జగన్ చేతిలో ఏపీని పెడితే.. బిర్యానీలా తినేస్తాడు : నాగబాబు బరస్ట్

జగన్ చేతిలో ఏపీని పెడితే.. బిర్యానీలా తినేస్తాడు : నాగబాబు బరస్ట్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నాగబాబు మరోసారి ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆయన చేతికిస్తే బిర్యానీ చేసుకుని తినేస్తాడంటూ విమర్శలకు దిగారు. మై ఛానల్, నా ఇష్టం పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నటుడు నాగబాబు ఏపీ రాజకీయ నాయకులను ఏకిపారేస్తున్నారు. సంచలనాత్మకంగా ఓ వీడియోను పోస్టు చేసి అందరినీ షాకింగ్‌కు గురి చేశారు. పాదయాత్ర చేస్తుండగా అతనితో కలిసి నడుస్తున్న మరో వైసీపీ నేతతో చేసిన జగన్ వ్యాఖ్యలను పోస్టు చేసి విమర్శలు లేవనెత్తాడు. 

 

అందులో జగన్ మాట్లాడుతూ.. ‘రాజకీయం అంటే డబ్బు కుమ్మరించడం, ఓట్లను కొనడం, గెలిచాక దోచుకోవడం ఇదే జగన్ పద్ధతి, ఆయన పార్టీలో చేరేవారిది కూడా ఇదే విధానం. అతడు చాలా డబ్బున్నోడు సర్.. పర్లేదు సర్. అంటే దానికి డబ్బులు ఉండటం కాదు ఖర్చుపెడతాడా? అంటూ జగన్‌ ఓ వైసీపీ నేతతో మాట్లాడినట్లు ఉంది. 

 

వైసీపీ నేతల సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. ‘మీరు ఇవాళ ఏదైతే కావాలనుకుంటున్నారో.. ఏదైతే నష్టపోతున్నాం అనుకుంటున్నారో ఇంకా రెండే రెండేళ్లు ఓపిక పట్టండి. మనం అధికారంలోని వచ్చిన తర్వాత ఇవాళ మీరు పోయింది అనుకున్నది నాలుగింతలు మీకు వచ్చేటట్టు చేస్తానని మాత్రం నేను హామీ ఇస్తున్నారు. కొద్దిగా ఓపికతో రెండేళ్లు ఆగితే మన ప్రభుత్వమే వస్తుంది. ఆ తర్వాత మన ప్లేట్‌లో మన బిర్యానీ మనమే తినొచ్చు’ అని వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. 

 

ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌ను బిర్యానీలా చేసుకుని తినేద్దామని ప్లాన్ చేస్తున్నాడు. డబ్బు తీసే ఉద్దేశ్యముంటేనే రాజకీయాల్లో ఉండాలట. ఎన్నికల కమిషన్ ఇచ్చే డబ్బులు సరిపోవా? ఎమ్మెల్యే, ఎంపీలకు అవి చాలవా? ఎవరైనా డబ్బు తీయాలి? అనడం ఏంటి.. జగన్మోహన్ రెడ్డిగారు డబ్బు తీసే విషయంలో ఎంత బలంగా ఉన్నారో అర్థమవుతుంది. రెండేళ్లు ఆగితే ప్రభుత్వం వస్తుందట. నాలుగింతలు సంపాదించేందుకు హామీగా ఉంటానని చెప్పడంలోనే తెలుస్తుంది. అతను దోచుకోవాలని ఎంత బలంగా ఉన్నాడోననే విషయం’ అని నాగబాబు కామెంట్ చేశారు.