JanaSena: మిరా మిరా మీసం మెలి తిప్పుతూ.. జగన్‌ టార్గెట్‌గా జనసేన సమర శంఖం..!

పెద్దిరెడ్డే కాదు ఏ పిచ్చి రెడ్డి వచ్చినా భయపడం..అంటూ స్ట్రాంగ్‌ వాయిస్ వినిపించారు నాగబాబు.

JanaSena: మిరా మిరా మీసం మెలి తిప్పుతూ.. జగన్‌ టార్గెట్‌గా జనసేన సమర శంఖం..!

Updated On : February 3, 2025 / 7:54 PM IST

మిరా మిరా మీసం.. మెలి తెప్పుతున్నాడు జనం కోసం. శూన్యం నుంచి సునామీని సృష్టించిన సేనాని..ఇప్పుడు రాయలసీమ రాజకీయాలను రసవత్తరంగా మార్చేస్తున్నారు. పదేళ్లు పోరాడి..తలపడి..నిలబడితే దక్కిన అధికారాన్ని నిలబెట్టుకునే వ్యూహంతో సరికొత్త పొలిటికల్ గేమ్‌ స్టార్ట్ చేశారు పవన్.

కూటమి పవర్‌లోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన జనసేనాని..వచ్చే ఎన్నికల నాటికి ఆ నాలుగు జిల్లాలను తన సైన్యంగా మార్చుకునే వ్యూహం అమలు చేస్తున్నారు. అందుకోసం జగన్ కంచుకోట రాయలసీమ మీద నజర్ పెట్టిన సేనాని..పుంగునూరు నుంచి జంగ్‌ సైరన్ ఊదారు.

పవన్‌ అల్టిమేట్‌ పొలిటికల్‌ టార్గెట్ జగన్‌ను కొట్టడం. ఎన్నికలకు ముందు అధః పాతాళానికి తొక్కుతామని చెప్పి మరీ..వైసీపీని 11సీట్లకే పరిమితం చేసిన పవన్..ఇప్పుడు రాయలసీమ జిల్లాలో వైసీపీ తిరిగి కోలుకోకుండా ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం వైసీపీకి, జగన్‌కు పెద్ద అండగా ఉండే పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు. పుంగునూరు నుంచి పోరు శంఖారావం పూరించారు. జగన్‌ తర్వాత వైసీపీలో అతిపెద్ద లీడర్‌గా చెప్పుకునే పెద్దిరెడ్డి ఇలాఖ పుంగనూరులో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించింది.

 పెద్దిరెడ్డికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌
అంతేకాదు పెద్దిరెడ్డికి స్ట్రాంగ్‌ వార్నింగే ఇచ్చారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. పెద్దిరెడ్డి ఎవరెవరి ఆస్తులు కబ్జా చేశారో అన్నీ బయటికి తీస్తామన్న ఆయన..సమయం వచ్చినప్పుడు పెద్దిరెడ్డి, జగన్, ద్వారంపూడితో సహా ఎవరినీ వదలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు. పైగా అవకాశం దొరికినప్పుడల్లా పుంగనూరుకు వస్తానంటూ క్యాడర్, లీడర్లకు భరోసా ఇచ్చారు నాగబాబు.

తమ రాజకీయ వ్యూహంతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తున్నాయి టీడీపీ, జనసేన. ఇప్పటికే అవినీతి కేసుల ద్వారా ఆ పార్టీ నేతలపై ఒత్తిడి పెంచగా, మరోవైపు రాజకీయంగా వైసీపీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట. అటవీ భూములను ఆక్రమించారంటూ పెద్దిరెడ్డిపై ఇప్పటికే విచారణ స్టార్ట్‌ అయింది. ఇక కడపలో మహానాడు నిర్వహిస్తామని టీడీపీ ప్రకటించిన మరునాడే..అదే ప్రాంతంలోని పుంగనూరులో జనసేన సభ నిర్వహించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

రాయలసీమలో వైసీపీకి గతంలో గట్టి పట్టు ఉండేది. టీడీపీని స్థాపించి నలభై ఏళ్లు అవుతున్నా, రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు మూడు జిల్లాల్లో టీడీపీయేతర పార్టీలకే బలం ఎక్కువగా ఉండేది. ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లా మినహాయిస్తే కడప, కర్నూలు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో టీడీపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు ఎప్పుడూ రాలేదు.

iPhone SE 4: గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ ఎస్‌ఈ4 లాంచ్‌ కానుంది.. తక్కువ ధరకు..

