Kesineni Swetha : కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా.. టీడీపీ అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు

కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా చేశారు. విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మికి కేశినేని శ్వేత తన రాజీనామా లేఖను అందించారు.

Kesineni Swetha : కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా.. టీడీపీ అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు

Kesineni Swetha

Updated On : January 8, 2024 / 1:32 PM IST

Kesineni Swetha Resign : కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా చేశారు. సోమవారం విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మికి కేశినేని శ్వేత తన రాజీనామా లేఖను అందించారు. తన కార్పొరేటర్ సభ్యత్వం రాజీనామా లేఖను కౌన్సిల్లో పెట్టి ఆమోదించాలని మేయర్ ను కోరారు. అనంతరం కేశినేని శ్వేత మీడియాతో మాట్లాడారు.. కార్పొరేటర్ పదవికి రాజీనామా ఆమోదం తరువాత టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పారు. నేను, ఎంపీ కేశినేని నాని టీడీపీని వదిలి వెళ్తామని కలలోకూడా ఊహించలేదని అన్నారు. అధినేత మమ్మల్ని వద్దనుకున్నారు.. టీడీపీని వదిలి వెళ్తున్నామని చెప్పారు. కేశినేని నానిని పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దన్నప్పుడు పార్టీలో ఉండటం సమంజసం కాదు.. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని శ్వేత అన్నారు.

Also Read : Telangana BJP : పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్.. నియోజకవర్గాలకు ఇంచార్జులు వీరే

ఏడాదిన్నరగా ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. అధినేత నందిగామ వచ్చినా, విజయవాడ వచ్చినా కేశినేని నానికి పిలుపులేదని శ్వేత ఆవేదన వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థులు లేరు. ఎదురెదురుగా కూర్చుని మాట్లాడితే ఒప్పుకునేవారం. పార్టీని నష్టపరచడానికి కొంత మంది ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాబలం ఉన్న వ్యక్తిని ఎందుకు దూరంగా ఉంచారని శ్వేత ప్రశ్నించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేశినేని నాని ఎంపీగా పోటీ చేస్తారని, మూడోసారి లోక్ సభలో అడుగు పెడతారని మా అందరికి నమ్మకం ఉందని శ్వేత అన్నారు. కేశినేని నాని అంటే పార్టీలకు అతీతంగా అందరూ అభిమానిస్తారని, ఏ విధంగా పోటీ చేయాలనే విషయంపై అభిమానులు, మద్దతు దారులతో కలిసి నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని శ్వేత చెప్పారు.

Also Read : Bilkis Bano : బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేత

రాజీనామాకు ముందు కేశినేని శ్వేత ఎమ్మెల్యే రామ మోహన్, ఆయన సతీమణి, కృష్ణా జిల్లా జెడ్పి మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధతో భేటీ అయ్యారు. రాజీనామాకు గల కారణాలు, తండ్రి కేశినేని నానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. సుమారు అరగంటపాటు వీరి మధ్య భేటీ సాగింది. అనంతరం శ్వేతా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రామ మోహన్ మా ఫ్యామిలీ ప్రెండ్. నేను వారి ఇంట్లో అమ్మాయిని. వారి ఇంట్లో పెరిగాను.నేను కార్పొరేటర్ గా గెలిచేందుకు సహకరించారు. అందుకు కృతజ్ఙతలు చెప్పేందుకు వచ్చాను, ఆయన దీవెనలు తీసుకున్నానని శ్వేత చెప్పారు. కార్పొరేటర్ పదవికి, టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

ఎమ్మెల్యే రామ మోహన్ మాట్లాడుతూ.. కేశినేని శ్వేత వచ్చి నన్ను కలిశారు. కృతజ్ఙతలు చెప్పారు. కార్పొరేటర్ పదవికీ, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని అన్నారు. నేను ఆల్ ది బెస్ట్ చెప్పాను. రాజకీయ భవిష్యత్తుపై జాగ్రత్తగా ఉండమని సూచించాను. అధిష్టానం అడిగితే కేశినేని శ్వేత వచ్చి కలిసిన విషయం చెబుతానని రామ మోహన్ అన్నారు.