అశ్రునివాళి : ముగిసిన వీరజవాన్ ప్రవీణ్ అంత్యక్రియలు

  • Published By: madhu ,Published On : November 11, 2020 / 03:50 PM IST
అశ్రునివాళి : ముగిసిన వీరజవాన్ ప్రవీణ్ అంత్యక్రియలు

Updated On : November 11, 2020 / 4:20 PM IST

Jawan Praveen Kumar Reddy Funeral : అశ్రునయనాల మధ్య వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. 2020, నవంబర్ 11వ తేదీ బుధవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలోని రెడ్డివారిపల్లిలో సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ప్రవీణ్ కు నివాళులర్పించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. సంతాపసూచికంగా ఆర్మీ సైనికులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.



భౌతికకాయంపై జాతీయ జెండాను ఉంచారు. ప్రవీణ్ వేసుకున్న డ్రెస్, షూస్, ఫొటోను ఆయన భార్యకు అందచేశారు. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో..కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రవీణ్ చిన్న కొడుకును ఎత్తుకున్న తండ్రి చితికి నిప్పంటించారు. ఈ సందర్భంగా..భారత్ మాతా కి జై, ప్రవీణ్ కుమార్ అమర్ రహే..అంటూ ప్రజలు పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు.



జమ్మూ-కశ్మీర్‌ మాచిల్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట జరిగిన ఎదురుకాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. వీరితో పాటు ఓ సైనికాధికారి, మరో బీఎస్‌ఎఫ్‌ జవాను సైతం ప్రాణాలు కోల్పోయారు. చొరబాటుకు యత్నించిన ముష్కరులను అడ్డుకునే క్రమంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.



అయితే ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ప్రాణాలు కోల్పోయిన సైనికుల్లో తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామానికి చెందిన జవాను ర్యాడా మహేష్‌, ఏపీలోని చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.



ప్రవీణ్‌ది చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని.. రెడ్డివారిపల్లె. ప్రవీణ్‌ గత 18 ఏళ్లుగా సైన్యంలో విధులు నిర్వహిస్తున్నారు.. మద్రాస్‌ రెజిమెంట్‌లో హవల్దార్‌గా ఉంటూనే కమాండో ట్రైనింగ్‌ తీసుకున్నారు. ప్రస్తుతం కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.. మచిల్‌ సెక్టార్‌లో జరిగిన ఆపరేషన్‌లో ప్రవీణ్‌ కూడా పాల్గొన్నారు.. దేశంలోకి చోరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను అడ్డుకునే ప్రయత్నంలో వీరమరణం పొందారు.