YS Viveka Case Witness Deaths : ఏం జరుగుతోంది? వైఎస్ వివేకా కేసులో సాక్షుల వరుస మరణాలపై క్యాబినెట్ లో కీలక చర్చ..
అందుకే జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాను పదే పదే చెబుతూ వస్తున్నా అని సీఎం చంద్రబాబు మంత్రులతో అన్నారట.

YS Viveka Case Witness Deaths : ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలకమైన అజెండా అంశాలతో పాటు రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఏపీలో సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై కీలక చర్చ జరిగింది. సాక్షులు ఏ విధంగా చనిపోయారు అనే అంశంపై డీజీపీ, మంత్రులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. సాక్షుల వరుస మరణాల అంశాన్ని మంత్రివర్గం చాలా సీరియస్ గా తీసుకుంది.
వైఎస్ వివేకా కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న రంగన్న చనిపోవడంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. రంగన్న వైఎస్ వివేకానంద రెడ్డికి వాచ్ మన్ గా పని చేశారు. వివేకా కేసులో వరుసగా ఆరుగురు సాక్షులు చనిపోవటంపై మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే దీనిపై ఎంక్వైరీ జరగాలనే అంశం చర్చకు వచ్చింది. ఆరుగురు సాక్షులు ఏ విధంగా చనిపోయారు అనే దానిపై వివరాలను అందజేశారు డీజీపీ.
Also Read : ప్రమాదపు అంచున శ్రీశైలం ప్రాజెక్ట్..? ఏపీ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ కీలక ఆదేశాలు
ఈసీ గంగిరెడ్డి, డ్రైవర్ నారాయణ, అభిషేక్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, రంగన్న.. ఇలా సాక్షులు వరుసగా చనిపోవడం కలకలం రేపుతోంది. వివేకా హత్య కేసులో నిందితులు ఒక్కొక్కరుగా చనిపోతున్న అంశంపై దాదాపు గంటపాటు డిస్కస్ చేశారు. రంగయ్య మృతికి సంబంధించిన వివరాలను డీజీపీ మంత్రులకు తెలిపారు. వివేకా హత్యను తొలుత గుండెపోటుగా చిత్రీకరించినట్లే.. ఇప్పుడు రంగయ్యను పోలీసులు చంపారంటూ మీడియాలో కథనాలు రావటంపై మంత్రివర్గం అనుమానాలు వ్యక్తం చేసింది.
అందుకే జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాను పదే పదే చెబుతూ వస్తున్నా అని సీఎం చంద్రబాబు మంత్రులతో అన్నారట. పరిటాల రవి హత్య కేసులో సాక్షులు ఇలానే చనిపోతూ వచ్చారనే విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. రంగయ్య మృతి ముమ్మాటికీ అనుమానాస్పదమే అని సీఎం చంద్రబాబు అన్నారు. అనుమానాస్పద మృతేనని పోలీసుల విచారణలోనూ నిర్ధారణ అయిందని డీజీపీ చెప్పారు.
Also Read : బంగారం కొనడంలో మనమే టాప్.. ధరలు తగ్గడమే ఆలస్యం.. తెగ కొనేస్తున్నారు మనోళ్లు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!
ఏ దురుద్దేశం లేకపోతో సొంత మీడియాలో రంగన్న మృతిని పోలీసులకు ఆపాదించాలని ఎందుకు చూస్తారనే చర్చ జరిగింది. రంగన్నను హత్య చేసి అది కూడా ప్రభుత్వానికి ఆపాదించాలనే కుట్ర ఇందులో దాగి ఉందని మంత్రివర్గంలో చర్చ జరిగింది. మరో సాక్షి దస్తగిరికి వచ్చిన బెదిరింపుల అంశంపైనా డిస్కస్ చేశారు.
ఉన్న అనుమానాలతో కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చించారు. సీబీఐ పరిధిలో కేసు ఉన్నా సాక్షులను రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వివేకా కేసులో సాక్షులు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం దురదృష్టకరం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.