 / 03:40 PM IST
కుటుంబ పెత్తనానికి చెక్ పెడుతున్న జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పెత్తనానికి వైఎస్ జగన్ చెక్ పెట్టబోతున్నారా ?…… జిల్లాల్లో అలాంటి వారి హవా తగ్గించేందుకు ఇప్పటి నుంచే సంకేతాలు పంపుతున్నారా?…. కుటుంబానికి రెండుకి మించి సీట్లు ఇవ్వనని ఖచ్చితంగా ఆయన చెప్పేస్తున్నారా ?.. దీంతో పార్టీ సీనియర్లలో గుబులు రేగుతోందా…పార్టీలో ఏం జరుగుతోందో ఒకసారి చూద్దాం.
తెలంగాణా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇక అందరి దృష్టి ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై పడింది. ఎలాగూ రెండు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి జరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ టికెట్ల లెక్కలు వేయడం ప్రారంభించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే జనవరిలోనే దాదాపు 70 స్థానాల వరకు అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పారు. ఇక వైసీపీ కూడా తెరవెనుక అభ్యర్థుల ఎంపికను ప్రారంభించింది. ఈ మధ్య కాలంలో వివిధ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ ల మార్పు దానిలో భాగమే అని తెలుస్తోంది. అయితే ఇదే సందర్బంలో ప్రధానంగా జిల్లాల్లో తన పార్టీపై ఒకే కుటుంబ పెత్తనం ఎక్కువగా లేకుండా చూడాలని అధినేత జగన్  ఓ నిర్ణయం తీసుకున్నారట. దీంతో జిల్లాల్లో ఇప్పటి వరకు తిరుగులేదనకున్న కొందరు నేతల హవాకు చెక్ పడే అవకాశం ఉంది. 
ఉత్తరాంధ్రలో 
జిల్లాల్లో కుటుంబ పెత్తనం సాగించే వారిలో బొత్స, ధర్మాన, మేకపాటి వంటి పార్టీ సీనియర్ నేతల కుటుంబాలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ తిరుగులేని నేత. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సీఎం అభ్యర్థిగా కూడా ప్రచారంలో ఉండేవారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. వైఎస్ దగ్గర ఆయనకున్న పలుకుబడి ఉపయోగించుకుని తన కుటుంబానికి నాలుగుసీట్లు తెప్పించుకోగలిగారాయన. ఆ ఎన్నికల్లో జిల్లాలో చీపురుపల్లి నుంచి బొత్స గెలిస్తే, ఆయన సోదరుడు బొత్స అప్పలనర్సయ్య, మేనల్లుడు బడ్డుకొండ అప్పలనాయుడు ఎమ్మెల్యేలుగా గెలిచారు.. ఇక బొత్స సతీమణి ఝాన్సీ ఎంపీగా గెలుపొందారు. 2009 డీలిమిటేషన్ తర్వాత విజయనగరం జిల్లాలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 12 నుంచి 9కి పడిపోయింది. వీటిలో 3 అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానం కూడా బొత్స కుటుంబం దక్కించుకోవడంతో అప్పట్లోనే పార్టీలో అసంతృప్తి చెలరేగింది. అప్పట్లో జిల్లాలో మరో మంత్రి, సీనియర్ నేత శత్రుచర్ల బహిరంగంగానే వైఎస్ పై  తన అసంతృప్తిని వెళ్లగక్కారు.  ఇవన్నీ తెలుసుకున్న జగన్ మాత్రం కుటుంబ సంస్కృతికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. దీంట్లో భాగంగా బొత్సాను విజయనగరం నుంచి ఎంపీగా రంగంలోకి దించి.. జిల్లాలో చీపురుపల్లి లేదా నెలిమర్లలో ఒక స్థానాన్ని మాత్రమే ఇస్తామని తేల్చుకొండంటూ ఖరాఖండిగా చెప్పేశారని ప్రచారం జరుగుతోంది. 
ఇక పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాలోనూ ధర్మాన కుటుంబానికి రెండు సీట్లే ఇస్తామని చెప్పేశారంటున్నారు. ధర్మానతో పాటు సోదరుడు కృష్ణదాస్, ఆయన సతీమణి టిక్కెట్లు ఆశిస్తున్నవారిలో ఉన్నారు. అయితే కుటుంబానికి రెండే ఇస్తామని, మీరే తేల్చుకోడంటూ బంతిని వాళ్ల ఫ్యామిలీ కోర్ట్ లో వేశారుట జగన్.
నెల్లూరు జిల్లాలో 
నెల్లూరు విషయానికోస్తే సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి కుటుంబానికి ఇదే సమస్య వచ్చిపడిందంటున్నారు. మేకపాటి ఈసారి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఆయన కుమారుడు మేకపాటి గౌతమ్, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీ బరిలో దిగాలని రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయితే ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, లేకుంటే రెండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఇస్తానని. మూడోసీటుకు గ్యారంటీ ఇవ్వలేనని విజయసాయి రెడ్డి చేత జగన్ చెప్పించారంటున్నారు. 
అందరికీ ఒకటే రూలని తనూ త్యాగం చేసిన జగన్ 
కుటుంబ పెత్తమనం విషయంలో పార్టీ నేతలకు, క్యాడర్ కు బలమైన సంకేతాలు పంపించడానికి జగన్ కూడా త్యాగం చేసారని చెపుతున్నారు. ఈసారి వైఎస్ కుటుంబం నుంచి తాను పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా, కడప పార్లమెంట్ కు తిరిగి అవినాష్ రెడ్డి మాత్రమే పోటీ చేస్తారంటూ జగన్ క్లారిటీ ఇచ్చారంటున్నారు. వైఎస్ విజయమ్మ గానీ, షర్మిల గానీ పోటీ చేయరని, అలాగే జగన్ బంధువు వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు బరిలో ఉండేది అనుమానమేనని, మాగుంట శ్రీనివాసుల రెడ్డిని సుబ్బారెడ్డి స్థానంలో నిలబెట్టేందుకు విజయసాయి రెడ్డి పావులు కదుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా పార్టీలో బలమైన నేతలకు చెప్పడం ద్వారా అన్ని జిల్లాలకు పార్టీ స్టాండ్ తెలియచేసినట్లవుతుందని జగన్ భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ అధికారం చేజిక్కించుకునేందుకు మొహమాటానికి పోకూడదని జగన్ నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.