అనంతలో జేసీ దివాకర్ హవా తగ్గిందా?

రాయలసీమలో టీడీపీకి పట్టున్న జిల్లా అనంతపురం ఒక్కటే. అక్కడ కూడా పార్టీ ఇప్పుడు ఆపత్కాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో హిందూపురం, ఉరవకొండ మినహా ఎక్కడా పార్టీ విజయం సాధించలేదు. అయినా పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి పెరిగిపోవడంతో పార్టీకి ఇబ్బందిగా మారిందంటున్నారు. కీలకమైన శింగనమలలో తొలిసారిగా వైసీపీ జెండా ఎగిరింది.
ఇక్కడ నుంచి కాంగ్రెస్, టీడీపీల పలుమార్లు విజయం సాధించాయి. గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరగక ముందు ఇక్కడ జేసీ దివాకర్‌రెడ్డి వర్గం బలంగా ఉండేది. జేసీ పంచాయతీ సమితి ప్రెసిడెంట్‌గా ఉన్న ప్రాంతాలన్నీ ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. దీంతో ఇక్కడ జేసీకి ఎదురుండేది కాదు. ఆది నుంచి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండేదిక్కడ.
రాష్ట విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంపైపోయారు జేసీ. 2014లో జిల్లా నుంచి తాడిపత్రి స్థానంతో పాటు అనంతపురం పార్లమెంట్ స్థానం కింద ఉన్న ఏడు సీట్లలో ఆరింటిని గెలిపించి తన హవా తగ్గలేదని నిరూపించుకున్నారు జేసీ.
ఆ తర్వాత జేసీ వర్గం ఇక్కడ తమ హవాను తిరిగి చూపించాలని ప్రయత్నించింది. జిల్లాపై పెత్తనం కోసం ఎప్పుడూ పాకులాడే జేసీ.. అటు తమ సొంత నియోజకవర్గం అయిన తాడిపత్రితో పాటు అనంతపురం అర్బన్, గుంతకల్, శింగనమల, రాయదుర్గం ఇలా ప్రతిచోటా వేరు కుంపట్లు పెట్టి టీడీపీకి నష్టం చేకూర్చారని కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల్లో ఓటమే కారణమా? :
అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడు సీట్లలో అభ్యర్థులను మార్చాలని ఎన్నికల ముందు అధినేత చంద్రబాబు వద్ద పట్టుబట్టారు జేసీ దివాకర్‌రెడ్డి. చివరకు శింగనమల నియోజకవర్గంలో మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న యామినీబాలను కాదని జేసీ చెప్పిన బండారు శ్రావణికి బాబు టికెట్ ఇచ్చారు.
అనంతపురం ఎమ్మెల్యే సీటు విషయంలో చివరి వరకూ మార్చాలని పట్టుబట్టినా అది జరగలేదు. అంతే అక్కడ నుంచి జేసీ జోరు తగ్గిందంటున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జేసీ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని చెబుతున్నారు. 30 ఏళ్లు అనుభవించిన అధికార దర్పం ఒక్క ఓటమితో తుడిచి పెట్టుకుపోవడంతో ఆయన అసహనంగా ఉన్నారనే విషయం ఇటీవల ఒకట్రెంటు సందర్భాల్లో వ్యక్తమైంది.
ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో అధికారాన్ని కోల్పోయిన జేసీ తన ఆక్రోశాన్ని పోలీసుల మీద, అధికారుల మీద చూపిస్తున్నారట. దీనివల్ల తనకున్న ఇమేజ్‌ను తానే దిగజార్చుకుంటున్నారని అంటున్నారు. మరోపక్క ప్రభుత్వం వైపు నుంచి కూడా జేసీపై ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయని టాక్ నడుస్తోంది.
ఆయన ట్రావెల్స్ బస్సులను ఎప్పటికప్పుడు ఆర్టీఏ అధికారులు సీజ్ చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారని జేసీ అంటున్నారు. పార్టీ మారాలంటూ తనపై అధికార వైసీపీ ఒత్తిడి చేస్తోందని, అయినా తాను మారనని, న్యాయపరంగా పోరాటం సాగిస్తానని చెబుతున్నారు. అధికారంలో లేక ఒకవైపు.. ఒత్తిళ్లు మరోవైపు.. ఇలా జేసీ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారట.