ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు : రాష్ట్ర ప్రభుత్వం V/S ఎన్నికల కమిషన్

  • Published By: bheemraj ,Published On : November 18, 2020 / 09:26 AM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు : రాష్ట్ర ప్రభుత్వం V/S ఎన్నికల కమిషన్

Updated On : November 18, 2020 / 10:46 AM IST

AP Local body elections : ఏపీ ప్రభుత్వం వర్సెస్‌ ఎన్నికల కమిషన్…స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇది. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో వాయిదా వేసిన స్థానిక ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో ఎలాగైనా నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. అదే సమయంలో ఎన్నికల నిర్వహణ తాత్కాలికంగా నిలిపివేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కరోనా తీవ్రత తగ్గిందని..ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ అంటోంటే..చలికాలంలో వైరస్ విజృంభించే ప్రమాదముందన్న కేంద్రం హెచ్చరికలను ప్రస్తావిస్తూ….ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం అంటోంది.



బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్‌, ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ ఉదాహరణగా చూపుతోంటే..మిగిలిన ఏ రాష్ట్రాలతో ఏపీని పోల్చిచూడవద్దంటోంది ప్రభుత్వం. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ ఆలోచన సరైన నిర్ణయం కాదని…ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని…ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు లేఖరాయడం…ఈ లేఖ….ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమేనని నిమ్మగడ్డ బదులివ్వడం…ఈ వ్యవహారంలో తాజా పరిణామం…



https://10tv.in/state-election-commissioner-nimmagadda-ramesh-kumar-responded-to-ap-cs-neelam-sahnis-letter/
వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్‌ ప్రకటించడంతో ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక షెడ్యూల్ ఖరారు చేస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిందని, ఒకప్పుడు రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదయితే..ప్రస్తుతం వాటి సంఖ్య రెండు వేలకు తగ్గిందని ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ అన్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకున్నామని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడామని…అన్ని పరిస్థితులు గమనించాక….రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ఉందని గమనించి..ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యామని తెలిపారు.



బీహార్ ఎన్నికలు సహా…అనేక రాష్ట్రాల్లో ఉప ఎన్నికల తీరును పరిశీలించామని…ఎన్నికల వల్ల కరోనా వ్యాప్తి చెందినట్టు తెలియలేదని ఆయన అన్నారు. ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో కరోనా నియంత్రణలో పంచాయితీలు, స్థానిక నాయకత్వం కీలక పాత్ర పోషించాయని, రాష్ట్రంలోనూ స్థానిక ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు అందుబాటులోకొస్తే కరోనాను మరింత మెరుగ్గా నియంత్రించగలమని భావిస్తున్నామని చెప్పారు.



ఎన్నికల కమిషన్ ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన సరైన నిర్ణయం కాదంటూ…ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని..ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతోందని…చలికాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కేంద్రం హెచ్చరించిందని లేఖలో పేర్కొన్నారు సాహ్ని. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదన్నారు. ఎన్నికల నిర్వహణపై ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు సమాచారమిచ్చారని ప్రస్తుత పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని ఆమె అబిప్రాయపడ్డారు.



స్థానిక ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఎలక్షన్‌ కమిషన్‌కు తెలియజేస్తామని లేఖలో చెప్పారు సాహ్ని…అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖపై ఎన్నికల కమిషనర్ తీవ్రంగా స్పందించారు. సీఎస్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా బదులిచ్చిన నిమ్మగడ్డ….ఆమె లేఖ ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమేనని మండిపడ్డారు. లేఖపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఎన్నికలు నిర్వహించాలనుకున్నామని తెలిపారు.



అటు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఇవాళ గవర్నర్ విశ్వభూషణ్‌ను కలవనున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ కానున్నారు. ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తుండడం, ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేకపోవడం వంటి పరిణామాల మధ్య ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తానికి స్థానిక ఎన్నికల నిర్వహణపై..ఏపీలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా…తీవ్ర ఉత్కంఠ నెలకొంది.