రండి..రండి : స్థానిక ఎన్నికలు..విశాఖలో YCP ఆపరేషన్ ఆకర్ష్

స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టింది. ఇనాళ్ళూ పార్టీ మారి దూరంగా ఉన్న నేతలను మళ్లీ వైసీపీ గూటికి ఆహ్వానిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం వరకు పదవులను వైసీపీ చేజిక్కించుకునేలా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. పార్టీ అధినేత, సీఎం జగన్ ఆదేశాలతో జిల్లా నాయకులు కార్యాచరణను పూర్తి చేస్తున్నారు. గ్రామాల్లో విపక్షాలకు చెందిన బలమైన నాయకులు, స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులను వైసీపీలో చేర్చడానికి ఆ పార్టీ నేతలు శ్రీకారం చుట్టారు.
సొంతపార్టీకి బలమైన అభ్యర్థులు లేనిచోట స్థానిక ఎన్నికల్లో పోటీకి టిక్కెట్ ఇస్తామని ఒకవేళ పోటీ తీవ్రంగా వుంటే, తమ అభ్యర్థి గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. దీంతో పార్టీలోకి భారీగా చేరికలు మెుదలయ్యాయి. విశాఖలో ఇనాళ్లూ ఏ పార్టీలోకి వెళ్లకుండా ఉన్న రెహమాన్, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, కాపునాయకులు తోట రాజీవ్, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరమణ, వారితో పాటు వారి అనుచర వర్గం అంతా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎన్నికలు జరగనుండటంతో విజయసాయిరెడ్డి విశాఖలోనే ఉండి ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేసేవిధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే భారీగా చేరికలను ప్రోత్సహిస్తూ ప్రత్యర్థులను ముందుగానే దెబ్బతీస్తున్నారు.
మాజీ మంత్రి బాలరాజు జనసేనకు రాజీనామా చేయగానే వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాలు వల్ల అప్పట్లో వాయిదా పడింది. ఇప్పుడు జడ్పీ చైర్‌పర్సన్ పీఠం ఎస్టీ మహిళకు కేటాయించడంతో బాలరాజు తన కూతురు దర్శిణితో పాటు వైసీపీలో చేరారు. గూడెం కొత్తవీధి నుంచి జడ్పీటిసీగా పోటీ చేయించి జడ్జీ చైర్‌పర్సన్ సీటుపై గురి పెట్టారు. బాలరాజుకు పార్టీలో ఎలాంటి పదవి లేకపోయినా తన కూతురుకు జడ్పీచైర్‌పర్సన్ పదవి వచ్చే అవకాశం ఉంది. అటు మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ను సైతం పార్టీ కండువా కప్పి వైసీసీలోకి ఆహ్వానించారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర నియోజక వర్గం సీటు వైసీపీ నుంచి ఆశించారు. అయితే దాన్ని కేకే రాజుకు కేటాయించి సహకరించాలని కోరారు. అధికారంలోకి రాగానే మంచి పదవి ఇస్తామని బుజ్జగించారు. అయితే కెకె రాజుకు సహకారం అందిస్తామని చెప్పి గంటాకు ఉత్తర నియోజక వర్గం సీటు రాగానే టిడిపి కండువా కప్పుకున్నారు. కెకె రాజు ఓడిమికి పరోక్షంగా కారకుడయ్యాడు.
అయితే కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ ఒక్క చిన్న అవకాశం చేజార్చుకోకుండా వైసీపీ తైనాల విజయ్ కుమార్‌ను సైతం పార్టీలోకి ఆహ్వానించింది. మేయర్ పీఠం బీసీలకు దక్కడంతో వంశీకి తైనాలుకు చెరో రెండు సంవత్సరాలు చేసుకోనే ఒప్పదంతో ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. మరో వైపు జనసేనకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యను సైతం వైసీపీలోకి తీసుకున్నారు. ఇలా చిన్నా-పెద్ద నాయకులను అంతా పార్టీలోకి తీసుకుంటూ ప్రత్యర్థులను దెబ్బకోట్టే ప్లాన్ చేస్తోంది వైసీపీ.
స్థానిక సంస్థల్లో వీలైనన్ని ఎక్కువ పదవులను ఏకగ్రీవంగా చేజిక్కించుకోవాలంటే విపక్షాలకు చెందిన బలమైన నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులకు పదవులతోనే వల వేయాలన్నది వైసీపీ నాయకుల తొలి అస్త్రం. వైసీపీ, టీడీపీ…. నువ్వా నేనా అన్న పరిస్థితి ఉన్నచోట…. తమ అభ్యర్థి గెలుపునకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అయినా సహకరించాలని, ఇందుకు ప్రతిఫలంగా రానున్న రోజుల్లో నామినేటెడ్ పదవులు లేదా కాంట్రాక్టులు అప్పగిస్తామని చెబుతున్నట్టు గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. వైసీపీ వ్యూహాలతో టీడీపీ విలవిలలాడుతోంది.
Read More : స్థానిక ఎన్నికలు : నైరాశ్యంలో ప్రకాశం తెలుగు తమ్ముళ్లు..ఎందుకు