మొన్నటి ఎన్నికల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత రావడంతో రాయలసీమలో కూటమి సునామీ రేపింది. ఉమ్మడి అనంతపురం జిల్లాను క్లీన్ స్వీప్ చేయగా, కడపలో పది సీట్లకు ఏడు చోట్ల గెలిచింది. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 12 సీట్లు స్వాధీనం చేసుకుంది. రాయలసీమలో ఇన్ని సీట్లు టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ రాలేదు. దాంతో ఇప్పుడున్న బలాన్ని సుస్థిరం చేసుకోవాలని టీడీపీ ప్రణాళిక రచిస్తోంది. ఇదే సమయంలో అధికార బలంతో రాయలసీమలోనూ జనసేన విస్తరణకు ప్లాన్ రెడీ అయింది.

టీడీపీ రాయలసీమ మీద ఫోకస్ పెట్టినా..ఇంత దూకుడుగా వెళ్లడం లేదు. పవన్‌ మాత్రం అందుకు భిన్నంగా బిహేవ్‌ చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఏ ఇష్యూ జరిగిన ఇట్టే వాలిపోతున్నారు. ఎంపీడీవో మీద అటాక్ వ్యవహారంపై సీరియస్ అయినా పవన్.. ఏకంగా ఫీల్డ్‌ విజిట్‌కు వెళ్లి జగన్‌కు వార్నింగ్ ఇచ్చి వచ్చారు. రాయలసీమ మీ జాగీరు ఏం కాదు..గూండాగిరి చేస్తామంటే ఊరుకునేది లేదంటూ ఓపెన్‌గానే స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

అవసరమైతే కడపలోనే క్యాంప్ ఆఫీస్‌ అంటూ..
అవసరమైతే కడపలోనే క్యాంప్ ఆఫీస్‌ పెడుతానంటూ ప్రకటించారు. దీన్ని బట్టే రాయలసీమ మీద పవన్‌ ఎంత కాన్సంట్రేట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అమరావతిలో కూర్చొనో , మీడియా ముందు కాకుండా..డైరెక్టుగా ఫేస్‌ టు ఫేస్ పాలిటిక్స్ చేస్తున్నారు సేనాని. అందుకే ఇప్పుడు డైరెక్టుగా వైసీపీ కీలక నేతలు అని చెప్పుకునే లీడర్ల నియోజకవర్గాల్లో సభలతో హోరెత్తిస్తున్నారు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సొంత జిల్లాపై టీడీపీ ఫోకస్ చేయగా, ఆ పార్టీకి చెందిన మరో ముఖ్యనేత పెద్దిరెడ్డిపై జనసేన యుద్ధం ప్రకటించినట్లు కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమలో పెద్దిరెడ్డి హవా నడిచింది. ఆయన సొంత నియోజకవర్గంలో వైసీపీ తప్ప మరో జెండా ఎగరడం అంత ఈజీ కాదన్న టాక్ ఉంది. అలాంటి చోట జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించడం..అదే వేదిక మీద పెద్దిరెడ్డి టార్గెట్‌గా నాగబాబు చేసిన కామెంట్స్‌ మరింత కాక రేపుతున్నాయి.

పెద్దిరెడ్డే కాదు ఏ పిచ్చి రెడ్డి వచ్చినా భయపడం..అంటూ స్ట్రాంగ్‌ వాయిస్ వినిపించారు నాగబాబు. దీంతో జనసేన పెద్ద ప్లానే చేసిందన్న చర్చ జరుగుతోంది. పెద్దిరెడ్డి పేరు ప్రస్తావిస్తూ డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చారంటే..జనసేన జగన్‌ టార్గెట్‌గానే పావులు కదుపుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాయలసీమలో జనసేన వ్యూహాలు ఫలిస్తాయా.? పెద్దిరెడ్డి, జగన్‌ లాంటి నేతలను కూడా ఓడించగలుగుతారా అనేది వేచి చూడాలి మరి.